21, ఫిబ్రవరి 2024, బుధవారం

విశ్వనాధ్

 నిన్నటి రోజున కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ గారి పుట్టినరోజు సందర్బంగా వారికి జయంతి శుభాకాంక్షలు 💐💐💐💐🌹



విశ్వనాథ్ చిత్రాల్లో సహజమైన హాస్యం కథలో కలిసిపోయి మనకు గిలిగింతలు పెడుతుంది. ఎంత సమర్ధులైన సంభాషణా రచయితలున్నా దర్శకుడికి ఆ యావ ఉంటేతప్ప హాస్యం పండదు.


ఊరికే గొప్పలు పోతూ శంకరశాస్త్రి స్నేహితుడిగా అజమాయిషీ చెలాయించే మాధవ ‘ఏం, వాడంటే నాకు భయమా? రానీ చెప్తాను. చెడామడా కడిగేస్తా వాణ్ణి!' అంటూ వీరంగమెత్తేసి ఆనక బయట గుఱ్ఱబ్బగ్గీ ఆగగానే ఆ చప్పుడుకే వణికిపోతాడు. 


ఇప్పుడొచ్చే బిల్డప్ సీన్లన్నింటికీ ఇది బాప్. చూడటానికి ఏమంత హడావుడిగా ఉండదు. మనిళ్ళలోనూ ఉంటారు ఇటువంటి మనుషులు. అచ్చం అలాంటివాడే అల్లురామలింగయ్య ఈ సినిమాలో.


ఇక సప్తపదిలో క్షత్రియుడైన అల్లు రామలింగయ్య చెరువులో స్నానం చేస్తూ సోమయాజులుకి ‘మీరు యాజులూ, మేం రాజులూనూ మరి! అంచేతా ఈసారికిలా కానిచ్చెయ్యండి మరి!’ అంటూ హితబోధ చేస్తాడు. సోమయాజులు మౌనాన్ని చూస్తే మనందరికీ ఒకరకమైన భయం ఉంటుంది. అటువంటి మనిషిని అంత సరళంగా వారించగల, నియంత్రించగల వ్యక్తిగా అల్లుని భలే వాడుకున్నారు విశ్వనాథ్.


ఇక సాగరసంగమంలో డాక్టర్ తంబుగారబ్బాయి చక్రి తోలేటి తీసిన ఫొటోలు, పెట్టించిన భంగిమలూ, ఆ సన్నివేశంలో సంభాషణలూ ఇప్పటికీ తెలుగిళ్ళలో మారుమోగుతున్నాయి. ఎవడైనా సరిగ్గా ఫొటోలు తియ్యకపోతే ‘ఏంట్రా ఈ సాగరసంగమం ఫొటోలు?’ అనో, ‘భంగిమా...’ అనో అరుస్తూ నవ్వుకోవడం పరిపాటి.


స్వాతిముత్యంలో అతిథిగా నటించిన సోమయాజుల్ని ఉద్యోగం కోసం వెంటాడే కమలహాసన్ పిచ్చిపిచ్చిగా నవ్విస్తాడు. అలా వెంటాడేవాళ్లను ఇప్పటికీ అలానే పిలుస్తున్నారు... స్వాతిముత్యంలో కమలహాసన్‌లా తగులుకున్నావేంట్రా బాబూ?' అని.


‘అసలే విశాఖపట్నం, స్టీలుముక్కలతో కొడతారేమో జనం?'


‘అయ్యా, కూర్చోండయ్యా! కాఫీ తాగుతారాండయ్యా? అవునండయ్యా, అమ్మగారు లేరండయ్యా! బయటికెళ్ళారండయ్యా!' 


సహజనటుడు పొట్టి ప్రసాద్ గారి ఈ మేనరిజమ్స్ కూడా మనల్ని కాసేపు హాయిగా నవ్విస్తాయి.


స్వాతికిరణంలో అనంత్ అయితే ఒక వెరైటీ డిక్షన్‌తో పిచ్చెక్కిస్తాడు. 


‘అక్కయ్యా, బావగారు....... ఎక్కి వస్తున్నారు!' అంటూ మధ్యలో ముఖ్యమైన మాటల్ని మింగేసే మనుషుల్ని మనచుట్టూ అప్పుడప్పుడు చూస్తుంటాం. 


వరండాలో కూర్చుని బీరకాయలు తరుగుతూ అనంతుని పిలిచి, చిన్న ముక్క చేతిలో వేసి ‘చేదు చూడు!' అనే సహజత్వం ఆయనలోని నికార్సైన తెలుగుదనం.


పూజగదిలో వైజాగ్ ప్రసాద్ దేవుడికి హారతిస్తూంటాడు. బయట అరుగుమీద నలుగురూ కూర్చుని మాట్లాడుకుంటుంటే మాటిమాటికీ లోపలినుంచి గంట వినబడుతుఊ ఉంటుంది. అది వినబడ్డ ప్రతిసారీ మాటలాపి అటుతిరిగి హారతి కళ్ళకద్దుకుంటారందరూ. ఆ సున్నితమైన హాస్యం విపరీతంగా నవ్వు తెప్పించదుగానీ ఆ సరళత్వానికి ముచ్చటేస్తుంది.


ఇక అచ్యుత్‌ భార్యగా నటించిన పిల్లచేత గాయట్రీ వషంటం, టేగరాజ్ కీర్తనలు అనిపించడం ఓ చురకలాంటి చమక్కు.


స్వర్ణకమలం చిత్రానికి భానుప్రియ నటనా, నాట్యం రెండూ ప్రాణం పోశాయని అనుకోవచ్చు. 


‘అర్ధం చేసుకోరూ...' అనేమాట ఇప్పటికీ మన లేడీసంతా సాగదీస్తూ పలుకుతూనే ఉన్నారు.


అందులోనే భానుప్రియ చేత బలవంతంగా నాట్యప్రదర్శనకు ఒప్పిస్తాడు వెంకటేష్. ఆ కార్యక్రమంలో ముందువరసలో కూర్చున్న విన్నకోట విజయరామ్‌ని ఎవరో అడుగుతారు పిల్లాణ్ణి తీసుకురాలేదేమని... ‘విరేచనాలకి మందేశాం. హడావిడవుతుందేమోననీ తీసుకురాలేదు!’ అంటాడు. ఆమాటకి, అతగాడి హావభావాలకీ జోహార్లు.


ఆపద్బాంధవుడు చిత్రంలో పశువుల భాషను డీకోడ్ చేసే సన్నివేశంలో చిరంజీవి నటన చాలా చాలా నవ్విస్తుంది. 


కేవలం సంగీతసాహిత్యాలనే కాకుండా సున్నితమైన హాస్యాన్ని, అదీ మనకందుబాటులో ఉండే సరళమైన సన్నివేశాలతో పండించిన కాశీనాథుని విశ్వనాథ్ చిరస్మరణీయులు!


నివాళులు!


......కొచ్చెర్లకోట జగదీశ్

కామెంట్‌లు లేవు: