19, ఏప్రిల్ 2024, శుక్రవారం

ఇప్పుడు చెప్పండి థాంక్సు

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

 *🌷జగదీశ్ కొచ్చెర్లకోట గారి కథనం🌷* 

                    🌷🌷🌷

సేమ్యా పాయసం చెయ్యడమెలాగో నేర్చుకుందాం బోయ్స్!


ఫేస్‌బుక్ చూసింది చాలుగానీ ముందా ఫోన్ పక్కనబడేసి లేచి ఆ లుంగీ అదీ కాకుండా ఎంచక్కా పాంటూ చొక్కా తొడుక్కోండి. ఒకవేళ ట్రాక్ వేసుకునుంటే మార్చక్కర్లా! దానిమీదకి ఆపోజిట్ కలర్ టీషర్టేదన్నా వేసుకోండి. బూడిదరంగు ట్రాక్ మీదకి నేవీ బ్లూ.. అలాగన్నమాట! మరీ ఎడ్డిమొహంలా కాకుండా కాస్త మొహం సబ్బుతో ఓ రెండుమార్లు రుద్దుకుని ఆ నాలుగు వెంట్రుకల్నీ పక్కకి దువ్వుకుని చాలా మర్యాదస్తుడైన అంకుల్లా బయల్దేరండి.‌


మీ వీధి చివర్లో ఉన్న మోర్‌కో, రత్నదీప్‌కో వెళ్లి ఓ రెండుమూడు వరసలు వదిలేసి బాగా లోపలికి వెళ్తే అక్కడుంటాయి సేమ్యా పేకెట్లు. సరిగ్గా చూసుకునేడవండి, నూడుల్స్ కూడా అలాగే తగలడతాయి. తెలీకపోతే ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్సేసుకున్న అమ్మాజీని పిలిచి సేమ్యా పాకెట్టివ్వమని అడగండి. 


తీసుకున్నారా, ఇప్పుడు కాస్త వంగితే ఆ కిందరల్లో జీడిపప్పు, కిస్‌మిస్, యాలక్కాయలంటూ చిన్నచిన్న పొట్లాలు కట్టి పడేసివుంటాయి. అవి తలొకటీ తీసుకోండి. ఇప్పుడు బిల్ కౌంటర్ దగ్గరకి రాగానే పక్కనే బీరువా సైజులో ఫ్రిజ్ ఉంటుంది. అందులోంచి అముల్ ఎర్ర పాకెట్టొకటి తీసుకోండి. అంటే పాలు కాస్త చిక్కగా ఉంటాయని ఎర్రదన్నానన్నమాట.


అంతా అయింతరవాత వాడు మీ ఫోన్ నెంబరడుగుతాడు. చెప్పనని చెప్పండి. ఇచ్చారంటే ఆనక మధ్యాన్నాలప్పుడు అప్పులాళ్ళూ, అపార్ట్‌మెంటలోళ్ళూ పీక్కుతినేస్తారు. మహా అయితే ఏ రెండొందలేభయ్యో ఎంతో అవుతుంది. క్యాష్ ఇచ్చేస్తే బెటర్.


ఇంటికి రాగానే మళ్ళీ లుంగీలోకి మారండి. పైన బనీనొకటీ ఉంటే హోమ్లీగా ఉంటుంది. చొక్కాలవీ అవసరంలా!


ఇప్పుడు రెండు స్టవ్వులూ వెలిగించుకోవాలి. లైటర్ చాలాసేపు ఏడిపిస్తుంది కానీ స్టవ్ అంటుకోదు. సిగరెట్టలవాటుందా? ఉంటే లైటరో, అగ్గిపెట్టో ఉండేవుంటుంది జేబులో, తియ్యండి. అంటించారా? నే చెప్పేది స్టవ్వు. సిగరెట్టు కాదు. అది తరవాతంటిద్దురుగాని.


ఇప్పుడు ఒకదాని మీద పాలగిన్నె పెట్టండి. ఆవేశంగా మంట పెద్దది పెట్టెయ్యకండి, సిమ్‌లో ఉంచితే బెటర్. పక్క స్టవ్వుమీద ఓ చిన్న మూకుడొకటి పడేసి అందులో ఓ పెద్ద చెంచాడు నెయ్యి పొయ్యండి. అది మీ మేనేజర్లా కాసేపు చిటపటలాడుతూ ఉండగానే అందులో ఒక గ్లాసుడు సేమియా వేసి కాస్త రంగు మారేవరకూ వేయించుకోండి. ఆనక అదే మూకుట్లో మళ్ళీ ఓ నేచ్చుక్క వేసుకుని అరడజను జీడిపప్పులు, మరో అరడజను కిస్‌మిస్‌లు వేసి బాగా కలుపుతూ కొంచెం ఎర్ర రంగు రాగానే స్టవ్వాపెయ్యండి. 


ఈలోగా పాలవైపొకసారి చూడండి. అవెలాగూ ఏ పాపమూ ఎరుగని పాపాయిలా తెల్లమొహం వేసుకు చూస్తుంటాయి. మనకి సహనం నశిస్తుంది. స్టవ్ మంట ఒక నెంబరు వరకూ పెంచండి. అప్పుడు గిన్నె అంచులమ్మట అలజజడి మొదలవుతుంది. అదుగో, అప్పట్నుంచి మీరిక అప్రమత్తంగా ఉండాలన్నమాట. ఆ రెండు నిముషాలూ ఏ ఫోనూ రాకూడదని, ఎవరూ కాలింగ్‌బెల్లదీ కొట్టకూడదని సాయిబాబాకి దణ్ణం పెట్టుకుని వేళ్ళు పిసుక్కుంటూ పాలవైపు చూస్తుండండి.


ఖాళీగా ఉండడం ఎందుకూ అనుకుంటే చిన్న పాలరాయి అమాన్‌దస్తాలో ఓ నాలుగు యాలక్కాయలు పడేసుకుని బాగా నూరుకోవచ్చు. తిరపతి లడ్డూలో పడేసినట్టు తొక్కలవీ పాయసంలో పడేసుకోకండి, తినడానికి చిరాగ్గా ఉంటుంది.


కాసేపటికి పాలగిన్నె దగ్గర చిన్న శబ్దం వినబడుతుంది. పొంగిపోతాయేమోనని మనకి భయమేస్తుంది, స్టవ్ తగ్గించేస్తాం, ఆ తరవాత రెండు నిముషాలు శంకరాభరణం మొదటి రెండువారాల కలెక్షన్స్‌లా స్తబ్దుగా పడుంటాయి పాలు. ఇక సహనం మరింత నశించి ఇంకొంచెం పెంచుతాం. వెంటనే ఆమధ్య కేదార్‌నాథ్‌లో చెప్పాపెట్టకుండా వరదలొచ్చేసినట్టు పాలు పొంగిపోయి గిన్నెదాటి స్టవ్వు మీదపడి డిజైన్లెయ్యడం మొదలెడతాయి. 


అంచేత స్టవ్ ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచకండి. నామాటిని కంగారుపడకుండా స్ట్రెస్ తగ్గడానికి పదంకీలు లెక్కబెట్టుకుంటూ ఈ వేయించిపెట్టుకున్న సేమ్యానీ, జీడిపప్పుల్నీ కిందామీదా పోసుకోకుండా ఆ పాల ఎసట్లో పోస్తూ కలపండి. కాసేపటికి పాలు శాంతించి నిదానంగా మనవైపు కుతకుతలాడుతూ చూస్తుంటాయి. 


అవలా ఉడుకుతుండగానే దగ్గరపడకముందే మంటాపెయ్యడం బెటర్. లేకపోతే పాయసం తాగడానికి గ్లాసు బదులు కత్తి వాడాల్సొస్తుంది. 


అయిపోవచ్చింది, ఇపుడేంచేస్తారంటే ఒక చిన్నగ్లాసుడు పందార తీసుకుని ఈ తయారైన సేమియా పాయసంలో పోసుకుని బాగా కలియదిప్పండి. 


ఆనక ఆ యాలకుల పొడుంది కదా, అది కూడా పైన చల్లేసి సున్నితంగా, సుకుమారంగా కలుపుతూ ఆ పరిమళాన్ని టీవీ అడ్వర్టైజ్‌మెంట్లలో స్నేహలా ఆస్వాదించండి. 


ఇప్పుడు క్రోకరీ అల్మరా దగ్గరకెళ్లి ఓ నాలుగైదారేడు సంవత్సరాల నుంచీ వాడకుండా ఊరికే అలా దాచుంచుకున్న మాంఛి వెడల్పాటి బౌలొకటి తీసుకోండి. దానిమీద లేలేత పువ్వుల డిజైన్లవీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మరీ ప్లెయిన్‌గా ఉంటే ఫీల్ రాదు. ఒకవేళ మీయింట్లో వెండిగిన్నుంటే అదే బెటరు. కాస్త ఘనంగా ఉంటుంది.


అందులోకి ఓ నాలుగైదు పెద్ద స్పూన్ల పాయసం వేసుకుని చూడండి.


నా సామిరంగా... ఎర్రెర్రటి జీడిపప్పులు అక్క పెళ్లికి ప్రత్యేకంగా మేకప్పైన చెల్లెళ్లలా ఉత్సాహంగా తిరిగేస్తుంటాయి. కిస్‌మిస్సులేమో పెళ్లిపందిట్లో పెద్దవాళ్లు పిలుస్తోంటే సిగ్గుపడుతూ తలుపెనకాల దాక్కునే పిల్లల్లా అక్కడక్కడా దాక్కుంటాయి. 


చూడటానికే ఇంత వైభవంగా ఉంటే ఇక తింటే ఎలా ఉంటుందో నే చెప్పాలా? 


ఇంకెందుకూ లేటు, కంటిముందున్నది పంటికిందకెళితే ‘అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా...’ పాటందుకోవడం ఖాయం!


ఇప్పుడు చెప్పండి థాంక్సు!


ఉగాది శుభాకాంక్షలర్రా! నాకీ సాయంత్రం కవి సమ్మేళనం ఉందని రాశిఫలాల్లో రాసుంది. విధినెవడు తప్పించగలడు? కాసేపలా వెళ్లొస్తా!


మీ....


కొచ్చెర్లకోట జగదీశ్

కామెంట్‌లు లేవు: