🕉️ *సోమవారం - మే 13, 2024*🕉️
_*🚩వైశాఖ పురాణం - 4 వ అధ్యాయము🚩*_
🕉🕉🕉🕉🕉🕉🕉
*వైశాఖధర్మ ప్రశంస*
☘☘☘☘☘☘☘☘️☘️
నారద మహర్షిని అంబరీష మహారాజు *"మహర్షీ ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను.* అంబరీషమహారాజా ! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము , నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము , పగటినిద్ర , కంచుపాత్రలో భుజించుట , (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతము నాచరించువారు పాత్రలో , కంచములో భుజింపరాదు. అరటి ఆకు , విస్తరాకు , తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు , వెండిపాత్రలలోను , సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతఃకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట , గృహస్నానము , నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను.
వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్రతము పాటించువారు, యెండలోనడచి అలసిన వారి పాదములను కడిగి ఆ జలమును భక్తి శ్రద్దలతో తలపై జల్లుకొనవలెను. ఇది ఉత్తమమైన వ్రతము. మార్గాయాసమునందిన ఉత్తమ బ్రాహ్మణుని ఆదరించి ఉత్తమ ఆసనమన గూర్చుండబెట్టి వానినే శ్రీ మహావిష్ణువుగ భావించి వాని పాదములను నీటిచే కడిగి యా పవిత్రజలమును తలపై జల్లుకొనిన వాని పాపములన్నియు పటాపంచలై నశించును. ఆ జలమును తలపై జల్లుకొనిన గంగ మున్నగు సర్వతీర్థముల యందు స్నానము చేసిన పుణ్యఫలము సిద్ధించును.
విష్ణుప్రీతికరమైన వైశాఖమున నదీ తటాకాది స్నానము చేయక , తామరాకు మున్నగు ఆకులయందు ఆహారమును భుజింపక , విష్ణు పూజనము లేక కాలము గడిపిన ప్రాణి గాడిదకడుపున బుట్టి తరువాత జన్మయందు కంచరగాడిదగా జన్మించును. ఆరోగ్యవంతుడై యుండి దృఢశరీరము కలిగి స్వస్థుడైయున్నను వైశాఖమున గృహస్నానము చేసినచో నీచ జన్మనందును వైశాఖమున బహిస్నానము నదీ తటాకాదులలో చేయనివాడు వందలమార్లు శునక జన్మమునొందును. స్నానాదులు లేక వైశాఖమాసమున గడిపినవాడు పిశాచమై యుండును. వైశాఖమాసవ్రత మాచరించినప్పుడే వానికి పిశాచత్వము పోవును. వైశాఖమున లోభియై జలమును , అన్నమును దానము చేయనివాడు పాపదుఃఖముల నెట్లు పోగొట్టుకొనును ? పోగొట్టుకొనలేడని భావము.
శ్రీమహావిష్ణువును ధ్యానించుచు నదీస్నానము నాచరించినవారు గత మూడు జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనురు. ప్రాతఃకాలమున సూర్యోదయ సమయమున సముద్రస్నానము నాచరించినచో ఏడు జన్మలలో చేసిన పాపములును పోవును. జాహ్నవి , వృద్దగంగ , కాళింది , సరస్వతి , కావేరి , నర్మద , కృష్ణవేణి యని గంగానది యేడు విధములుగ ప్రవహించి సప్తగంగలుగా ప్రసిద్దినందినవి. అట్టి సప్తగంగలలో ప్రాతఃకాలస్నానము వైశాఖమున చేసిన కోటి జన్మలలో చేసిన పాపములను గూడ పోగొట్టుకొనుచున్నారు. దేవతలచే నిర్మితములైన సముద్రాదులందు స్నానమును వైశాఖమాస ప్రాతఃకాలమున చేసినవారి సర్వపాపములు నశించి పుణ్యప్రాప్తి కలుగును. గోపాదమంత ప్రమాణము కల బహిర్జలమున(లోతు లేకున్నను ఆరుబయట తక్కువ జలమున్న సెలయేళ్లు) గంగాది సర్వతీర్థములు వసించును. ఈ విషయమును గమనించి భక్తి శ్రద్దలతో వాని యందు స్నానమాడవలెను.
రసద్రవ్యములలో క్షీరముత్తమము. క్షీరము కంటె పెరుగు ఉత్తమము. పెరుగుకంటె నెయ్యి ఉత్తమము. నెలలలో కార్తికమాసముత్తమము. కార్తికముకంటె మాఘమాసముత్తమము. మాఘముకంటె వైశాఖముత్తమము. ఇట్టి వైశాఖమున చేసిన పుణ్యకరమైన వ్రతము దానము మున్నగునవి వటవృక్షము వలె మరింతగా పెరుగును.
కావున నిట్టి పవిత్రమాసమున ధనవంతుడైనను , దరిద్రుడైనను , యధాశక్తి వ్రతము నాచరించుచు బ్రాహ్మణునకు యధాశక్తిగ దానమీయవలెను కంద మూలములు , పండ్లు , వ్రేళ్లు , కూరలు , ఉప్పు , బెల్లము , రేగుపండ్లు , ఆకు , నీరు , మజ్జిగ మొదలగువానిని నిచ్చినను కలుగు పుణ్యమనంతము. బ్రహ్మ మున్నగు దేవతలంతటి వారికిని యీ మాసమున వ్రత దానాదులు లేనిచో నెట్టి ఫలితము లేదు. దానము చేయనివాడు దరిద్రుడగును. దరిద్రుడగుటచే పాపముల నాచరించును. అందుచే నరకము నందును. కావున యధాశక్తిగ దానము చేయుట యెట్టి వారికైనను ఆవశ్యకము. కావున తెలివియున్నవారు సుఖమును కోరుచు దానము చేయవలయును. ఇంటిలో నెన్నియలంకారములున్నను పైకప్పులేనిచో ఆ యిల్లు నిరర్ధకమైనట్లు జీవి యెన్ని మాస వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో వాని జీవితమంతము వ్యర్థము. అన్ని మాసముల వ్రతముల కంటె వైశాఖమాస వ్రతము ఉత్తమమను భావము. స్త్రీ సౌందర్యవతియైనను , గుణవంతురాలైనను , భర్త కలిగియున్నదైనను , భర్తను ప్రేమించుచు , భర్తృప్రేమను కలిగియున్నను , వైశాఖవ్రతము నాచరింపనిచో ఎన్ని లాభములున్నను వ్యర్థురాలని యెరుగుము. అనగా సర్వశుభలాభములనందిన యువతులును వైశాఖ వ్రతమును చేయనిచో వారికి నున్నవన్నియు నిష్పలములు వ్యర్థములునని భావము. గుణములెన్ని యున్నను దయాగుణము లేకున్నచో వ్యర్థములైనట్లుగా సద్ర్వతము లెన్నిటిని చేసినను వైశాఖమాస వ్రతమును చేయనిచో యన్నియు వ్యర్థములగును సుమా ! శాక సూపాదులు (కూర పప్పు) యెంత యుత్తమములైనను , యెంత బాగుగవండినను ఉప్పులేనిచో వ్యర్థములైనట్లుగా వైశాఖవ్రతమును చేయనిచో నెన్ని వ్రతములును చేసినను అవియన్నియు వ్యర్థములే యగును సుమా. స్త్రీ యెన్ని నగలను ధరించినను వస్త్రము లేనిచో శోభించదో అట్లే యెన్ని సద్ వ్రతముల నాచరించినను వైశాఖవ్రతము నాచరింపనిచో అవి శోభింపవు. కావున ప్రతి ప్రాణియు నీ విషయమును గమనించి వైశాఖమాస వ్రతమును తప్పక ఆచరింపవలెను. సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున శ్రీమహావిష్ణువు దయను వైశాఖ వ్రతము నాచరించి పొందవలెను. ఇట్లు చేయనిచో నరకము తప్పదు. వైశాఖ స్నానాదికముచే సర్వపాపక్షయమై వైకుంఠప్రాప్తి కలుగును. తీర్థయాత్రలు తపము యజ్ఞములు దానము హోమము మున్నగు వానిని యితర మాసములలో చేసినచో వచ్చు ఫలములకంటె వైశాఖమున వ్రతమును పాటించిన పైన చెప్పిన వానిని చేసిన వచ్చు ఫలమత్యధికము. వైశాఖవ్రతము మిగిలిన అన్ని మాసములలో చేసినవానికంటె వీనిని ఫలముల చేయును. మదమత్తుడైన మహారాజైనను , కాముకుడైనను , ఇంద్రియలోలుడైనను వైశాఖమాస వ్రతము నాచరించినచో వైశాఖస్నానమాత్రముననే సర్వదోషముల నశింపజేసి కొని పుణ్యవంతుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసమునకు శ్రీమహావిష్ణువే దైవము.
వైశాఖమాస వ్రతారంభమున స్నానము చేయుచు శ్రీమహావిష్ణువు నిట్లు ప్రార్థింపవలయును.
*మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవౌ |*
*ప్రాతః స్నానంకరిష్యామి నిర్విఘ్నం కురుమాధవ ||*
పిమ్మట స్నానము చేయుచు క్రింది శ్లోకములను మంత్రములను చదివి అర్ఘ్యము నీయవలయును.
*వైశాఖే మేషగేభానౌ ప్రాతః స్నాన పరాయణః |*
*అర్ఘ్యంతేహం ప్రదాస్యామి గృహాణ మధుసూదన ||*
*గంగాయాః సరితస్సర్వాః తీర్థాని చహ్రదాశ్చయే |*
*ప్రగృహ్ణీతమయాదత్త*
*మర్ఘ్యం సమ్యక్ ప్రసీదథ ||*
*ఋషభఃపాపినాం శాస్తాత్వం యమ సమదర్శనః |*
*గృహాణార్ఘ్యం మయాదత్తం యధోక్త ఫలదోభవ ||*
అని ప్రార్థించి అర్ఘ్యములనిచ్చి స్నానమును ముగించుకొనవలెను. పిమ్మట మడి , పొడి బట్టలను కట్టుకొని వైశాఖమాసమున పుష్పించిన పుష్పములతో శ్రీ మహావిష్ణువును పూజింపవలయును. వైశాఖమాస మహిమను వివరించు శ్రీ మహావిష్ణు కథను వినవలెను , చదవవలెను. ఇట్లు చేసినచో లోగడ జన్మలలో చేసిన పాపములన్నియు నశించును. ముక్తి లభించును. ఇట్లు చేసినవారు భూలోక వాసులైనను స్వర్గలోకవాసులైనను , పాతాళలోకవాసులైనను యెచటను వారికి కష్టము కలుగదు. వారికి గర్భవాసము స్తన్యపానము కలుగవు. అనగా పునర్జన్మయుండదు. ముక్తి సిద్దించును.
వైశాఖమున కంచు పాత్రలో భుజించువారు , శ్రీమహావిష్ణువు సత్కధలను విననివారును , స్నానము , దానము చేయనివారును , నరకమునకే పోదురు. బ్రహ్మహత్య మున్నగు పాపములకు ప్రాయశ్చిత్తము కలదు కాని వైశాఖస్నానము వ్రతము చేయని వానికి పాపమును ప్రాయశ్చిత్తము లేదు.
తను స్వతంత్రుడై యుండి తన శరీరము తన యధీనములోనే యుండి , నీరు తనకు అందుబాటులో నుండి స్నానమాడవీలున్నను , స్నానమాడక నాలుక తన యధీనములో నుండి *'హరి'* యను రెండక్షరములను పలుకకయున్న నీచ మానవుడు జీవించియున్న శవము వంటివాడు. అనగా ప్రాణము మాత్రముండి వినుట చూచుటమున్నగు లక్షణములు లేని *'శవము'* వలె నతడు వ్యర్థుడు. వైశాఖమున శ్రీహరిని యెట్లైనను సేవింపనివాడు పందిజన్మనెత్తును.
పవిత్రమైన వైశాఖమాసమున వైశాఖవ్రతమును పాటించుచు ప్రాతఃకాలమున బహిస్నానము చేసి తులసీదళములతో శ్రీమహావిష్ణువు నర్చించి విష్ణు కధాశ్రవణము దానము చేసినవారు మరు జన్మలలో మహారాజులై జన్మింతురు. పిమ్మట తమ వారందరితో గలసి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యము నందుదురు. శ్రీ మహావిష్ణువును నిశ్చలమైన మనస్సుతో సగుణముగనో నిర్గుణముగనో భావించి పూజింపవలయును సుమా.
_*వైశాఖ పురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం*_
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి