14, మే 2024, మంగళవారం

మహాభాగవతం

 *14.5.2024 ప్రాతఃకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*దశమస్కంధము - పూర్వార్ధము - నలుబది ఒకటవ అధ్యాయము*


*బలరామకృష్ణులు మథురలో ప్రవేశించుట*


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*


*41.1 (ప్రథమ శ్లోకము)*


*స్తువతస్తస్య భగవాన్ దర్శయిత్వా జలే వపుః|*


*భూయః సమాహరత్కృష్ణో నటో నాట్యమివాత్మనః॥9818॥*


*శ్రీశుకుడు నుడివెను* అక్రూరుడు ఇట్లు స్తుతించు చుండగా కృష్ణపరమాత్మ తన దివ్యరూపమును (శ్రీమహావిష్ణుస్వరూపమును) దర్శింపజేసెను. రంగస్థలము నందు ఒక నటుడు తన నటనకు తగిన రూపమును ప్రదర్శించిన పిమ్మట తెఱమఱుగున చేరినట్లు, ఆ వాసుదేవుడు అంతర్హితుడయ్యెను.


*41.2 (రెండవ శ్లోకము)*


*సోఽపి చాంతర్హితం వీక్ష్య జలాదున్మజ్య సత్వరః|*


*కృత్వా చావశ్యకం సర్వం విస్మితో రథమాగమత్॥9819॥*


భగవంతుడు తన రూపమును అంతర్ధానమొనర్చిన పిదప అక్రూరుడు త్వరత్వరగా జలముల నుండి బయటికి వచ్చెను. అనంతరము అతడు తన ముఖ్యవిధులను ముగించుకొని వచ్చి, రథమునందు ఉన్న బలరామకృష్ణులను గాంచి, ఆశ్చర్యపడుచు ఆసీనుడయ్యెను.


*41.3 (మూడవ శ్లోకము)*


*తమపృచ్ఛద్ధృషీకేశః కిం తే దృష్టమివాద్భుతమ్|*


*భూమౌ వియతి తోయే వా తథా త్వాం లక్షయామహే॥9820॥*


అంతట శ్రీకృష్ణుడు అతనిని ఇట్లు ప్రశ్నించెను. "నాయనా! నీవు భూతలముపైనను, ఆకాశమునందును, నీళ్ళలోను ఏవైనా అద్భుతదృశ్యములను గాంచితివా? నీ వైఖరి జూడగా నాకు అట్లనిపించుచున్నది".


*అక్రూర ఉవాచ*


*41.4 (నాలుగవ శ్లోకము)*


*అద్భుతానీహ యావంతి భూమౌ వియతి వా జలే|*


*త్వయి విశ్వాత్మకే తాని కిం మేఽదృష్టం విపశ్యతః॥9821॥*


*అప్పుడు అక్రూరుడు ఇట్లనెను* "శ్రీకృష్ణా! భూమియందును, ఆకాశమునందును, నీటిలోనుగల అద్భుతములు అన్నియును విశ్వస్వరూపుడవైన నీలోనేగలవు. నేను నిన్నే చూచుచున్నప్పుడు ఇంక నేను చూడని అద్భుతములు ఏముండును?"


*41.5 (ఐదవ శ్లోకము)*


*యత్రాద్భుతాని సర్వాణి భూమౌ వియతి వా జలే|*


*తం త్వానుపశ్యతో బ్రహ్మన్ కిం మే దృష్టమిహాద్భుతమ్॥9822॥*

"పరబ్రహ్మస్వరూపా! భూ, గగన, జలములయందుగల సకల అద్భుతములయందు నీవే ఉన్నప్పుడు ఇక చూడదగిన ఇతరాద్భుతములు ఏముండును?"


*41.6 (ఆరవ శ్లోకము)*


*ఇత్యుక్త్వా చోదయామాస స్యందనం గాందినీసుతః|*


*మథురామనయద్రామం కృష్ణం చైవ దినాత్యయే॥9823॥*


ఇట్లు పలికిన పిదప అక్రూరుడు రథమును నడిపింపసాగెను. సాయంకాలము అగునప్పటికి అతడు బలరామకృష్ణులను మథురకు చేర్చెను.


*41.7 (ఏడవ శ్లోకము)*


*మార్గే గ్రామజనా రాజంస్తత్ర తత్రోపసంగతాః|*


*వసుదేవసుతౌ వీక్ష్య ప్రీతా దృష్టిం న చాదదుః॥9824॥*


పరీక్షిన్మహారాజా! బలరామకృష్ణులు అక్రూరునితోగూడి మథురకు పయనించుచున్నప్పుడు మార్గమునగల గ్రామీణులు వారిని సమీపించి, దర్శించి, పరమానందభరితులైరి. వారు ఆ దివ్యపురుషులను కన్నులప్పగించి చూచుచు, తమ చూపులను వారినుండి మఱల్చలేకపోయిరి.


*41.8 (ఎనిమిదవ శ్లోకము)*


*తావద్వ్రజౌకసస్తత్ర నందగోపాదయోఽగ్రతః|*


*పురోపవనమాసాద్య ప్రతీక్షంతోఽవతస్థిరే॥9825॥*


నందుడు మొదలగు గోపాలురు ముందుగనే మథురను సమీపించి, అందలి ఉపవనములలో బసచేసిరి. పిమ్మట వారు బలరామకృష్ణుల కొఱకు నిరీక్షించుచుండిరి.


*41.9 (తొమ్మిదవ శ్లోకము)*


*తాన్ సమేత్యాహ భగవానక్రూరం జగదీశ్వరః|*


*గృహీత్వా పాణినా పాణిం ప్రశ్రితం ప్రహసన్నివ॥9826॥*


జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు నందాదులను కలిసిన పిదప వినమ్రుడైయున్న అక్రూరుని చేతితో చేయి కలిపి, నవ్వుచు అతనితో ఇట్లు నుడివెను-


*41.10 (పదియవ శ్లోకము)*


*భవాన్ ప్రవిశతామగ్రే సహ యానః పురీం గృహమ్|*


*వయం త్విహావముచ్యాథ తతో ద్రక్ష్యామహే పురీమ్॥9827॥*


"తండ్రీ! నీవు రథమును తీసికొని, పురమున ప్రవేశించి, తిన్నగా ఇంటికి చేరుము. మేము ఇక రథము నుండి దిగి, ఈ ఉపవనమునందు కొంత విశ్రాంతిగైకొందుము. అనంతరము నెమ్మదిగా నగరమును దర్శించెదము".


*అక్రూర ఉవాచ*


*41.11 (పదకొండవ శ్లోకము)*


*నాహం భవద్భ్యాం రహితః ప్రవేక్ష్యే మథురాం ప్రభో|*


*త్యక్తుం నార్హసి మాం నాథ భక్తం తే భక్తవత్సల॥9828॥*


*41.12 (పండ్రెండవ శ్లోకము)*


*ఆగచ్ఛ యామ గేహాన్నః సనాథాన్ కుర్వధోక్షజ|*


*సహాగ్రజః సగోపాలైః సుహృద్భిశ్చ సుహృత్తమ॥9829॥*


*అక్రూరుడు ఇట్లు పలికెను* ప్రభూ! మీరు ఇరువురును లేకుండా నేను మథురలో ప్రవేశింపజాలను. భక్తవత్సలా! నేను నీ భక్తుడను. దయచేసి ఇప్పుడు నన్ను ఒక్కనినే పంపవలదు. పరమాత్మా! నీవు నా హితైషివి. నీవు బలరామునితోడను, నందాది గోపాలురతోను, తదితరులగు ఆత్మీయులతోడను కూడి మా ఇండ్లకు విచ్చేసి, మమ్ము అనుగ్రహింపుము.


*41.13 (పదమూడవ శ్లోకము)*


*పునీహి పాదరజసా గృహాన్నో గృహమేధినామ్|*


*యచ్ఛౌచేనానుతృప్యంతి పితరః సాగ్నయః సురాః॥9830॥*


స్వామీ! మేము గృహస్థులము. నీ పాదధూళితో మా గృహములను పునీతమొనర్చి మమ్ములను ధన్యులను గావింపుము. నీ పాదప్రక్షాళనచే పవిత్రములైన జలములను మేము సేవించుటవలనను, శిరస్సులపై చల్లుకొనుటచేతను, మా పితరులు, అగ్నులు, అట్లే దేవతలు తృప్తి చెందుదురు.


*41.14 (పదునాలుగవ శ్లోకము)*


*అవనిజ్యాంఘ్రియుగలమాసీచ్ఛ్లోక్యో బలిర్మహాన్|*


*ఐశ్వర్యమతులం లేభే గతిం చైకాంతినాం తు యా॥9831॥*


దేవా! నీ పాదప్రక్షాళనముచే పవిత్రములైన తీర్థములను శిరమున ధరించినందున బలిచక్రవర్తియొక్క కీర్తిప్రతిష్ఠలు ఇనుమడించెను. అంతేగాదు, అతడు సాటిలేని ఐశ్వర్యములను పొందెను. మఱియు ప్రసన్నులైన పరమభక్తులకువలె ఆయనకు ఉత్తమగతులు ప్రాప్తించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి దశమ స్కంధములోని పూర్వార్ధమునందలి నలుబది ఒకటవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319

కామెంట్‌లు లేవు: