సంద్యోపాసన ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము?
సంధ్య ఉపాసనకు ఉపాస్య దేవత ఎవరని ఒక ఔత్సాహికుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ప్రశ్నించాడు.
• సూర్యమండలమునా? (ఖగోళ గ్రహమునా? – అది ద్రవ్య రాశి)
• సూర్య దేవతనా? ( పరిమిత శక్తి కల జీవుడా? )
• విశ్వాత్మ అయిన హిరణ్యగర్భుడా? (అతడూ జీవుడే కదా? )
• విశ్వపరిపాలకుడైన ఈశ్వరుడా? ( సాపేక్షమైన బ్రహ్మ కదా?)
• బ్రహ్మమా?
దానికి స్వామి వారు అన్నియును అని చెప్పారు.
అదెలా కుదురుతుంది ఇవన్నీ వేరు వేరు కదా అని అతడు ప్రశ్నించగా
ఆయన ఇలా చెప్పారు:
ఉదాహరణకు నన్ను తీసుకోండి. ఎందరో నాపై గౌరవం చూపుతున్నారు.అందరూ గౌరవిస్తున్న వస్తువు “నేనే” అయినప్పటికీ గౌరవం చూపుతున్న వ్యక్తులను బట్టి కొంత కొంత మార్పు జరుగుతున్నది.
౧. సామాన్య జనులు నా చుట్టును మహా సంస్థానపు ఆర్భాటములైన వస్త్ర భూషణాలు పరివారం చూసి ఆనందిస్తారు
౨. కొందరు నా పీఠాదిపత్యమును గౌరవిస్తారు
౩. కొందరు నా (సన్న్యాస) ఆశ్రమమును చూసి గౌరవిస్తారు
4. కొందరు నా భౌతిక దేహమునకు
5. కొందరు నా భౌతిక స్థితిని వదిలేసి నా అంత:కరణ పారిశుద్ధ్యమును, ఆధ్యాత్మిక బలమును, ఉపాసనా శక్తిని గౌరవిస్తారు
6. చాలా తక్కువమంది నా చిత్తును చూసి గౌరవిస్తారు
కానీ అందరి గౌరవం “నేను” అనబడే నా మీదనే కదా.
ఉపాసకుని ఉపాసన అతడి స్వభావం పై ఆధార పడివుంటుంది. ఉపాసిన్చేవారిని ఉపాసింపబడే వస్తువు భేదం చూపించదు. కాబట్టి నువ్వు చెప్పిన అన్నీ కూడా ఉపాసనకు అర్హములే. అన్నీ ఒకటే.
వారి వారి స్థాయిని బట్టి వారి ఉపాసన వుంటుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు నిత్య ఉపాసనలో స్థానములు వున్నవి.
సంద్యోపాసన అతి సామాన్యముగా తోచినా అత్యుత్తమ స్థాయికి కూడా ఉపయోగపడగలదు. సామాన్య ప్రారంభ సాధకునికి ఎంత ఉపకరిస్తుందో తపస్సిద్ధునకు కూడా అంత ఉపకరిస్తుంది. కాబట్టి దాన్ని తృణీకరించతగదు. విస్మరించడం తప్పు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి