17, సెప్టెంబర్ 2024, మంగళవారం

హైందవం వర్ధిల్లాలి 3

 *హైందవం వర్ధిల్లాలి 3*




జీవ కోటికి జీవించే మార్గాలు వేరు వేరుగా ఉండవచ్చును, కాని ధ్యేయం ఒక్కటే అయి ఉండాలి అదే *స్వధర్మ మరియు దేశ రక్షణ*.


 *స్వధర్మ రక్షణ హింసా వాదము కాదు*. వ్యక్తి స్వేచ్ఛ ఎంతవరకు ఉండాలంటే ప్రక్క వానికి కష్ట నష్టములు కలుగకూడదు, ఇది ప్రాపంచిక ధర్మము, న్యాయము. కాని, ఈ మధ్య కాలంలో దురహంకారులైన  విదేశీ అన్య మతస్థులే  గాకుండా స్వార్థ పూరితులు మరియు అధికార దాహార్తులైన కొందరు  నాయకులు,  వారి అనుచర గణముల వలన  భారత దేశములోనే గాకుండా ఖండాంతరములలో గూడా బలహీనులపై దౌర్జన్యాలు, ప్రాణ మాన భంగాలు యధేచ్చగా జరుగుచున్నవి. ఇందుకు కారణం  జాతిలో  ఐకమత్య భావన లోపించడం. ఇందుకు ప్రధాన హేతువు  కొన్ని దుష్ట శక్తులు ప్రజలను కులాల వారీగా వీడదీసి చీలికలు సృష్టించడం రాజకీయ పార్టీలకు అంతేకాదు కులసంఘాల నాయకులకూ తమ పబ్బం గడుపుకోవడంమే ప్రధాన లక్ష్యంగా సాగుతున్నది.


ఏ సమాజంలో నైనా ఏదో ఒక రూపంలో విభజనలు ఉంటాయి అవి మతపరమైనవి కావు. సామాజిక అవసరాల కొరకు విభజనలు జరిగి ఉంటాయి....కానీ మన ధర్మంలోని చాతుర్వర్ణ  వ్యవస్థ, వృత్తుల పరంగా  ఏర్పడినా అవి క్రమంగా కులాలుగా విభజింపబడినా ఎవరి ప్రాధాన్యత వారిదే. 

ఈ విభజనలు సామాజిక జీవితాలను క్రమబద్ధం చేయడానికి మాత్రమే ఏర్పడినవి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర తరగతులుగా వర్గీకరింపంబడినా ఎవరి ప్రాముఖ్యత వారిదే. ఇందులో ఎక్కువ తక్కువల ప్రస్తావన హిందూ ధర్మంలో లేదు. అనాదికాల వర్గీకరణ వివరాలు ఒకసారి పునః పరిశీలిద్దాము. 

1) యజ్ఞ యాగాది క్రతువులు, తపోవనాలు, మంత్రానుష్టానాలు, శాస్త్ర మరియు జ్ఞాన పరిరక్షణ, సదాచార నియమాలు పాటిస్తూ, బోధిస్తూ జీవించేవారు *బ్రాహ్మణులు*.

2) రక్షణ, దండ నీతిని నిర్వహించే వారు.

 ప్రజా పరిపాలన నిర్వహించిన వారు *క్షత్రియులు*. 

3) వాణిజ్య వ్యాపారాలు, ధన సంబంధమైన లావా దేవీలు గరిపేవారు *వైశ్యులు*.

4) వృత్తి విద్యలతో, వస్తు ఉత్పత్తులతో, శ్రామిక వ్యవహారాలలో సమాజానికి సహకరించే వారు *శూద్రులు*. 


ఇవన్నీ విభిన్న స్థానాలే గాని విరుద్ధ స్థానాలు గావు. ఒకటి ఎక్కువ మరొకటి తక్కువా గాదు. *ఇటువంటి సామాజిక వ్యవస్థ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక రూపంలో ఉంటుంది, ఉండి తీరుతుంది*. మన  ధర్మానికి,  సంస్కృతికి ఊపిరులూడదానికి ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలి.


ఈ సమాచారమంతా సర్వులకు విదితమే గదా, చర్విత చర్వణమెందుకుని ఆలోచన రావచ్చును. సామాజిక అవసరాలు, పరిపాలన, ప్రజల మధ్య  సంయమనమునకై ఉద్దేశించబడిన ఈ విభాగాలను పరదేశీయుల షడ్యంత్రాలు, కొంత మంది అన్యమతస్థుల పన్నాగాలు, వీరందరికీ వత్తాసుగా నిలిచే దేశ ద్రోహులు *ఈ విభాగాలను విభేదాలుగా వక్రీకరిస్తూ, చూపిస్తూ, వైరుధ్యాలు సృష్టిస్తూ, వైషమ్యాలకు బీజం వేస్తూ మన సమాజాన్ని కులాలు , వర్గాలుగా మరింత రెచ్చగొడుతూ   అత్యున్నత ధర్మాన్ని  చీలుస్తున్నారు, జాతిని ప్రమాదంలోనికి నెట్టుతున్నారు*. 

ఇందుకు ప్రత్యేక రుజువులు అవసరం లేదు చరిత్ర చెబుతున్నది.


*లోకో భిన్న రుచిః* అను లోకోక్తికి అనుగుణంగా హిందు జీవన విధానం... *ధర్మమా*, *మతమా* అను విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ప్రకారం హిందు మతమన్నది లేదు, ఉన్నదన్నవారికి సనాతన ధర్మం తెలియదనే చెప్పాలి అని. హిందూ ప్రాచీన జీవన శైలిని *కేవలం ఒక మతం స్థాయికి తగ్గించి, హిందూ ధర్మానికి సరిదిద్దలేని నష్టంకలిగించారని*. మరొక వాదన... *హిందూ జీవన విధానానికి మతం అను నిర్వచనాన్ని ఎందుకు తప్పుగా భావిస్తున్నారని*. అవుతే *ఇటువంటి చర్చలకు  ఇది సమయం కాదు, వేదిక కాదు కాబట్టి, ఇక్కడే ఈ చర్చకు స్వస్తి పలుకుదాము. మన దృక్పథం హైందవం వర్ధిల్లాలి* అంతే.


*కావున హిందూ ధర్మానికి, సంస్కృతికి ఊపిరులూదడానికి ప్రతి పౌరుడు కంకణం కట్టుకోవాలి, హిందూ మతానికి  పునర్వైభవం తేవాలి*.


ధన్యవాదములు

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: