7, జూన్ 2023, బుధవారం

చారిత్రాత్మక కథాస్రవంతి🌹* . ♦️ *ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 83*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 83* 


మరొక అర్థగంట తర్వాత రాక్షసుడు వచ్చి దర్శనం కోసం వేచివున్నా డని సేవకుడు చెప్పాడు. అతడిని లోపలికి పంపించమని చెప్పి చాణక్యుడు మామిడిపండు తీసుకుని తింటూ చంద్రుడిని కూడా తినమని సైగచేశాడు. 


కాసేపటి తర్వాత రాక్షసుడు వస్తూనే వాళ్ళిద్దరూ తాను పంపిన పళ్ళెంలోని ఫలాలను ఆత్రంగా ఆరగించడం చూస్తూ మందహాసం చేశాడు. 


"రండి అమాత్యా ! ఆసీనులు కండి. మీరు పంపించిన ఫలాలనే ఆరగిస్తున్నాం... అబ్బా... చాలా మధురంగా ఉన్నాయి... నా జన్మలో ఇట్లాంటి ఫలాలను తినలేదు" అన్నాడు చాణక్యుడు. 


'తిను... తిను... నీకిక జన్మేవుండదు' అనుకున్నాడు రాక్షసుడు ఆశీనుడవుతూ. చంద్రుడు వంత పాడుతూ "అవునవును. ఇంతటి రుచి నేను ఎరుగను. అమాత్యుల వారి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడే తెలిసింది" అన్నాడు. 


"బుడతడివి. నా ప్రత్యేకత నీకేం తెలుసురా...?" అనుకున్నాడు రాక్షసుడు లోలోపల పరిహాసంగా. वौ 


చాణక్య చంద్రగుప్తులు తాపీగా, ప్రశాంతంగా తాను పంపిన ఫలాలను ఆరగిస్తుంటే వారి ముఖాల్లో రాబోయే మార్పు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు రాక్షసుడు. అలా మరికొంతసేపు తీరిగ్గా ఫలాలను ఆరగిస్తూ కాలక్షేపం చేశారు చాణుక్య చంద్రగుప్తులు. రాక్షసుడు ఆశించిన మార్పు వాళ్లలో ఎంతకీ కనిపించకపోవడంతో అతనికి తీవ్రమైన అసంతృప్తి కలిగిస్తోంది వాళ్ల ప్రవర్తన. ఎట్టకేలకు వాళ్ళిద్దరూ ఫలహారం ముగించారు. వాళ్లలో ఎలాంటి మార్పూ సంభవించలేదు. 


"ఇప్పుడు చెప్పండి అమాత్యా ! ఏం పని మీద వచ్చారు ?" సూటిగా అడిగేసాడు చాణక్యుడు. 


అమాత్యుడు సమాధానం చెప్పబోతుండగా ప్రతీహారి లోపలికి వచ్చి "జయము... జయము చాణక్యుల వారికి" అన్నాడు.


చాణక్యుడు విసుగుతో "ఏమిరా ... ?" అని అడిగాడు. 


"శోణనదీ అవతలి తీరాన ఆశ్రమవాసంలో ఉన్న సర్వార్ధసిద్ధి అట... వారికి రాక్షసమాత్యులు మామిడి ఫలాలను పంపారట. ఆ ఫలాలు ఆరగించినంతనే సర్వార్ధ సిద్ధి గిలగిలలాడుతూ క్రింద పడి మరణించారట..." 


ఆ వార్త విని నిర్గాంతపోయాడు రాక్షసమాత్రుడు. అతడి మొహం కత్తి వాటుకు నెత్తురుచుక్కలేకుండా నల్లబారింది. 'తాను చాణక్య చంద్రగుప్తులకు విషఫలాలు పంపితే, అక్కడెక్కడో వున్న సర్వార్ధ సిద్ధి ఎలా మరణించాడు ? ఇందులో ఉన్న తిరకాసు ఏమిటి ?' 


రాక్షసుడు తలెత్తే అనుమానంగా చాణక్యుని వైపు చూశాడు. చాణక్యుడు కొంటెగా నవ్వి "చూసావా, వృషలా ! అమాత్యుల వారికి నీ మీదున్న వాత్సల్యం ? భవిష్యత్తులో నందుల వారసుల వల్ల నీకు ఎలాంటి ప్రమాదం రాకూడదని.. నంద శేషాన్ని నీకు అడ్డు రాకుండా ఎలా తప్పించేశారో చూశావా...?" అన్నాడు పరిహాసంగా. 


రాక్షసుడికి మతిపోయినట్లయ్యింది. 'తాను నందశేషాన్నీ తప్పించేశాడా...? అంటే... తాను పంపించిన మామిడి పండ్లు .... ?' రాక్షసుడు సందిగ్ధంతో చాణక్యుడి ముఖంలోకి తేరిపార చూశాడు. అతడి ముఖం ఏ భావం వ్యక్తం కాకుండా వుదాసీనంగా కనిపించింది. 


"ఏమిటి అమాత్యా ! తమరేం పనిమీద వచ్చారో చెప్పారు కాదు" నవ్వుతూ రెట్టించాడు చాణక్యుడు. 


రాక్షసుడు తేరుకుంటూ "పనేం లేదు. దర్శనం చేసుకుందామని వచ్చాను. వస్తా" అంటూ లేచి నిష్క్రమించాడు. 


చాణక్య చంద్రగుప్తులు ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటూ ముసిముసిగా నవ్వుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరిన రాక్షసుడు తిన్నగా ఆశ్రమానికి వెళ్ళాడు. 


జీవసిద్ధి బ్రాహ్మణద్వేషి. చాణక్యుడు బ్రాహ్మణుడు. అతని కారణంగానే నందులు హతమయ్యారు. మార్గాలు వేరైనా తనలాగే జీవసిద్ది కూడా నందాభిమాని. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవసిద్ది కంటే నమ్మదగిన వ్యక్తులు - మిత్రులు లేరు. అతడు తలుచుకుంటే ఏదైనా ఏర్పాటు చెయ్యగలడు. 


జీవసిద్ధిని ఒంటరిగా కలుసుకున్న రాక్షసుడు తన హృదయావేదనను అంతా వెళ్లబోసుకుని చంద్రగుప్తుని తుదముట్టించడానికి అతని సహాయాన్ని అర్ధించాడు. 


రాక్షసుని గోడు విన్న జీవసిద్ధి అతన్ని ఓదారుస్తూ "బాధపడకండి అమాత్యా ! మీలాగే నందులని రక్షించాలని నేనూ ఎంతో ప్రయత్నించాను. ఆ ఒక్కరోజు గడ్డురోజు అనీ, తొందరపడోద్దని ప్రాధేయపడ్డాను. వినిపించుకున్నారు కాదు. వెర్రి ఆవేశంతో చంద్రగుప్తుని ఎదుర్కోని ప్రాణాలు పోగొట్టుకున్నారు. నందుల దుర్మరణానికి ప్రతీకారం చెయ్యాలని నా మనసూ ఆవేశంతో రగిలిపోతుంది. కానీ ఏం చెయ్యను ? బౌద్ధబిక్షకులు అంటే ఆ చాణక్యునికి పడదు. బౌద్ధుల నీడ కూడా తన మీద పడనివ్వడు. అందుకే... ప్రతీకారం తీర్చుకునే ఉపాయం తెలిసిఉండీ, వాళ్ళని సమీపించే అవకాశం లేక చేతులు ముడుచుకుని కూర్చున్నాను" చెప్పాడు బాధగా. 


"నేను సమీపించగలను. నా రాకపోకలపై నిషేధం లేదు. మన ఇద్దరి పగ నేను తీరుస్తాను. ఆ ఉపాయం ఏమిటో నాతో చెప్పండి" అన్నాడు రాక్షసుడు ఆవేశంగా. 


జీవసిద్ధి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. ఓసారి అటూ ఇటూ చూసి ఎవ్వరూ లేరని నిశ్చయించుకుని స్వరాన్ని బాగా తగ్గించి "ఉపాయం అంటే మామూలు ఉపాయం కాదు... చంద్రుని ప్రాణాలు హరించగల బ్రహ్మాస్త్రం .... దాన్ని ప్రయోగించగల అవకాశం ప్రస్తుతం మీ ఒక్కరికే వుంది...." అన్నాడు. 


రాక్షసుడు ఆశ్చర్యపోతూ "బ్రహ్మాస్త్రమా ...?" అన్నాడు.


జీవసిద్ధి తల పంకిస్తూ "అవును... గురి తప్పకుండా చంద్రుని ప్రాణాలు తియ్యగల మారణ మన్మధాస్త్రం... అది... విషకన్య..." అని చెప్పాడు జీరపోయిన స్వరంతో. 


' విషకన్య ' అన్న పేరు వింటూ అదిరిపడ్డాడు రాక్షసామాత్యుడు.

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.*


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: