18, మార్చి 2023, శనివారం

పరమాచార్య

 పరమాచార్య వారి ఆహార నియమాలు..

పరమాచార్య వారి ఆహార, విహార నియమాలు గమనిస్తే వారి స్థిత ప్రజ్ఞత మనకు స్పష్టంగా తెలుస్తుంది.

స్వామి వారు సంవత్సరం లో సగం రోజులు ఆహారమే తీసుకొనరు.

నవరాత్రులు తొమ్మిది రోజులు కటిక ఉపవాసం.ప్రతి ఏకాదశి ఉపవాసమే కాక ఆ తరువాత రోజు సాయంకాలం త్రయోదశి అయితే అభిషేకం ఉంటుంది కాబట్టి ఉపవాసం.ఆ తరువాతి రోజు యాదృచ్చికంగా శుక్రవారం వారం వస్తే నవా వరణ పూజ ఉంటుంది కాబట్టి ఆహారం తీసికోరు. ఇవన్నీ అయిన తరువాత పౌర్ణమి వస్తుంది. ఆ రోజు అభిషేకం, నవావరణ పూజ.

ఇవన్నీ కాక నైతిక విషయాలలో కొన్ని ఉపవాసాలు ఉండేవి.1926 లోను 1953లోను కొన్ని మాసాలు ఉపవసిం చేవారు.

పోనీ విశ్రాంతి తీసుకుంటారా అంటే రాత్రి పదకొండు, పన్నిండు గంటల వరకు ఏవో కార్యక్రమాలు ఉండేవి. పడక చూద్దామంటే చాలా రోజులు మేనాలోనే పడుకునే వారు. మేనా ఎలా ఉంటుందంటే కాళ్ళు జాపు కోవడానికి వీలుండదు. దానినిండా పుస్తకాలు ఉండేవి.విశ్రాంతి లో కూడా మత్యాసనం లోనే ఉండేవారు.రెండు, మూడు గంటలకు తిరిగి వారి కార్యక్రమాలు మొదలు.

సరే.. ఇక భిక్ష స్వీకరించే రోజుల్లో సహితం పద్నాలుగు సంవత్సరాలకు ఉప్పు, చింతపండు, మిరపకాయలు వాడడం మానివేశారు. చప్పిడి భోజనం స్వీకరించేవారు.

కొన్ని రోజులు బిల్వ దళాలు, వేపచిగురు తో గడిపేవారు. కొంత కాలం మూడే మూడు గుప్పిళ్ళు అన్నం తీసుకొనేవారు.

ఆంధ్ర పర్యటన కాలంలో (1967-69)స్వామి వారు పెరుగులో నానబెట్టిన పేలాలు తీసుకొనేవారు. ఇలా ఉండగా అత్యుత్సాహం ప్రదర్శించే ఒక సన్యాసి పేలాలు కూడా జీవహీంసే కదా. (బీజాన్ని వేయిస్తున్నారు కదా ) అని ఆక్షేపించేసరికి పేలాలు కూడా మానేసి అరటిపండ్ల పొడి ఆవు పాలతోనో, పళ్ళ రసం తోనో కలిపి ఇడ్లీ ల వలె ఉడకపెట్టి స్వీకరంచే వారు.

చివరి సంవత్సరాలలో ఇదే స్వామి వారి భిక్ష. ఒక్క అన్న ద్వాదశి నాడు మాత్రమే అన్న భిక్ష స్వీకరించేవారు.

ఎవరైనా "మీరు చాలా దుర్భలం గా ఉన్నారు "అంటే స్వామి నవ్వుతూ "పసివాడు బొద్దుగాను సన్యాసి వడలి పోయి ఉంటేనే అందం."అనేవారు

****ఆధునిక వైజ్ఞాన పరంగా ఆలోచిస్తే వారు చేసే పనికి వారు తీసుకొనే క్యాలోరిలు సరిపోవు.వారి బలం యోగికమైనది. లౌకికమైనది కాదు.

కామెంట్‌లు లేవు: