9, ఫిబ్రవరి 2021, మంగళవారం

కపిల గోవు మహిమ

 _*కపిల గోవు మహిమ*_

ధర్మరాజు " పితామహా ! కపిలగోవు విశిష్ఠత తెలపండి " అని అడిగాడు. భీష్ముడు *"ధర్మనందనా ! పూర్వము దేవతలకు ఆకలి వేసింది. వారంతా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారు. బ్రహ్మదేవుడు వారికి అమృతం ఇచ్చాడు. దేవతలు ఆ అమృతము సేవించారు. ఆ అమృతపు సువాసనల నుండి కామధేనువు ఉద్భవించింది. కామధేనువు నుండి మరి కొన్ని ఆవులు జన్మించాయి. ఆ ఆవులన్ని హిమాలయాల మీద విహరిస్తున్నాయి. ఆ సమయంలో ఒక లేగదూడ తన తల్లిదగ్గర పాలు తాగుతుంది. ఆ పాల నురగ గాలికి ఎగిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న పరమశివుడి తల మీద పడింది. పరమశివుడికి కోపం వచ్చి మూడో కన్ను తెరచి ఆ ఆవులను చూసాడు. ఆ ఆవులన్ని ఆ కోపాగ్ని వేడికి ఎర్రగా అయిపోయాయి. ఆవులన్ని బెదిరి తలోదిక్కుకు పారి పోయాయి. ఈ సంగతి తెలుసుకున్న బ్రహ్మదేవుడు పరమశివుని వద్దకు వచ్చి " మహేశా ! నీ తల మీద ఉన్న చంద్రుడు నిరంతరం నీ మీద అమృతం కురిపిస్తుంటాడు కదా ! లేగ దూడల నోటి నుండి వచ్చే నురగ కూడా అమృత సమానము కదా ! అది ఎంగిలి ఎలా ఔతుంది ! గోవు పాలు అమృతమైతే వాటి నురగ కూడా అమృతమే కదా ! దీనికి ఆగ్రహిస్తే ఎలా ! వాటిని కరుణించు"* అని వేడుకుని ఒక మంచి ఎద్దును శివుడికి కానుకగా ఇచ్చాడు. పరమశివుడు శాంతించి ఆ ఎద్దును తన వాహనముగా చేసుకుని ఆవులను ఆప్రాంతంలో తిరగడానికి అనుమతి ఇచ్చాడు. వెంటనే బెదిరి పోయిన ఆవులు తిరిగి వచ్చాయి. శివుడు *"బ్రహ్మదేవా ! ఈ గోవులన్ని నా మూడవ కంటిచూపుతో ఎర్రగా అయిపోయాయి. ఇప్పటి నుండి ఇవి అతి శ్రేష్ఠమైనవిగా భావించబడతాయి"* అని వరం ఇచ్చాడు. అప్పటి నుండి కపిలగోవులనబడే ఎర్రటి గోవులు దానం ఇవ్వడం ఆనవాయితి అయింది " అని భీష్ముడు చెప్పాడు.

*కపిల గోవు మహిమ*

శుకుడు తన తండ్రి అయిన వ్యాసుడితో *"తండ్రి గారూ ! కపిలగోవులకు అంత మాహాత్మ్యము ఎలా వచ్చింది"* అని అడిగాడు. వ్యాసుడు *"ఒకసారి దేవతల సంఘానికి కనపడకుండా తనను దాచమని అగ్నిదేవుడు గోవులను వేడుకున్నాడు. అలాగే అని గోవులు అగ్నిదేవుడిని దాచి పెట్టాయి. దేవతలు అగ్ని దేవుడిని వెతుకుతూ చివరకు ఆవుల వద్ద ఉన్నాడని తెలుసుకుని *"గోవులారా ! అగ్నిదేవుడిని దాచడం లోకములకు మంచిది కాదు. కనుక అగ్నిదేవుడు ఎక్కడ ఉన్నాడో చెప్పండి"* అని అడిగారు. ఆవులు వారిమాట మన్నించి అగ్నిదేవుడు దాగి ఉన్నచోటు చూపాయి. దేవతలు అగ్నిదేవుడితో గోవులకు ఏదైనా వరం ప్రసాదించమని అడిగారు. అగ్నిదేవుడు తాను దాగి ఉన్న కారణంగా వాటికి ఎర్రరంగు వస్తుంది అని వరమిచ్చాడు. పైగా ఆవులలో ఎర్రటి ఆవులు శ్రేష్టమైనవని వాటిని పూజించిన వారికి ఉత్తమ లోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. కపిలగోవును దానం ఇచ్చిన వాడు పుచ్చుకున్న వాడు కూడా పుణ్యలోకాలకు పోతారని వరమిచ్చాడు.
కపిల గోవు లక్షణములు

శుకుడు *" తండ్రీ ! కపిలగోవు లక్షణము ఏమిటో వివరించండి "* అని అడిగాడు. వ్యాసుడు *" కుమారా ! సాధారణంగా కపిల గోవులకు చెవులు , ముక్కు , కళ్ళు , కొమ్ములు కపిల వర్ణంలో ఉంటాయి. అలాకాక ఏ ఒక్క చోట ఎర్రగా ఉన్నా చాలు. అది కపిల గోవు అని పిలువబడుతుంది. ఇక శరీరం అంతా ఎర్రగా ఉంటే ఇక దాని మహిమ చెప్ప వలసిన అవసరం లేదు. కపిల గోవు మీద బరువు వెయ్యరాదు. దానిని హింసించరాదు. దానిని బలికి ఉపయోగించ రాదు. కపిలగోవును కాలితోకాని చేతితోకాని గోటితోకాని కర్రతోకాని కొట్టిన వాడు నరకానికి పోతాడు. కపిల గోవుకు వేళకు మేత నీరు పెట్టినవాడు సద్గతికి పొందుతాడు. గోవులతో పాటు , బ్రాహ్మణులు , గాయత్రీమాత , వసంతకాలము , సత్యము , బంగారము పుట్టాయని పెద్దలు చెప్తారు. దానము ఇవ్వతగిన వస్తువులలో ఆవులు , బంగారము , భూమి శ్రేష్టమైనవి అని " వ్యాసుడు తన కుమారుడైన శుకుడికి వివరించాడు "* అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు.

*గోదాన విధి*

ధర్మరాజు *" పితామహా ! గోదానము ఇవ్వవలసిన విధానం వివరించండి "* అని అడిగాడు. భీష్ముడు *" ధర్మనందనా ! ఈ గోదానమహిమ గురించి పూర్వము బృహస్పతి మాంధాతకు చెప్పాడు. ఒక పుణ్యదినము అందు బ్రాహ్మణుల అనుమతి తీసుకుని ఆ రోజంతా ఉపవాసము ఉండి గోవులు ఉన్న మంద వద్దకు పోయి ఒకరోజు ఆ గోశాలలో ఉండి మరునాడు సూర్యోదయమున తాను దానము ఇవ్వదలచిన గోవును పేరు పెట్టి పిలిచి బ్రహ్మదేవుడు చెప్పిన మంత్రము ఈ విధముగా పఠించుతూ *" ఈ గోవు నా తల్లి , ఈ ఎద్దు నా తండ్రి , ఈ గోవుగర్భం స్వర్గం , ఈ గోవు నిలిచిన ప్రదేశం పుణ్యలోకం ఇచ్చిన వ్యక్తికి శాశ్వత సుఖసంతోషాలు లభిస్తాయి. ఇక దానము పుచ్చుకునే వాడు విద్యాభ్యాసము చేసే విద్యార్థికాని , వ్రతములు చెయ్యడంలో ఆసక్తి ఉన్న వాడు కాని , ఎటువంటి పాపములు చెయ్యనివాడు కాని , శాంతచిత్తుడు కాని , ఇంద్రియ నిగ్రహము కలవాడు కాని , కోపము లేనివాడు కాని అయి ఉండవలెను. మహారాజా ! ఆశ్వీజమాసంలో కృష్ణపక్షంలో అష్టమి నుండి మూడు రోజులు దీక్షలో ఉండి గోమూత్రము గోమయము పుచ్చుకుంటే అతడు కోరినకోరికలు సిద్ధిస్తాయి " అని మాంధాతకు చెప్పాడు. కనుక ధర్మనందనా నీవు కూడా పై నియమములు ఆచరించి గోదానము చెయ్యి. పొద్దుననే లేచి కాలకృత్యములు తీర్చుకుని ఉపవాసము ఉండి గోదానము చేస్తే ఎంతో పుణ్యము వస్తుంది. ఇక కపిలవర్ణ గోవును దానం చేస్తే సకలపాపములు నశించగలవు "* అని భీష్ముడు చెప్పాడు.

జన్మజన్మల పాప పరిహారానికి 
గోమాత సాయం
*"పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే"* పూర్వ జన్మలో మనం చేసుకున్న పాపం వ్యాధి రూపంలో మనని బాధిస్తుంది. అటువంటి పాపాల వల్ల సంక్రమించే వ్యాధులకు గోమాత ద్వారా పరిష్కారాలున్నాయి. ధర్మశాస్త్రాలు వాటిని సూచించాయి. శాతాతప స్మృతి ఇలా చెప్పింది: 

పూర్వజన్మలో కొంగను హింసిస్తే అది పాతకమై అనంతర జన్మలో ముక్కుకి సంబంధించిన సమస్యలతో బాధపడతారు. అందవికారమైన ముక్కు కారణంగా పరిహాసానికి గురికావడం లేదా ముక్తికి సంబంధించిన వ్యాధులతో బాధపడడం ఉంటుంది. అట్టి వారు తెల్లగోవును దానం చేయడం ఆ పాపానికి పరిష్కారం. 

గత జన్మలో కాకిని హింసించిన వారు ఈ జన్మలో చెవి సంబంధమైన వ్యాధితో బాధపడతారనీ , దానికి పరిహారంగా కృష్ణవర్ణ ధేనువును అంటే నల్లని ఆవును దానం చేయాలనీ చెప్పారు. 

పూర్వజన్మలో వంచన చేసినవారు ఆ వంచన దారుణమైన ఫలితాన్ని ఇవ్వడం వలన ఈ జన్మలో మూర్ఛరోగంతో బాధపడతారు. దానిని పోగొట్టుకోవడానికి కపిల గోవును దానం చేయాలని శాతాతపుడు తెలిపాడు. శాతాతప స్మృతి 109వ శ్లోకం ఇలా చెప్పింది.
*ఖల్సాటః పరనిందావాన్ ధేనం దద్యాత్ స కాంచనామ్*
*పరోపహసకృతే కాణః స గాం దద్యాత్ స మౌక్తికామ్*

పూర్వజన్మలో ఎవరు పరనింద చేశారో , వారికి ఈ జన్మలో బట్టతల వస్తుంది. ఆ పాప పరిహారార్థం బంగారంతోపాటు గోవును దానం చేయాలి. 

పూర్వజన్మలో పరులను ఎగతాళి చేసిన వారికి ఈ జన్మలో ఒక కన్ను కనబడదు. పరిహారంగా వారు గోవును ముత్యంతో దానం చేయాలి. పాప తీవ్రత పెరిగిన వారు ఆత్మహత్య చేసుకోవాలనే దుశ్చింతలకు లోనవుతారు. అట్టి తీవ్రతాపం జన్మజన్మలలో అనేక రీతులుగా బాధించవచ్చు. కాబట్టి వేదాలు పాపపరిహారం అనంతర జన్మలకు కూడా ఉపకరిస్తుంది. ఇలా వేదాలు , ధర్మశాస్త్రాలు గోమాతను గురించి ఎంతగానో తెలిపాయి.
గోవులే ఐశ్వర్యం. గోవులే ఇంద్రియ బలవర్థకాలు. సోమరసంలో గోక్షీరాలను తప్ప వేరే వాటిని కలుపకూడదు. సోమరసం అంటే యజ్ఞాలలో దేవతలకు ప్రీతికరంగా సోమరసాన్ని సమర్పించడానికి సోమలత నుంచి సిద్ధం చేసింది. వాటిలో కలపడానికి యోగ్యమైనది ఆవుపాలు మాత్రమే. కాబట్టి ఓ మానవులారా ! గో సంపదను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. గోవులే ఐశ్వర్యాన్ని ఇచ్చేవని ఋగ్వేదంలోని 4-28-5 ఋక్కు తెలియజేస్తుంది.
*"గావో భ గో గావ ఇంద్రో యే ఇచ్చాద్ గావః సోమస్య ప్రథమస్య భక్షః ఇమా వాయా గావః సజనా స ఇంద్ర ఇచ్ఛామి ధ్రుదా మానసా చిదింద్రిమ్"*
స్మృతి సంగ్రహం ఆ విషయాన్నే బలపరుస్తూ ఇలా తెలియజేసింది.
*గవాం సేవాతు కర్తవ్యా గృహస్థైః పుణ్య విప్సుభిః*
*గవాం సేవాపరో యస్తు తస్య శ్రీర్వర్ధతే చిరాత్ !!*
పుణ్యాన్ని ఆకాంక్షించే గృహస్థులు తప్పక గోసేవ చేయాలని ఆ ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. అలా గోసేవ చేసేవారికి సంపద చిరకాలం వర్థిల్లుతుందని తెలిపింది. అందుకే అథర్వవేద ఋషి దేవతలను ప్రార్థిస్తూ *'ఓ దేవా ! మా భార్య , పిల్లలకు గోసంపదకు మంగళం జరిగేటట్లు చేయవలసింది'* అంటారు. సామవేదం 20-7 లోనూ , ఋగ్వేదం 8-14-3 లోనూ ఇంద్రుడిని స్తుతిస్తూ గో సమృద్ధిని ఈయవలసినదిగా ప్రార్థించడం జరిగింది.
అలాగే సామవేదంలో 1-3లో కూడా *"క్షుమంతం వాజగ్ం సహస్తిణాయాక్షు గో మంత మీ మహే"* అని గో సంపత్తిని విశేషంగా ఇమ్మని కోరటం జరుగుతుంది. ఎందుకంటే *ధేనుం సదనమ్ రణియానాం* అని అథర్వణం 11-1-34 లో ధన సంపదకు ప్రాప్తి స్థానం గోవు అనీ , గోవు ఉన్న గృహానికి సౌభాగ్యం కలుగుతుందని తెలిపింది. శుక్ల యజుర్వేదం 7-10 మంత్రంలో మిత్రావరుణ దేవతలకు యజ్ఞం ద్వారా హవిస్సులు సమర్ఫించడం వలన వారు తృప్తి పొందుతున్నారని , ధేనువు పచ్చి గరిక తిని తృప్తి పొంది పాలు , పెరుగు , నెయ్యి ఇవ్వడం వల్లనే యజ్ఞకర్మలు నిర్వఘ్నంగా జరుగుతున్నాయనీ , ఆ కారణంగా సర్వ సంపదలకు సాధనంగా గోవును గ్రహించాలని చెప్పడం జరిగింది.
ధర్మ శాస్త్రాలు గోవును అనేక రీతుల ప్రశంసించాయి. *"పంథా దేయో బ్రాహ్మణాయా గవే రాజేహ్య చక్షుషే"* అని చెప్పింది బోధనాయ స్మృతి. అంటే బ్రహ్మణుడు , గోవు , రాజు , అంధుడు దారిలో ఎదురైతే , వారికి దారి ఇస్తూ మనమే పక్కకి తప్పుకోవాలని తాత్పర్యం. అంతే కాదు. వేద ధ్వని వినబడని గృహము , అలంకృతమైన ఆదరింపబడుతున్న     గో సంపద లేని ఇల్లు ఇల్లే కాదని కూడా చెప్పింది.
*"గాం ధృహ్యంతే పర మై నీచక్షేతన చైనం వా రమేత్"* అని గౌతమ మహర్షి తన గౌతమ స్మృతిలో చెప్పాడు. అంటే గోవు పాలు తాగి మానవులందరూ లాభం పొందుతున్నారు తప్ప గోవు ఏ లాభమూ పొందడం లేదు. అంటే గోమాత పరోపకారం కోసమే పాలనిస్తోంది అని భావం. పంచగవ్యాలైన గోమూత్రం , గోమయం , గోక్షీరం , ఆవు పెరుగు , ఆవు నెయ్యిలను ఆహారంగా స్వీకరించి , ఐదు రాత్రులు ఉపవాసం చేస్తే వారి సమస్త మహాపాతకాలూ తొలగిపోతాయి అని చెప్పాడు వశిష్ఠుడు తన స్మృతి (11-380)లో. యమ స్మృతి కూడా (71-72)లో కపిల గోవు నెయ్యి తాగిన వారికి మహాపాతకాలు నశిస్తాయని చెప్పింది. 

కామెంట్‌లు లేవు: