19, ఏప్రిల్ 2024, శుక్రవారం

బ్రహ్మరాక్షసత్వము

 "అకృత ప్రాయశ్చితాః, అప్రతిగ్ర్రాహ్య ప్రతిగ్రాహ్యః, ఆయాజ్యయాజనాధిపాపైః, రాక్షసత్వం ప్రాప్తాః, బ్రాహ్మాణాః బ్రహ్మరాక్షసాః""


చేయకూడని పనులు చేసిన వాటికి ప్రాయశ్చితాలు చేసుకొననివారు,ఏది పడితే అది దానము పుచ్చుకొనేవారు అనగా గ్రహింపకూడనివి గ్రహించేవారు, అనర్హులచే యజ్ణకార్యములు చేయించేవారు వారు బ్రాహ్మణులైనా బ్రహ్మరాక్షసులవుతారు""(గోవింరాజీయ వ్యాఖ్యానము నుండి)


రామాయణము బాలకాండములో దశరథమహారాజు పుత్రకామేష్టికై అశ్వమేధయాగము చేయతలపెట్టి వశిష్టాది మహర్షులందరి సమక్షములో తన కోరిక తెల్పి దీవెనలు పొందుతాడు. సరయూనది తీరమున ఉత్తరదిశగా యజ్ఞభూమిని సిధ్దపరిచి మంచిఋత్విక్కులను ఆహ్వానించి ఆ సందర్భముగ ఇలా అంటాడు.

"" ఛిధ్రం హి మృగయంతే~త్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః||,

నిహతస్య చ యజ్ఞస్య సద్యః కర్తాః వినశ్యతి||,(8-17),,

నేను చేసే ఈ యజ్ఞములో ఎటువంటి దోషములు లేని విద్వాసులు ఉన్నారు.అనగా ఈ అశ్వమేధయాగము చేయగలిగిన పండితులు గలరు.అంతేగాని బ్రహ్మరాక్షసత్వము పొందు జ్ఞానహీనులు లేరు.ఇది చాలా క్లిష్టమైన యజ్ఞము.తేలికైనది అయినచో అందరు నిర్వహించెదరు కదా.జాగ్రత్తగా నిర్వహించవలెను.లేనిచో కర్త వెంటనే నశించునని శాస్ర్తోక్తముగ నిర్వహించమని అభ్యర్థిస్తాడు.


రామాయణము చేసేపనులలో అశ్రధ్ద కూడదని,కార్యము చక్కగ నిర్వహించేవారిని ముందుగ మంచి ఎంపిక చేసుకోవాలని పైన చెప్పినట్లు బ్రహ్మరాక్షసత్వాన్ని పొందగల అవకాశమున్న ఋత్విజ్ఞులను యాగాలకి దూరముగ ఉంచాలని హెచ్చరిస్తున్నది.

కామెంట్‌లు లేవు: