*ఆదిశంకరుల సన్యాసాశ్రమ స్వీకరణ*
శ్లో.
తస్యోపదర్శితవతశ్చరణౌ గుహాయా ద్వారే న్యపూజయదుపేత్య స శంకరార్య : /
ఆచార ఇత్యుపదీదేశస తత్ర తస్మై గోవిందపదగురవే స గురుర్యతీనాం //
గోవిందభగవత్పాదులు నివాసమున్న గుహద్వారం ముందు నిలబడి శంకరులు,
' ఓ గురువర్యా ! తమ పాదపూజ చేయాలని ఈ శిష్యుడు ఆశిస్తున్నాడు. దయతో అనుమతించండి. ' అని ప్రార్ధించగా, గోవిందయతీంద్రులు గుహనుండి బయటకు రాకుండా, తమ పాదాలను గుహ ముఖద్వారంవద్ద వుంచి, పాదపూజకు అనుమతిని ఇచ్చినట్లుగా సంకేతం ఇచ్చారు.
శంకరులు కూడా పరమభక్తితో గురుదేవుని పాదపద్మాలను పూజిస్తూ, ' గురుపాదపూజ ప్రతిశిష్యుడూ చేయవలసిన ప్రధమసేవ ' అని భావించారు. గోవింద యతీంద్రులు కూడా ' ఇది గురుశిష్య సంప్రదాయం ' గా ఆమోదముద్ర వేశారు.
శిష్యుడు ఎంత తెలివైనవాడు అయినా గురుకృప తప్పక పొందాలి. ఆ గురుకటాక్షము లేనిచో అహంభావం వీడదు. గురుతత్వము బోధపడదు. ఆ శిక్షణలో భాగంగానే, శంకరులు గురువుగారైన గోవింద యతీంద్రులకు అనేక విధాలుగా వినయంతో పరిచర్యలు చేస్తూ, గురువుగారిని ప్రసన్నులుగా చేసుకుని వారివద్ద జ్ఞానతత్వాన్ని అభ్యసించ సాగారు.
శ్లో.
భక్తిపూర్వకృతతత్పరిచర్యా తోషితో>ధికతరం యతివర్య : /
బ్రహ్మతాముపదిదేశ చతుర్భిర్వేదశేఖరవచోభి రముశ్మై //
ఈవిధంగా పరిచర్యలు చేస్తున్న శంకరుల సంపూర్ణ భక్తికి గురుదేవులు, గోవింద భగవత్పాదులు సంతోషించి, శంకరులపై పరిపూర్ణ అనుగ్రహం చూపించి, నాలుగు వేదాలలోని మహావాక్యాలలోని వాచ్యార్థ లక్ష్యార్ధలను విశదపరచారు.
మహావాక్యాలు :
మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ : ఇది ఋగ్వేదం లోని ఐతరేయోపనిషత్తు లోనిది. లక్షణ వాక్యము.
ఇక రెండవది అహం బ్రహ్మాస్మి : యజుర్వేదంలో బృహదారణ్యకోపనిషత్తులోనిది ఇది అనుభవ వాక్యము.
మరి మూడవది తత్వమసి : సామవేదంలోని ఛాందోగ్యోపనిషద్ లోనిది ఉపదేశ వాక్యము.
చివరిగా నాలుగవది అయమాత్మా బ్రహ్మ : ఇది అధర్వణవేదములోని మాండూక్యోపనిషద్ నుండి గ్రహించబడినది. సాక్షాత్కార వాక్యము.
శ్లో.
సాంప్రదాయిక పరాశరపుత్ర ప్రో>క్త సూత్రమతగత్యను రోధాత్ /
శాస్త్రగూఢ హృదయం హి దయాళో: కృత్స్న మప్యయమ బుద్ధ సుబుద్ధి : //
గోవింద భగవత్పాదుల వద్దనుండి మహావాక్యాల సారం వినగానే శంకరులకు తాను అప్పటికే మననం చేసుకుంటున్న వ్యాసమహర్షి యొక్క బ్రహ్మసూత్రాలలోని అద్వైత రహస్యం జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
తదనుగుణంగా ' వ్యాసహృదయము, గురుదేవుల బ్రహ్మతత్వమూ ఒక్కటే ! ' అని శిష్యాగ్రగణ్యుడైన శంకరులు శాస్త్రములలో నిగూఢమైన విషయాన్ని గ్రహించారు.
శ్లో.
వ్యాస పరాశరుసుత: కిల సత్యవత్యాం తస్మాత్మజ శుకముని: ప్రథితానుభావ: /
తచ్ఛిశ్యతా ముపగత: కిల గౌడపాదో గోవిందనాధ మునిరస్య చ శిష్యభూత : //
గురుపరంపర చూద్దాం. సత్యవతికి పరాశరమహర్షి వలన వ్యాసమహర్షి జన్మించారు. వ్యాసమహర్షికి పరమశివుని దయవలన పుట్టుకతోనే వైరాగ్యం సంతరించుకున్న శుకయోగి కుమారునిగా ఆవిర్భవించారు. ఆ శుకబ్రహ్మ శిష్యులే గౌడపాదులు. వీరు పతంజలి మహర్షి అవతారమైన శ్రీ గోవిందనాధ యతీంద్రులను శిష్యులుగా అనుగ్రహించారు. గోవింద భగవత్పాదుల శిష్యులే మన ఆదిశంకరులు. ఈ విధంగా బ్రహ్మవిద్య శిష్యకోటిలోకి వ్యాప్తి చెందిందని తెలుసుకోవాలి. .
సమస్త భువనాలను తనతలపై మోస్తున్న ఆదిశేషుడు పతంజలి మహర్షిగా అవతరించారు. పతంజలి మహర్షి భూలోకంలో శబ్దజ్ఞానాన్ని తన వ్యాకరణం ద్వారా ప్రచారం చేస్తానని ప్రతినబూని, గోవింద భగవత్పాదులుగా అవతరించారు.
వారు తమ శిష్యఅగ్రగణ్యుడు, సాక్షాత్తూ శివస్వరూపమైన శంకరాచార్యులకు వ్యాకరణసూత్రాలతో బాటు, బ్రహ్మతత్వాన్ని బోధించారు. గోవింద భగవత్పాదులు దైవాంశ సంభూతులు. అలాంటి ఆదిశేషువు, పతాంజలుల అవతారమైన గోవింద దేశికులకు పరమశివుని అంశ అయిన ఆదిశంకరులు శిష్యునిగా రూపొందడం లోక కల్యాణార్థం జరిగిన శివలీలలోని భాగమే తప్ప వేరొకటి కాదు.
శ్లో.
సో>ధిగమ్య చరమాశ్రమమార్య : పూర్వపుణ్యనిచయై రధిగమ్యమ్ /
స్థాన మర్చ్యమపి హంసపురోగైరున్నతం ధ్రువ ఇవత్యై చకాశే //
అనేక పూర్వజన్మలపుణ్యాల వలన కేవలం విరాగులకు మాత్రమే దొరికే బ్రహ్మజ్ఞాన సముపార్జన అనే సాధన ముందుకు సాగడానికి అనువైన అంతిమ ఆశ్రమధర్మమైన సన్యాసాశ్రమాన్ని శంకరులు విధివిధానంగా గోవింద భగవత్పాదుల నుండి స్వీకరించారు.
ఆ సమయంలో ధ్రువమండలము అన్ని గ్రహాలకన్నా కాంతివంతంగా శోభిల్లింది. శంకరులు పరమహంస పరివ్రాజక సింహాసనం అధిష్టించి, యతులలోకి అగ్రగణ్యులై ప్రకాశించారు. అద్వైతవాణిని వినిపించడానికి కంకణధారులైనారు.
తెల్లని మంచుకొండల మీద మలిసంధ్యలోని సూర్యకాంతి పరుచుకున్నట్లు, శంకర యతీంద్రుల తెల్లని దేహకాంతి మీద నవ కాషాయవస్త్రం ధగధగలాడింది.
( ఆదిశంకరులు సాక్షాత్తూ పరమశివుని అవతారం కాబట్టి శంకరుల లీలలు శివలీలలే ! )
ఆదిశంకరుల జయంతి. వారి బోధలను ఆకళింపు చేసుకోవడమే వారికి మనం సమర్పించే నివాళి. 🌹💐🍎🙏💐🌹
జయజయ శంకర హరహర శంకర ! హరహర శంకర జయజయ శంకర !
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి