4, మార్చి 2024, సోమవారం

మహాభారతం

 శ్రీమదాంధ్ర మహాభారతం లోని కొన్ని అద్భుతవిషయాలు -  118      .            .    

అరణ్యపర్వం -  పంచమాశ్వాసం. 


‘ మానవశరీరంలో ధాతువుల వలన అగ్ని యెలా ప్రజ్వరిల్లుతుందో దయచేసి చెప్పగలవా ? '  అని అడిగిన కౌశికునికి  ధర్మవ్యాధుడు చెబుతున్నాడు : 


" ఓ మునీశ్వరా !  ధాతువులు అనగా మనిషి జీవించడానికి ఆధారమైన పదార్ధాలు.   అవి ఏడువిధాలు.   వస, అసృక్కు, మాంసము, ఆస్థి, స్నాయువు,  మజ్జ, శుక్రము. 


పంచప్రాణాలు అనగా ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన,  సమాన వాయువులు.  ఇవి  వాయురూపంలో ఉంటాయి.   ఆత్మాగ్ని మనిషి నాభినుండి శిరస్సు వరకూ వ్యాపించి వుంటుంది.  అన్నిప్రాణులకూ జీవత్వాన్ని  ప్రసాదించేది ఆ అగ్నియే.  అపానవాయువు ప్రాణికి తోడుగా  పొత్తికడుపు- మలద్వారం మధ్య అగ్నిని ప్రజ్వరిల్లిస్తూ వుంటాడు.    ఇక ఉదానవాయువు కంఠం వద్దవుండి పదార్ధాలు తేలికగా శరీరం లోనికి  ప్రవేశించడానికి దోహద పడుతుంది.  వ్యానవాయువు కండరాల మధ్యలోవుండి వాటి కదలికకు సహకరిస్తుంది. 


సమానవాయువు నాభిప్రదేశంలో వుండి ఆహార పదార్ధాలు జీర్ణమయ్యేటట్లు చేసి, ధాతువులను వృద్ధిపరుస్తూ ఉంటుంది.   సమానవాయువు పాత్ర ఆత్మాగ్నికి  ప్రాణ అపాన వాయువులకు సహకరించడం లో అతి ముఖ్యమైనది.   ఈ ప్రాణాగ్నియే జీవాత్మ.   జీవాత్మ తామరాకుమీద నీటిబొట్టులాగా దేహంలో నిర్లిప్తమై వుంటుంది. .అచేతనమైన దేహానికి చైతన్యాన్ని యిచ్చే  ఈ జీవాత్మయే అద్వైత సిద్ధాంతంలో పరమాత్మ.  


అందువలననే జ్ఞానాన్ని సంపాదించిన మహానుభావులు అన్ని విషయాలలో నిర్లిప్తులుగా వుంటారు.  అలాంటి మహానుభావులు యోగసాధన చేస్తూ మితాహారులై  ఇంద్రియాలను నిగ్రహించి ఆత్మలో పరమాత్మను దర్శించి నిశ్చలమైన జ్యోతిలాగా ప్రకాశిస్తూ వుంటారు. 


కాబట్టి మునీంద్రా !  అలాంటి దశకి చేరుకోవాలంటే, కామక్రోధాలను పూర్తిగా విడిచిపెట్టాలి.   మానవుడు  కర్మలను చేస్తూ కర్మఫలాన్ని కోరుకోకుండా భగవదర్పణ చేస్తూ  వేదాంతివలే జీవించాలి.   


అని చెబుతూ ధర్మవ్యాధుడు తనకు తెలిసినంతవరకూ చెప్పాననీ, ఇంకాఏమైనా తెలుసుకోవాలని ఉన్నదా ! అని అడిగాడు.  దానికి కౌశికుడు  తాను విన్న విషయాలతో తృప్తి చెందానని చెబుతూ, ధర్మవ్యాధుని సర్వజ్ఞత్వాన్ని ప్రశంశించాడు.


ధర్మవ్యాధుడు కౌశికుడు చెప్పిన దానికి పొంగిపోకుండా,  ' మహర్షీ !  నేను ఏకొంచెము తెలుసుకున్నా దానికి కారణం ఒకటి వున్నది.  అదేదో మీరే కళ్లారా చూద్దురుగాని రండి. ' అని కౌశికుని తన గృహం అంతర్భాగం లోని  తల్లిదండ్రుల  గదిలోకి తీసుకువెళ్ళాడు. 


ఆ గదిలో గాలీ వెలుతురూ పుష్కలంగా వస్తున్నది.  అతని తల్లిదండ్రులు ఆ సమయంలో తృప్తిగా భోజనం చేసి భుక్తాయాసంతో విశ్రమిస్తూ వున్నారు.  ధర్మవ్యాధుడు వారికి నమస్కరించి వాళ్ళ యోగక్షేమాలను విచారించాడు.   అతని తల్లిదండ్రులు, '  నాయనా ! నీలాంటి కుమారుడు వుండగా మాకేమిలోటు ?  నువ్వు ధర్మమూర్తి అవతారం లాగా మమ్మల్ని  రక్షిస్తున్నావు.  నీకు ఆ ధర్మమే రక్షణ యిస్తుంది.   మాతాపితరుల సేవలో నువ్వు పరశురాముడినే మి౦చిపోయావు.  '  అని వాత్సల్యంగా ధర్మవ్యాధుని దగ్గరకు తీసుకున్నారు. 


ఆ తరువాత ధర్మవ్యాధుడు కౌశికునికి తన తల్లిదండ్రులను పరిచయం చేస్తూ,  ' ఓ కౌశికమునీంద్రా ! నేను నా తల్లిదండ్రులకు సేవలు చెయ్యడం వలననే నాకీ జ్ఞానం అబ్బింది.  అందరూ కోరికలు తీర్చమని దేవతలను పూజిస్తే, నేను మాత్రం నా తల్లిదండ్రులని పూజిస్తాను. వారే నాకు ప్రత్యక్ష దైవాలు.  నా భార్యాపిల్లలూ, అందరమూ మా తల్లిదండ్రులకు ప్రీతితో సేవలుచేస్తూ వుంటాము.  అదే మాకు యజ్ఞం. అదే మాకు వేదసూక్తి.   పుణ్యం ఆర్జించడానికి ప్రతి గృహస్థూ, తల్లిదండ్రులను, గురువును, అగ్నిని, ఆత్మ అనే అయిదుగురిని సంతోషపెట్టాలి.  


' మునీంద్రా !  ఆ పతివ్రత పంపగా నువ్వు నా దగ్గరకు జిజ్ఞాసువుగా వచ్చావు.  నాకు తెలిసిన విషయాలు చెప్పాను. అయినా నీలో ఏదో అసంతృప్తి కనబడుతున్నది.  దానికి కారణం యేమిటో కూడా నేను తెలుసుకోగలిగాను.  నువ్వు నీ తల్లిదండ్రులకు ఒక్కడివే కుమారుడవు.  వారు ఇప్పుడు మిక్కిలి వృద్ధులై వున్నారు.  వారి అనుమతి తీసుకోకుండా నువ్వు  వేదాధ్యయనం చేసి తరించాలని అనుకున్నావు.   వారు నీకోసం ఏడ్చి ఏడ్చి అంధులైనారు.   వారి వద్దకువెళ్లి వారి సేవలుచేసి తరించు.  తల్లిదండ్రులను దుఃఖపెట్టి నువ్వు ఎన్నిచదువులు చదివినా అవి వ్యర్థం . '  అని నిర్ద్వందంగా చెప్పాడు ధర్మవ్యాధుడు కౌశికునికి . 


కౌశికుడు ఆ మాటలకు ఏమాత్రం నొచ్చుకోకుండా, అహంకార వర్జితుడై, '  ధర్మవ్యాధా !  నీవు చెప్పినవన్నీ యదార్ధాలు.  నా కళ్ళు తెరిపించావు. నా శేషజీవితాన్ని తల్లిదండ్రుల సేవలో గడిపి నా జన్మధన్యం చేసుకుంటాను.  ఇప్పుడు నా మనసెంతో సంతోషంగా వున్నది.  అయితే, నీ మాటలు వింటుంటే నాకు ఆశ్చర్యం వేస్తున్నది.  ఇంతటిజ్ఞానివి నువ్వు యే కారణం చేత ఈ బోయకులములో జన్మించావు ?  తెలుసుకోవాలని వున్నది. దయచేసి వివరించు. '   అని ధర్మవ్యాధుడు అడిగాడు. 


ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు.


స్వస్తి  .  

కవిత్రయం  అనుగ్రహంతో, మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు  ప్రభాకర్.

కామెంట్‌లు లేవు: