వసుచరిత్రలో సవతుల కయ్యం!
శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ
నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో
గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా
సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.
వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !
ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.
బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.
ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!
" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని
ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!
ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా, శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.
కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము
ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!
అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.
ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)
వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!
.స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి