9, ఫిబ్రవరి 2021, మంగళవారం

మొగలిచెర్ల

 *మనో శుద్ధి..*


"చాలా క్షేత్రాలు చూసాము..దాదాపుగా అన్ని దత్తక్షేత్రాలూ దర్శించుకున్నాము..అలాగే శిరిడీ మొదలుకొని అన్ని అవధూతల ప్రదేశాలూ చూసాము..ఈ క్షేత్రం గురించి గత రెండేళ్లుగా వింటున్నాము..ఇప్పటికి మాకు కుదిరింది ఇక్కడికి రావడానికి..ప్రశాంతంగా వుందండీ..మీరు శనివారం నాడు వస్తే పల్లకీసేవ లో పాల్గొనవచ్చు..ఎక్కువ మంది భక్తులతో కోలాహలంగా ఉంటుంది..ఆదివారం నాడు ఈ అవధూత సమాధి వద్దకు వెళ్ళొచ్చు అని చాలా పోస్టుల్లో వ్రాస్తూ వున్నారు..అన్నీ చదివాము..కానీ ఇలా విడిగా గురువారం నాడు వస్తే..హాయిగా..స్వామివారి సమాధి చూడొచ్చు..ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు..ఎటువంటి హడావిడి లేకుండా రాత్రికి ఈ మంటపం లో నిద్ర చేయొచ్చు..అందుకని..బాగా ఆలోచించుకుని..ఈరోజు గురువారం వచ్చాము..మీ సిబ్బంది కూడా బాగా సహకరించారు.." అని ఆ దంపతులు సంతోషంగా చెప్పారు..


"శనివారం నాడు వస్తే..ఈ స్వామివారు తపస్సు చేసుకున్న నారసింహ క్షేత్రం మాలకొండ లో కూడా ఆ లక్ష్మీనరసింహ స్వామిని..అమ్మవారిని.. దర్శించుకోవచ్చు..అదికూడా కలిసి వస్తుంది అని ఆ విధంగా తెలుపుతాను..శనివారం పల్లకీసేవ కు ఒక ప్రాముఖ్యత ఉన్నది..ఆ పల్లకీసేవ లో పాల్గొని..పల్లకీ ప్రదక్షిణాలు పూర్తి ఆయిన తరువాత..ప్రధాన ద్వారం వద్ద పల్లకీ ని పైకెత్తి పట్టుకుంటారు..ఆ పల్లకీ క్రింద నుంచి నడచి వస్తూ..తమ కోర్కెలు విన్నవించుకొని వస్తే..అవి తప్పక తీరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం..ఆరాత్రికి ఈ క్షేత్రంలో నిద్ర చేసి, తెల్లవారి ఆదివారం నాడు ప్రభాతసేవ లో శ్రీ స్వామివారికి ఇచ్చే హారతులు ప్రత్యేకంగా ఉంటాయి..వాటిని చూసి, ఆపై స్వామివారి సమాధిని  దర్శించుకొని ఇవతలికి వస్తే మంచిదని కూడా ఒక నమ్మకం..ఇలా పల్లకీసేవ..రాత్రికి నిద్ర..ఉదయం స్వామివారి సమాధి దర్శనం అన్నీ కలిసి వస్తాయని..ఆవిధంగా తెలుపుతున్నాను..అంతేగాని మిగిలిన రోజుల్లో రాకూడదని కాదు..ధ్యానం చేసుకోవాలనుకొన్నా..పారాయణం చేసుకోవాలనుకొన్నా..శని ఆదివారాలు కాకుండా రావడమే మంచిది..చాలా ప్రశాంతంగా ఉంటుంది.." అని వివరణ ఇచ్చాను..


ఆ దంపతులు మంటపం లో వెళ్లి కూర్చున్నారు..ఇద్దరూ ధ్యానం చేసుకోసాగారు..సుమారు రెండు గంటల తరువాత..సరిగ్గా మధ్యాహ్న హారతి సమయానికి లేచి వచ్చారు..స్వామివారికి నైవేద్యం పెట్టి హారతి ఇచ్చిన తరువాత..అన్నదాన సత్రానికి వెళ్లి భోజనం చేసి వచ్చారు.."ప్రసాద్ గారూ..మంచి భోజనం పెట్టారు..ధన్యవాదములు..మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండీ..ఇందాక ధ్యానం లో కూర్చున్నప్పుడు..ఒక అరగంట తరువాత ఒళ్ళంతా ఒకటే జలదరింపు మొదలైంది..సుమారు ఇరువై నిమిషాలపాటు అలా జలదరింపు కలిగింది..ఇక్కడ స్వామివారి తపో మహిమ నిక్షిప్తమై ఉన్నదండీ..నేను అలానే కళ్ళు మూసుకొని ఉండిపోయాను..ఆ జలదరింపు తగ్గిన తరువాత..నా శరీరం నా వశం తప్పింది..మరో అరగంటపాటు అలా కూర్చునే గాఢ నిద్ర పోయాను..మనసూ ఒళ్ళూ కూడా తేలిక పడ్డాయి..మహాత్ములు వర్ణించే స్థితి ని పొందానేమో అని అనిపించింది.." అని ఆయన చెప్పారు.."అదృష్టవంతులు.." అన్నాను..


ఆరోజు రాత్రికి ఆ దంపతులిద్దరూ స్వామివారి మంటపం లోనే పడుకున్నారు..ప్రక్కరోజు శుక్రవారం ఉదయం లేచి..రూముకు వెళ్లి స్నానాదికాలు ముగించుకొని తిరిగి మందిరం లోకి వచ్చారు..ప్రతి శుక్రవారం నాడు స్వామివారి సమాధి మందిరాన్ని మా అర్చకస్వాములు నీటితో కడిగి..మళ్లీ అన్నీ అలంకారం చేస్తారు..గర్భాలయం శుద్ధి చేసే కార్యక్రమం కూడా ఆరోజే జరుగుతుంది..అన్నీ శ్రద్ధగా చూసారు..స్వామివారి మందిరం.. మంటపం..ఆలయ ప్రాంగణం అంతా శుభ్రం చేసే కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు..ఆ తరువాత నా దగ్గరకు వచ్చి.."ప్రసాద్ గారూ ఏ దత్తక్షేత్రం లోనూ ఇటువంటి అనుభవాన్ని పొందలేదు..నిన్నటి నుంచీ మేము ఏంటో పారవశ్యం తో ఉన్నాము..మాకు అవకాశాన్ని ఇచ్చారు..అనేక ధన్యవాదాలు.." అంటూ..మా దంపతుల చేతులు పట్టుకొని..కన్నీళ్లు పెట్టుకున్నారు..బాగా భావోద్వేగాన్ని పొందారు..ఆరోజు సాయంత్రం మళ్లీ స్వామివారి సమాధిని దర్శించుకొని మాతో వెళ్ళొస్తామని చెప్పి వెళ్లిపోయారు..


మరో మూడు నెలల తరువాత ఒక గురువారం నాడు ఆ దంపతులు మళ్లీ వచ్చారు..స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ పోయిన సారి మేము ఇక్కడికి వచ్చినప్పుడు..ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో ఉన్నాము..ఒక స్వంత ఇల్లు ఉంటే బాగుండు అని స్వామివారి వద్ద అనుకున్నాము..ఈవిడకు మేమున్న ప్రాంతం లో ఉన్న ఒక ఇల్లు నచ్చింది..కానీ వాళ్ళు రేటు ఎక్కువ చెప్పారు..వేరేది చూద్దామని అనుకున్నాము కానీ ఈవిడ ధ్యాసంతా ఆ ఇంటిమీదే ఉంది..ఇక్కడికు వచ్చి వెళ్లిన తరువాత..ఆ ఇంటి యజమాని మేము అడిగిన ధరకన్నా తక్కువకు ఇల్లు అమ్మడానికి ముందుకు వచ్చాడు..మొత్తం ప్రక్రియ ఒకటిన్నర నెలలో అయిపోయింది..పోయిన గురువారం గృహప్రవేశం చేసాము..ఈ గురువారం ఈ సద్గురువు చెంతకు కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాము..మేము ఇంటికొఱకు తీసి ఉంచిన డబ్బులో ఇంకా కొంతభాగం మిగిలే ఉంది..దానిని ఇక్కడ మీరు కట్టించబోయే రూముల నిర్మాణానికి ఉపయోగించండి.." అన్నారు..


"ఈ దసరా అయిపోయిన తరువాత రూముల నిర్మాణం మొదలుపెడతాము..అంతవరకూ ఆ ధనాన్ని మీ వద్దే ఉంచండి..నేను తెలిపిన తరువాత ఇవ్వండి.." అన్నాను.."సరే..ఆ మిషతో మళ్లీ స్వామివారి దర్శనానికి వస్తాము..చిన్న కోరిక..మేము ఇకపై ఎప్పుడొచ్చినా గురువారమే వస్తాము..శుక్రవారం సాయంత్రం తిరిగి వెళతాము..శుక్రవారం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమంలో మాకూ అవకాశం ఇవ్వండి..మందిరం తో పాటు మా మనస్సులో ఏమన్నా మాలిన్యం వున్నా తొలగిపోతుంది.." అన్నారు..


వాళ్ళది ఎంతటి మనో పరిపక్వత అని పించింది..స్వామివారి సమక్షం లో తమ మనస్సును కూడా శుద్ధి చేసుకుంటారట..మనస్సులోనే వారికి నమస్కారం చేసుకున్నాను.."తప్పకుండా కల్పిస్తాను.." అని చెప్పి..మా సిబ్బంది కి కూడా వీళ్ళను పరిచయం చేసి..శుక్రవారం మందిరం శుభ్రం చేసే కార్యక్రమంలో వీరిని కూడా కలుపుకోమని చెప్పాను..దంపతులిద్దరూ ఎంతో సంతోషపడ్డారు..


ఒక్కొక్కరిదీ ఒక్కొక్క అనుభవం..ఆ అనుభవాలను ఇలా అక్షరబద్ధం చేసి మీబోటి పుణ్యాత్ములకు చేరవేసే బాధ్యతను ఆ దిగంబర అవధూత దత్తాత్రేయుడు నన్నుఎం కేవలం ఒక సాధనంగా ఉపయోగించుకుంటున్నాడు..అది కూడా ఒక భాగ్యమే..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: