14, మే 2024, మంగళవారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 14.5.2024 మంగళవారం


*శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*370వ నామ మంత్రము* 


*ఓం మధ్యమాయై నమః*


పశ్యంతీ వైఖరుల మధ్యగా ఉన్న వాగ్రూపురాలైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మధ్యమా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం మధ్యమాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత శ్రద్ధాభక్తులతో ఆరాధించు భక్తులకు శాంతిసౌఖ్యములు, సిరిసంపదలు, అనంతమైన భక్తిప్రపత్తులు అనుగ్రహించును.


*మధ్యమా* అను శబ్దము వాక్కు యొక్క మూడవ స్థితి. పరమేశ్వరి *మధ్యమా* వాక్స్వరూపిణి. ఈ స్థితిలో నాదం జనిస్తుంది. అనాహత చక్రం మధ్యమావాక్కు యొక్క స్థానము. వాక్కులో స్పష్టత ఉండదు. శబ్దం మాత్రమే వినిపిస్తుంది. ఇది ధాన్యపుగింజ మొలకెత్తిన తరువాత మారాకు వేసినట్లు ఉంటుంది.  ఈ స్థితిలో వాక్కు అస్పష్టమై, పసిపిల్లవాడి వచ్చీరాని మాటలమాదిరిగా ఉంటుంది.


*పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ* యను ఈ నాలుగు వాక్కుయొక్క స్వరూపములు.


పరబ్రహ్మతత్త్వం తెలుసు కొనుటలో వాక్కు నాలుగు విధాలుగా చెప్పారు.  అవి 1. పరా, 2. పశ్యంతి, 3, మధ్యమ, 4. వైఖరి. మనిషి అక్షర సముదాయాన్ని ఏర్పరచుకొని, వాటి సహాయంతో అంతులేని సాహిత్యాన్ని సృష్టించుకొన్నాడు. కాని, దృగ్గోచరమైన సృష్టికి మూలాన్ని అన్వేషించడానికి సతమతం అవుతున్నాడు. ఈ పరిస్థితిని చిత్రించే ఒక శ్లోకం ఉంది. 


*పరా వృక్షేషు సంజాతా, పశ్యంతీ భుజగీషుచ, మధ్యమావై పశుశ్చైవ, వైఖరీ వర్ణ రూపిణీ*


చెట్టు నుంచి చివుళ్లు, ఆకులు, కొమ్మలు, పూలు, ఫలాలు వస్తాయి. కాని తన వల్లనే వస్తున్నాయని చెట్టు గుర్తించదు. పాముకు చూడటానికి కళ్లేగాని, వినడానికి ప్రత్యేకం ఒక శ్రవణేంద్రియం అనేది లేదు. పశువు  *అంబా* అంటుంది. కాని, అంబను తెలుసుకొనలేదు. మనిషి కూడా అలాగే సృష్టిమూలాన్ని తెలుసుకొనలేక పోతున్నాడు. *పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీ* శబ్దాలకు నిర్వచనం చెప్పే సందర్భంలో ఇచ్చిన ఈ నాలుగు ఉపమానాలు వరుసగా ఈ పదాలకు వర్తిస్తాయి. మరొక విధంగా కూడా ఈ పదాలకు అర్థం చెప్పారు.


*పరా* విత్తు మొలకెత్తడానికి ముందు స్థితి. అంటే, విత్తు భూమిలో పడి, ఉబ్బి, మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నస్థితి. మొలక విత్తులోనుంచి పైకి రావడం, అంటే ఆలోచన మొలకెత్తడం *పశ్యంతి* మొక్క ఎదిగి, వృక్షంగా మారడం *మధ్యమ* స్థితి. పూత పూయడం, పూలు ఫలాలు కావడం, పరిపూర్ణం చెందడం *వైఖరి’*


ఏదైనా ఒక పనిని తలపెట్టినప్పుడు తలపునకు పూర్వస్థితి *పరా వాక్కు*. తలపు *పశ్యంతీ వాక్కు* ఆలోచన కార్యరూపం ధరించే ముందున్న ఊహస్థితి *మధ్యమ వాక్కు* తలపు కార్య రూపం ధరించడం *వైఖరీ వాక్కు* గనుక పరమేశ్వరి అనాహత పద్మంలో,  మధ్యమా వాక్స్వరూపిణియై ఉంటుంది. 


అమ్మవారికి నమస్కరించునపుడు *ఓం మధ్యమాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమను ప్రసాదించినవారు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు అయిన కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను.  

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: