4, జులై 2021, ఆదివారం

*విష్ణు సహస్ర నామం.*

 *విష్ణు సహస్ర నామం.* 


*(మొదటి భాగం.)*


ఏ  దేవత సహస్రనామం చూసినా వాటన్నిటిలోనూ కొన్ని సాధారణమైన విషయాలు ఉంటాయి. మొదటిది సృష్టి స్థితి లయము మొదలైన కార్యాలన్నీ  ఆ దేవత నియంత్రణలోనే ఉండడం.  భగవంతుడి లక్షణాలైన కరుణ దయ భక్త పరాధీనత మొదలైన కళ్యాణ గుణాలు కలిగి ఉండడం.  ఆ దేవత కు మిగిలిన అందరు దేవతలు లొంగి ఉండడం. ఆ దేవత ఆభరణాలు ఆయుధాలు వాహనాలు వాటికి సంబంధించిన పేర్లు. పురాణాలలో ఆ దేవత కు సంబంధించిన కథల వివరాలు ఆ దేవత చేతిలో ఓడిపోయిన రాక్షసుల పేర్లు వగైరా వివరాలు నామాల రూపంలో ఉంటాయి.


ఉన్న పరబ్రహ్మ ఒక్కడే. ఆయనను ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు. అనేది హిందూమతంలో మౌలికమైన భావన. అందువల్ల అందరు దేవతలకు కూడా ఒకే మూసలో సహస్ర నామాలు తయారయ్యాయి.


శైలీ రచనా ఇంకా విషయపరంగా కూడా విష్ణు సహస్రనామానికీ  మిగతా ఏ సహస్రనామం లోనూ లేని కొన్ని ప్రత్యేకతలు కొన్ని గొప్పతనాలు ఉన్నాయి. ఆ గొప్పతనాల వల్లే విష్ణు  సహస్రనామం అన్ని వేల సంవత్సరాల నుంచి పండిత పామరుల మన్ననలు అందుకుంటూ ప్రజాబాహుళ్యంలో ఆ స్థాయిలో నిలిచిపోయింది.


విష్ణు సహస్రనామం వినడంలో ఒక మాధుర్యం ఉంది. నామాల యొక్క అర్థం తెలియకపోయినా ఆ శబ్దాల కలయికలో ఏదో తెలియని ఆకర్షణ హాయీ ఉన్నాయి. ఇది వ్యాసుల  వారు చాలా శ్రమపడి మనకు అందించిన బహుమానం.


కలౌ వెంకట  నాయకః అనే మాట అందరికీ తెలుసు. కానీ ఏ యుగంలో భగవంతుడిని ఏ విధంగా పూజించాలి అనే విషయం అంత ప్రసిద్ధిగా లేదు. "యజ్ఞానాం జప యజ్ఞోzస్మి" అని భగవద్గీత లో ఉంది. ఇదే భావాన్ని ఇంకాస్త విపులంగా విష్ణు పురాణం లోని ఈ క్రింది శ్లోకం వివరిస్తుంది


 *ధ్యాయన్ కృతే యజన్ యగ్నై*

 *స్త్రేతాయామ్ ద్వాపరేz ర్చయన్*

 *యదాప్నోతి తదాప్నోతి*

 *కలౌ సంకీర్త్య కేశవం.*


 కృతయుగంలో ధ్యానం చేయాలి. యజ్ఞయాగాలు త్రేతాయుగంలో. ద్వాపరంలో అర్చించడం. కలిలో శక్తి ఓపిక తక్కువ కాబట్టి మానవులు తపస్సులు యజ్ఞ యాగాలు చేయలేరు. అందువల్ల కలి యుగంలో నామ సంకీర్తన ఆ ఫలితాలనే ఇస్తుంది అని ఆ శ్లోక తాత్పర్యం. ఆ శ్లోకంలో కేశవ అనే పదం ఉంది. శంకర భాష్యం లో ఈ పదానికి బ్రహ్మ విష్ణు మహేశ్వర లందరికీ అధినాయకుడు అని అర్థం రాశారు. పరబ్రహ్మ వాచక మైన పదం కాబట్టి అందరు దేవతలకూ వర్తిస్తుంది. "సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి". అనే మాట ఎలాగూ ఉంది.  విష్ణు నామ సంకీర్తనము అనేది వాచ్యార్థము. దేవతా నామ సంకీర్తనము అనేది గౌణార్థము. ఎలా చూసుకున్నా విష్ణు సహస్రనామ పారాయణ యజ్ఞ ఫలాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామం ప్రసిద్ధంగా అవడానికి ఈ శ్లోకం కూడా ఒక కారణము. 


విష్ణు సహస్రనామం శ్రీకృష్ణుని సమక్షంలో మహావిష్ణువుకు పరమభక్తుడైన భీష్ముల వారు ధర్మరాజుకు ఉపదేశించినది.  మామూలు కవులు రాసిన సహస్ర నామాలకు విష్ణు సహస్రనామానికి ప్రధానమైన తేడా ఇదే. ఈ సహస్రనామాలలో ఏ దేవతా రూపం స్తుతింపబడుతుందో స్వయంగా ఆ శ్రీకృష్ణుని సమక్షంలో ఆయన మహా భక్తుడు ఆ సహస్రనామాలను సంపుటీకరించి ఉపదేశించారు. ఆ ఉపదేశం పుచ్చుకున్న వాడు తరువాత బొందితో స్వర్గానికి వెళ్ళిన ధర్మరాజు.  అందువల్ల ఆ సహస్రనామాలు లోకంలోకి వచ్చిన పద్ధతిలోనే ఒక పవిత్రత ఒక ప్రత్యేకత ఉన్నాయి.


ఈ  సహస్రనామాల్లో ఉన్న విడి నామాలు అన్నీ స్వతంత్ర మంత్రాలు. అంటే వాటికి ముందు ఓం తరువాత నమః చేర్చి వాటిని జపించవచ్చు. అన్ని సహస్రనామాల కు ఈ లక్షణం ఉంటుంది కదా అంటారేమో. ప్రతి పేరుకూ ముందు వెనక ఓం నమః అని చేర్చగానే ప్రతిదీ మంత్రం అవ్వదు. పుట్టు ముహూర్తాలు పెట్టుడు ముహూర్తాలు అన్నట్టుగానే స్వతహాగా ఆధ్యాత్మిక ప్రకంపనలు (vibration) ఉండడం దానికి తగిన విధంగా లోతైన వేదాంత పరమైన అర్ధాలు ఉండడం వినసొంపుగా ఉండడం ఈ మూడు గుణాలు కలిసిన మంత్రాలు విష్ణు సహస్రనామం లో ఉన్నాయి. మిగతా సహస్రనామాలను జల్లెడ పడితే అట్లాటి మంత్రాలు కొన్ని బయట పడతాయి కానీ అన్ని మంత్రాలు అట్లా ఉండవు. ఈ మాట మహర్షులు జ్ఞానులు నిర్ణయించింది.


*"శాస్త్రేషు భారతం సారం*

*తత్ర నామ సహస్ర కం"*


అన్ని శాస్త్రాలలో కి భారతం సార భూతమైనది. అందులోనూ విష్ణు సహస్రనామం అత్యంత సారవంతమైనది అని ఆ శ్లోక పాదానికి అర్థము.


*ముఖ్యమైన నామాలు వాటి అర్ధాలు* ::  విష్ణు శబ్దం ఈ ప్రపంచంలో అణువణువునా చొచ్చుకొని వ్యాపించి ఉన్న పరమాత్మ ను సూచిస్తుంది.  నారములు అంటే ఆకాశం మొదలైన తత్వాలు. అయన వాటికి ఆశ్రయమైన వాడు గమ్యమై నవాడు. ఆయన నుంచి వచ్చిన సర్వ భూతాలకు వాటికి ఆశ్రయం అయినవాడు మళ్లీ వాటిని తనలోనే లీనం చేసుకునే వాడు నారాయణుడు. ("అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణః స్తితః.")  వాసుదేవ శబ్దం చరాచర మైన ఈ సమస్త ప్రపంచాన్ని ఆవరించుకుని ఉన్న విరాట్ రూపాన్ని సూచిస్తుంది.  (" అత్య తిష్ట ద్దశాంగుళం").  ఒక నామము లోపలికి... ఇంకొక నామం బయటికి...  ఉన్న స్థితిని తెలియజేస్తాయి. మధ్యలో ఉన్న పేరు సర్వసృష్టికి మూలము మళ్లీ గమ్యము ఆయన స్థితిని సూచిస్తుంది. మొదటి నామం విష్ణు, మధ్యలో వచ్ఛే నామం నారాయణ ఆఖరి నామం వాసుదేవ.


ఇంకా వుంది....


*పవని నాగ ప్రదీప్.*

కామెంట్‌లు లేవు: