13, మే 2024, సోమవారం

తెలుగు సొగసు!

 తెలుగు సొగసు!!


సీ.

అలకలు నటియించి అటువైపు తిరిగిన /

చెలి మోములోనున్న చిలిపితనము //

బుజ్జి పాపాయిని పొత్తిళ్ళ లాలించు /

అమ్మదనములోని కమ్మదనము //

ఏరువాకల నాళ్ళ నిగురొత్తు వరిచాళ్ళ /

జనపదమ్ములలోని జానుదనము //

వేసవి నడిరేయి వెన్నెల చిలికించు /

నెలవంక నవ్వులో చలువదనము //

 

తే.గీ.

కన్నె సరిగంచు పరికిణీ కలికితనము /

ఎంకిపాట పల్లవిలోని పెంకితనము /

కలిపి వడపోత పోసిన తెలుగుదనము! /

తెలుగు సొగసును వర్ణింప నలువ తరమె! /


తెలుగుభాష అందచందాల యోష!

మనభాషలోనిఅందాలకిపాశ్చాత్యులే పరవశించారు. 

నాల్పస్యతపసఃఫలమ్మనే ఆర్యోక్తి---

"ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్"--

అనేమాట---

మన'అజంత'భాషాసౌందర్యాలకి ప్రాచ్యపాశ్చాత్యులసర్టిఫికెట్లు

"దేశభాషలందు తెలుగులెస్స"--

అన్నది--  "పదిభాషలుతెలిసిన ప్రభువుచూచి భాషయననిద్ది యనిచెప్పబడినభాష" కి ప్రభు సత్కారం!

అటువంటి తెలుగుబాస సొగసు చెప్పటమెవ్వరితరం?

అయితే కాలప్రవాహంలో కవులు వర్ణిస్తూనే ఉన్నారు.

రసజ్ఞులానందిస్తూనేయున్నారు

ఆధునికకాలంలో ఒక సుకవి వ్రాసిన పద్యం చూడండి- ఎంతమురువుగొల్పుతున్నదో!


సాహిత్యం కాంతా సమ్మితంగా

హితంప్రబోధిస్తుంది.

-భార్య భర్తని లాలించిదారిలోకి తెచ్చుకున్నట్లు!

అటువంటి భార్య భర్తపై లేనికోపం ప్రదర్శిస్తూ- తన ముంగురులు నుదుటి రంగ

స్థలాన నాట్యమాడగా- తన చిర్నవ్వు భర్తకి తెలియనీయ

కుండగా అటువైపుతిరిగి ముసిముసినగవుల్ని పెదాల

నడుమనే కప్పిపుచ్చుకొనే

జాణతనంలో ఎంత సరస శృంగార లావణ్యం!

ఆ *చిలిపితనం*----


పొత్తిళ్లలో పరుండి కేరింతలాడే

బుజ్జిపాపని ఒళ్ళంతానిమిరే తల్లి లాలనలోనిఅమ్మతనపు

టానందం- అందులోని శిశుతాస్ఫూర్తి వెన్క పిహితమై

యున్న పరమాత్మతత్త్వంలోని 

 ఆ *కమ్మదనం*----


తొలకరిలో‌దుక్కి ప్రారంభంలో పల్లెల్లో వరిచాళ్లు ఇగురొత్తు 'సీజన్లో'--- మనకి‌ జనపదాల్లో

కనిపించేరమణీయ దృశ్యాల్లోని

సౌందర్య విలాసాతిశయంగల

ఆ *జానుదనం*----

(జాను--Grace)


"వేసవి- వెన్నెల"

(ఆరుద్ర గారి కృతి కాదండోయ్!)--- ఎంత contrast!

మండువేసగి నాటి రాత్రి పండు వెన్నెల కురియించే జాబిల్లి ----

(కాదు--- కాదు-- *నెలవంక*!)

----(ఎట్టి‌ వక్రోక్తి వైభవం!)!!

అటువంటిచందమామనవ్వులో-- మనమనుభవించే ఆహ్లాదకరమైన 

ఆ *చలువదనం*----


ఆ "వెన్నెల్లో  ఆడుకునే అందమైన ఆడపిల్ల" కట్టుకొన్న పట్టు పరికిణీలోని---

సంప్రదాయగతమైయున్న

( *మాయమైపోతున్న* అట్టి అమ్మాయిని ఈనాటి దేశంలో వెదకిపట్టుకోవల్సిందే!)

ఆ *కలికితనం*-----


"కళ్ళెత్తితేసాలుకనకాభిసేకాలు"

-- అనదగ్గ ఎంకిలేమ సొగసుపాటలోనిసొయగముఅంతా రంగరించి విరియించిన

ఆంధ్రకళాసంస్కృతివైభవంలో

ఆ *పెంకితనం*----


ఆ తన *తనాల* ధనాల

నన్నింటిని

కలగలిపి--కలనేతనేసి--వడబోతబోసి--ఆ సారాన్ని ఆసాంతం  సొంతంచేసికొన్నమనభాషలోని

ఆ *తెలుగుదనం*----


తత్పరీమళం-- దాని సర్వస్వం--- వర్ణించటం ఎవరితరం? నలువ తరమా?-

--- అంటే---కాదని కవి‌భావం.

బ్రహ్మకి పర్యాయపదాల్లో *నలువ* నే యెన్నుకోవటం గమనీయం.

నాలుగు వాయిలుగల వానికే సాధ్యం కాదట! అంటే ఆయన

తలలోనాల్క పైనిలిచిన దేవికీ

ఆ ముదిమదితప్పిన మొదటి

వేల్పు సృష్టిలోని 'వేయితలల

వానికిని'సాధ్యంకాదనే భావం!


--ఇలా అంటూనే అద్భుతంగా వర్ణించిన ఈ కవిగారి కైతలతేనె

*తీయందనం*- మనంఏమని చెప్పగలం?!


ఈ సీసంలోని పది పదాలు తనకి ఎంతో నచ్చాయని కవిగారే స్వయంగా వాక్రుచ్చారు.

అయితే - ఆ పది పదాలు తనకిప్పుడు గుర్తులేవుట!  పదాలన్నీ అందంగా అమరినపుడు---- కొన్ని అందాలే ''పద్దాక"--- 

(అస్తమాను-ఎల్లప్పుడూ--- అనటానికి మా గోదారి జిల్లాల్లో

జానపదులువాడేమాట!)

గుర్తుంచుకోవటం కష్టమే మరి!


ఇంతకీ--- కవిగారు 

*శ్రీ భైరవభట్ల కామేశ్వరరావు గారు*

చూశారా?-చెప్పటంమరిచాను!

ఇది రసజ్ఙభారతి కానుక!

కామెంట్‌లు లేవు: