4, మే 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...

 

*మొగలిచెర్ల ప్రయాణం..శరీర గంథం..*


*(పదిహేడవ రోజు)*


శ్రీ స్వామివారు ఇంత హఠాత్తుగా మొగలిచెర్ల కు బైలుదేరుతారని ఊహించలేకపోయిన శ్రీధరరావు దంపతుల మనసులోని భావాలను పసికట్టినట్లు..శ్రీ స్వామివారు ప్రభావతి గారివైపు తిరిగి..


"అమ్మా!..నీ మనసులో అనేక సందేహాలున్నాయి..క్రమంగా అన్నీ తీరిపోతాయి..నన్ను మొదటి సారి చూసినప్పుడే "నాయనా" అని పిలిచావు..ఆ క్షణం లోనే నువ్వు నా దృష్టిలో నాకు తల్లిగా మారిపోయావు..ఆ పార్వతీదేవి తన ఒడిలో ఇంతకాలం నాకు చోటిచ్చి..కన్నబిడ్డలా కాపాడింది..ఇక ముందు ముందు రోజుల్లో..నువ్వే నాకు తల్లి స్థానం లో వుండబోతున్నావు..నేనూ నీకు బిడ్డనయ్యాను..నీ పెద్దకుమారుడిని అనుకో!..నీ బిడ్డ నీ ఇంటికి రావడానికి ముహూర్తాలు చూడాలా తల్లీ?.." అన్నారు..


"శ్రీఘ్రమేవ సుపుత్రా ప్రాప్తిరస్తు!.." అన్న శ్రీమతి విక్రాల శ్రీదేవమ్మ గారి ఆశీర్వాదం ప్రభావతి శ్రీధరరావు గార్ల చెవుల్లో ఘంటానాదం లా వినబడింది..ఆ మహాతల్లి దీవెన ఈ నిమిషంలో ఈ స్వామివారి రూపంలో సాక్షాత్కారం అయింది..మాల్యాద్రి లక్ష్మీనృసింహుడి ఆలయంలో ఈ ఉదయం..తమను తాకుతూ వెళ్లిన కాంతిపుంజం ఇదేనేమో.. ఎప్పుడూ లేనిది ఆ నరసింహుడు తృళ్లి తృళ్లి నవ్విన కారణమూ ఇదేనేమో?..అని ప్రభావతి గారు తలపోస్తున్నారు..సరే..కొండంత లక్ష్మీనారసింహుడి ఆదేశం ఇదే అయితే..తమ పూర్వజన్మ సుకృతం వలన ఈ యోగిపుంగవుడు తమకు ఈ వయసులో దొరికిన కుమారుడిగా భావించి తరిద్దామని ఆవిడ నిర్ణయించుకున్నారు..


"అదేమీలేదు నాయనా..యోగులకొరకు ఇప్పటికిప్పుడు ఎటువంటి ఏర్పాట్లు చేయాలో తెలీక సతమతం అవుతున్నాను.." అన్నారు ప్రభావతి గారు.


"దిగంబరిని..సర్వసంగపరిత్యాగిని..నాకు ఏర్పాట్లు ఏముంటాయి తల్లీ..మీ ఇంట్లో ఏ లోటు ఉండదని నాకు తెలుసు..అవధూత లక్షణాలు మీకు కొత్త కదా..అవసరం వచ్చినప్పుడు అన్నీ వివరంగా చెపుతాను..శ్రీధరరావు గారూ కాలాతీతమవుతోంది..ఇక బైలుదేరుదాం.."అన్నారు..


శ్రీధరరావు గారి వెంట ఉన్న వారి పిన్నమ్మ కౌసల్యమ్మ గారు, రమణయ్య గార్లు జరుగుతున్న ఈ తతంగమంతా విస్తుబోయి చూస్తున్నారు..తమతో పాటు ఈ దిగంబర యోగి అదే బండిలో ఎలా కూర్చుని వస్తాడు?..తామెలా సర్దుకోవాలి?..ఈ భార్యాభర్తలు వెఱ్ఱి వెంగళప్పల్లా అన్నిటికీ తలూపుతూ వున్నారే.. తాము సరే..మొగలిచెర్ల గ్రామస్థులు వివిధ రకాలుగా అనుకోరా?..వీళ్ళిద్దరికీ ఆ ఆలోచనే లేదే!..భగవంతుడా..ఇదేం చోద్యం?..అని పరి పరి విధాల మనసులోనే మధనపడుతూ వున్నారు..


మరి, వారి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహించారో.. ఏమో..గబుక్కున పార్వతీదేవి మఠం లోపలికి వెళ్లి..ఒక వస్త్రాన్ని మొలచుట్టూ కట్టుకొని, మరొక వస్త్రాన్ని భుజాల మీదుగా చుట్టూరా వేసుకొని..బైటకు వచ్చి కౌసల్యమ్మ గారితో.."ఇప్పుడు సరిపోయిందా?" అన్నారు నవ్వుతూ..కౌసల్యమ్మ గారు నిర్ఘాంతపోయారు..తన మనసులో సందేహం..ఒక్కక్షణం లో పసిగట్టి పరిష్కరించిన శ్రీ స్వామివారి కి నమస్కారం చేశారు..


అందరికంటే ముందుగా శ్రీ స్వామివారే బండిలోకి ఎక్కి కూర్చున్నారు..వారి ప్రక్కన శ్రీధరరావు గారు, ఆయన ప్రక్కన ప్రభావతి గారు, ఇటు చివరన కౌసల్యమ్మ, రమణయ్య గార్లు కూర్చున్నారు..బండి మెల్లిగా మొగలిచెర్ల వైపు బయలుదేరింది..ప్రభావతి గారి మనసులో మరో సందేహం మొదలైంది..ఇంటిదగ్గర తన అత్తగారు..శ్రీధరరావు గారి తల్లి గారున్నారు..పెద్దావిడ వున్నారు..ఇంతకాలం తామిద్దరూ మాట్లాడుకుంటుంటే శ్రీ స్వామివారి గురించి కర్ణాకర్ణిగా వినీవున్నారు.. రెండు మూడు సార్లు తమతో "ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అందరినీ నమ్మకండి నాయనా!.."అని సున్నితంగా హెచ్చరించి వున్నారు..మరి ఇప్పుడు ఏకంగా శ్రీ స్వామివారిని ఇంటికే తీసుకొస్తే..ఆ పెద్దావిడ ఏమంటారో?..అని అనుకుంటూ కళ్ళుమూసుకున్నారు..


"అన్నీ సవ్యంగా జరుగుతాయమ్మా.." శ్రీ స్వామివారి కంఠం లోంచి వచ్చిందామాట..ఉలిక్కిపడి కళ్ళు తెరిచారు ప్రభావతి గారు..శ్రీ స్వామివారు ఎటో చూస్తున్నారు.."అన్నీ సవ్యంగానే జరుగుతాయి.."మళ్లీ అదేమాట ఆయన నోటినుంచి వచ్చింది..


ఇంతలో ఒక గాలి తెర శ్రీ స్వామివారు కూర్చున్న వైపునుంచి మిగిలిన వాళ్ళందరినీ తాకుతూ వెళ్ళింది..ఒకరకమైన దుర్గంధం బండి అంతా వ్యాపించింది..అందరూ గబుక్కున తమ ముక్కు మూసుకున్నట్లు చేతులడ్డంపెట్టుకున్నారు..శ్రీధరరావు గారు శ్రీ స్వామివారి వైపు చూసారు.."ఎంత యోగి అయినా..ఈ వాసన ఏమిటి?..ఇలాటి కంపు ఎలా భరిస్తాం?." అని ప్రభావతి గారు అనుకున్నారు..


ఫక్కున నవ్వారు శ్రీ స్వామివారు.."అమ్మా!..వారం రోజులుగా సమాధి నిష్ఠలో వున్నాను..స్నానం కూడా చేయలేదు..అసలు ఆ ధ్యాసే కలగ లేదు..మరి నా శరీరం నుండి దుర్గంధం కాక మరేమోస్తుంది?.." అన్నారు..ఈ సారి దంపతులిద్దరే కాక మిగిలిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు..తమ మనసులోని ప్రతి ఆలోచన శ్రీ స్వామివారు గ్రహిస్తున్నారు..ఇంతలో మరో గాలి తెమ్మెర మళ్లీ వీచింది..ఈసారి అత్యంత సుగంధ పరిమళం చుట్టూ వ్యాపించింది.."ఎంత మంచి వాసన!..ఎక్కడిదో!.." అప్రయత్నంగా రమణయ్య గారు పైకి అనేశారు..శ్రీ స్వామివారు తన చేతి వ్రేళ్ళకు పెరిగిన గ్రోళ్లను చూసుకుంటున్నారు..


తమవెంట వస్తున్నది ఎవరో పిచ్చివాడు కాదనీ..సమస్తమూ తెలిసిన ఒకానొక సిద్ధపురుషుడే ఈ దిగంబర యోగి గా మారి, తమను, మొగలిచెర్ల గ్రామాన్ని పునీతం చేయడానికి సాధారణ మానవునిలా మారి తమవెంట వస్తున్నాడని..తమ జన్మ జన్మల పాపాలు ప్రక్షాళన చేయడానికి తమ ఇంట అడుగుబెడుతున్నాడనీ.. ప్రభావతీ శ్రీధరరావు దంపతులకు స్పష్టంగా తెలిసివచ్చింది.."స్వామీ లక్ష్మీ నృసింహా!..నీదే భారం తండ్రీ!..శరణు!!.."అని అనుకున్నారు..


శ్రీ స్వామివారి తో సహా అందరూ మొగలిచెర్ల గ్రామం లోని శ్రీధరరావు గారి ఇంటికి చేరారు..


ఫకీరు మాన్యం..మన్నేరు నది..రేపు..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: