విందులో వేళాకోళాలు
-----------------------------------
ఎవరో మామూలు మనుషులైతే అనుకోవచ్చు, సాక్షాత్తు పరమ శివుడు, విష్ణువు యిలామాట్లాడు కున్నారంటే చిత్రమేగదా! అదేమిటో పరిశీలిద్దాం పదండి.
శ్రమతి గంటి కృష్ణ వేణమ్మ గార నేరచయి 'త్రి గిరిజా కళ్యాణమనే ' చంపూగ్రంధాన్ని (పద్యము+గద్యము కలసియున్నది) వ్రాశారు. అందులో యీవిచిత్రమైన ఘట్టం ఉన్నది.
గిరిజా శంకరుల కళ్యాణం చూడ ముచ్చటగా జరిగింది. కళ్యాణానంతరం పెళ్ళికి వచ్చిన వారికందరకూ విందు యేర్పాటు చేయబడింది. ఆవిందు సందర్భంలో భోజనాల వేళ శివుడు, విష్ణువు వేళాకోళాలాడుకునే రెండుపద్యాలు చాలా చిత్రంగావ్రాశారు వినిపిస్తాను వినండి.
ఆ: " విసము తిన్న నోట కసవయ్యె కాబోలు
భక్షణంబు లెల్ల పార్వతీశ!
అట్టి దివ్యమైన ఆహారములు లే
వటంచు పల్కె విష్ణు డభవుతోడ; "
విష్ణువు శివునితో యిలాగంటున్నాడు. " ఈబూరెలూ గారెలూ అవీ, నీకు నచ్చినట్లు లేదే? అవునులే కాలకూట విషంతిన్న నోటికి ఈభక్ష్యాలన్నీ గడ్డిలా కనబడుతున్నయేమో ! ఏంచేస్తాం ? అలాటి పదార్ధాలిక్కడ లేవే? "-దానికి సమాధానంగా విష్ణువు యిలాగంటున్నాడు
ఉ: "నిక్మము నీవు పల్కినది నీరజ నాభ! ఇటెందు మ్రుచ్చిలన్
చిక్కదు వెన్న! తెత్తుమన చిక్కవు ఎంగిలి కాయలెందు నీ
కెక్కడ దెత్తుమయ్య!? అవి యిప్పుడటంచు శివుండు నవ్వినన్
అక్కడ పంక్తి భోజనమునందు పకాలున నవ్విరందరున్ ";
విష్ణూ! నిజమేనయ్యా నువ్వుచెప్పింది. ఇక్కడెక్కడా దొంగతనంచేద్దామన్నా వెన్న దొరకదు. తెద్దామన్నా యెంగిలి కాయలూ దొరకవు. ఎక్కడనుండి తేగలంమరి? అని చెప్పి శివుడు నవ్వాడట! ఆపంక్తిలో కూర్చున్న బ్రహ్మేంద్రాదు లందరూ వీరిమాటలకు పకాలున నవ్వారట!
అసలు విషయంయిది. శివుడేమో లోకరక్షణార్ధం విషంతిని గరళ కంఠుడైతే, కృష్ణుడిగా వెన్న దొంగిలించి గోపికలనందరను ధన్యుల గావించాడనీ, శబరియిచ్చిన యెంగిలికాయలు దిని రామునిగా మోక్షమిచ్చినవాడని,పరోక్షంగా శివకేశవులను ప్రస్తుతించటమే!
ఇది వ్యాజ స్తుతి యలంకారం (స్తుతిచేనింద,నిందచే స్తుతి గమ్యమానమగుట )
స్వస్తి!🙏🌷🌷🌷
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి