7, జూన్ 2023, బుధవారం

కడప జిల్లా : గండిక్షేత్రం

 🕉 మన గుడి : 


⚜ కడప జిల్లా : గండిక్షేత్రం

⚜ శ్రీ  గండి వీరాంజనేయ స్వామి ఆలయం


" యత్ర యత్ర రఘునాథ కీర్తనం

 తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్

 భాష్పవారి పరిపూర్ణ లోచనం 

మారుతిం నమత రాక్షసాంతకమ్.

    

శ్రీ ఆంజనేయస్వామి వారు ఎక్కడెక్కడ భక్తులు శ్రీరామ భజనలు కీర్తనలు చేస్తూ ఉంటారో! అచ్చోట ఆనంద బాష్పాలతో చిరంజీవి అయిన ఆ స్వామి ప్రత్యక్షమవుతారు .

ఏ ఇంట్లో ప్రతినిత్యం భక్తి శ్రద్ధలతో హనుమంతుని పూజిస్తారో! ఆ యింట్లో హనుమంతుని ప్రభావంవల్ల "మహాలక్ష్మి" స్థిరముగా ఉంటుంది.


💠 మనదేశంలో అత్యంత ప్రముఖంగా పేర్కొనదగిన హనుమత్‌ క్షేత్రాలో హనుమ స్వయంభువుడై వెలిసినట్లు చెబుతారు.

అయితే, కేవలం ఒక్కచోట మాత్రం హనుమకు ఆరాధ్యదైవమైన శ్రీరామచంద్రుడు తన బాణం మొనతో హనుమ ఆకారాన్ని చెక్కటం, తన స్వామి చెక్కిన ఆ చిత్రంలోకి హనుమ స్వయంగా వచ్చి నిలవడం కనిపిస్తుంది.

అదే కడప జిల్లా వేంపల్లెకు దగ్గరలోని గండి ఆంజనేయస్వామి ఆలయం.


💠 పాపఘ్నీ నది ఇక్కడ శేషాచలం కొండను చీలుస్తుంది. కొండకు గండి కొట్టింది కాబట్టి ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చింది.

పాపాఘ్ని నది కుడి ఒడ్డున వీరాంజనేయ స్వామి ప్రతిష్ఠితుడై ఉన్నాడు. 

ఆ నదే పెన్నాఘ్నిగా పిలువబడింది, ఇప్పుడు పెన్నా నదిగా పిలుస్తున్నారు. 


💠 పాపాలను నశింపజేసేది కాబట్టి ఈ నదికి పాపాఘ్ని అని పేరు వచ్చింది.  పాపాఘ్ని నది గండి క్షేత్రంలో ఆంజనేయస్వామి ఆలయానికి ఎదుట దక్షిణం నుండి ఉత్తర ప్రవాహం ఉండటంతో మరింత ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. నదిలో స్నానం చేసి 

స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపాల నుంచి విముక్తి లబిస్తుంది అని ప్రతీతి.


⚜ స్థల పురాణం ⚜

 

💠 రామాయణ కాలంలో అప్పటికే వాయుక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన గండిక్షేత్రంలో వాయుదేవుడు తపస్సు చేసుకుంటూ ఉండేవాడు.

శ్రీరాముడు సీతాన్వేషణ సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆయనకు వాయుదేవుడు ప్రణమిల్లి తన ఆతిధ్యాన్ని స్వీకరించమని కోరాడు. సీతను తీసుకుని అయోధ్య తిరిగి వెళ్ళేటప్పుడు వస్తానని శ్రీరాముడు వాయుదేవునికి మాట ఇచ్చాడు.


💠 రావణ సంహారానంతరం శ్రీరాముడు వానరసేనతో కలిసి ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రాంతంలోకి వస్తున్నాడని తెలిసుకున్న వాయుదేవుడు రెండుగా చీలి, నదికి దారినిస్తూ ఆకాశమంత ఎత్తున కన్పిస్తూ దివ్య కాంతులను వెదజల్లుతున్న కొండ శిఖరాలను చూసి నానా రత్నమణి గణఖచితమైన దివ్యమైన స్వర్ణతోరణం రెండు కొండల శిఖరాలనూ

 కలుపుతూ కొండల మధ్యలోయలో

బంగారు పూలదండతో బంగారు తోరణం నిర్మించి స్వాగత సూచకంగా వేలాడదీశాడు

 

💠రాముడు ఈ గండి ప్రాంతంలో బస చేశాడు.

హనుమంతుడిని తలుచుకుంటూ శ్రీరాముడు ఒక కొండపై ఆంజనేయుని ఆకారాన్ని తన బాణంతో గీశాడట. 

రాముడు మొత్తం బొమ్మను గీసాడు కానీ ఆంజనేయుని ఎడమకాలి చిటికెన వేలిని చెక్కేలోగా రాహుకాలం రావడంతో అంతటితో వదిలేశాడట రాముడు. ఆ శిలను అక్కడినుంచి తరలిద్దామని చూడగా, వేలినుంచి రక్తం కారడంతో స్వామి వారక్కడ సజీవరూపులై ఉన్నారని తెలుసుకుని, చేసేదేమీ లేక ఆ స్థలంలోనే ఆలయాన్ని నిర్మించారట. అదే గండి వీరాంజనేయస్వామి దేవాలయం.

ఇక్కడ స్వామివారి ఒక పాదానికి చిటికెనవేలు ఉండదు. ఆ చిటికెనవేలును చెక్కేందుకు ఎవరు ప్రయత్నించినా స్వామివారి విగ్రహం నుంచి రక్తం వస్తుంది. అందుకే ఇక్కడి మూర్తిని " సజీవ ఆంజనేయ స్వామి మూర్తిగా" పేర్కొంటారు.


💠 ఆ స్వామి దర్శనమాత్రంతోనే సమస్త దోషాలు తొలగి సర్వశుభాలు కలుగుతాయని అంటారు.హనుమ పాదాలను అభిషేకిస్తూ, ప్రజల పాపాలను పోగొట్టే పాపహారణియై ‘పాపఘ్నీ’ అనే సార్థక నామ ధ్యేయంతో ఆ నదీమతల్లి గౌరవించబడుతోంది.


💠 వాయుదేవుడు నిర్మించిన ‘ఆకాశతోరణం’ అదృశ్యరూపంలో శాశ్వతంగా నిలిచి వుంటుందనీ, తపోధనులూ, జీన్ముక్తులైన మహాజ్ఞానులకూ భక్తియుతులకూ మాత్రమే ఆ తోరణ దర్శనభాగ్యం కలుగు తుందనీ, ఆ తోరణాన్ని దర్శించిన వారు జన్మాంతరంలో శాశ్వత విష్ణుసాయుజ్యం పొందుతారని సీతారాములు దీవించారు.ఇలా సీతారాములచే గండిక్షేత్రంలో చిత్రహనుమ ఉద్భవం సర్వమంగళకరంగా జరిగింది. 


💠 ఆ తోరణం 1914లో అప్పటి కడప జిల్లా కలెక్టర్‌ సర్‌ ధామస్‌ మన్రోకి కనిపించినట్టు కడప జిల్లా గురించి మద్రాసు ప్రభుత్వం ప్రచురించిన గెజిట్‌లో పేర్కొనబడింది. 


💠 మధ్వ సంప్రదాయానికి చెందిన వసంతాచార్యులు గండి ఆంజనేయస్వామి ఆలయాన్ని నిర్మించారు. 

ఆయన ఆంజనేయస్వామి భక్తుడు. 

ఈ ఆలయంలో ఆంజనేయస్వామికి నివేదన చేసిన ప్రసాదాన్ని వసంతాచార్యుల వారికి కూడా నివేదన చేయడం ఇప్పటికీ సంప్రదాయంగా సాగుతోంది. 


💠 శ్రీరాముడు వాయుదేవుడు ఉన్న గండి క్షేత్రానికి వచ్చింది శ్రావణ మాసంలోనే. అందుకే ఇక్కడ శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు.


💠 ఈ మహిమాన్విత పుణ్య క్షేత్రం కడప జిల్లాలోని రాయచోటి - వేంపల్లి మార్గoలో ఉంది. రాయచోటి, వేంపల్లిల నుంచి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

కామెంట్‌లు లేవు: