13, మే 2024, సోమవారం

జిహ్వకో రుచి..

 *జిహ్వకో రుచి...*

💐💐💐💐💐


"మావిడికాయ్ పప్పు చేశావ్, బ్రమ్మాండంగా ఉంది, అదే చేత్తో నాలుగప్పడాలు, రెండు ఒడియాలు, ఓ పది చల్లమిరపకాయలూ కూడా వేయించేస్తే, స్వర్గానికి జానెడు దూరంలో ఉండేది కదటోయ్..."


"ఇందాకే యూట్యూబులో చూశాను, మా డాక్టర్ గారి వీడియో...*'డీప్ ఫ్రై' చేసినవి తింటే, ఆరోగ్యం అటకెక్కుతుందని* చెప్పారు...పైగా, అందరికీ చెప్పమన్నారు..."


"మనింట్లో అటక లేదుగా...ఏం పర్లేదు...మా గురువుగారు, గరికిపాటి గారు చెప్పారు... *'రసహీనమైన బతుకు బతికే కంటే, అన్నీ సుబ్బరంగా తిని, 50 ఏళ్ళకే బకెట్ తన్నేస్తే, నష్టం ఏంటి ?'* అని !"


"మొదలెట్టారా,  మీ వితండవాదం ? వయసులో ఉండగా ఏం తిన్నా హరాయించుకుంటుంది మన శరీరం...తిన్నన్నాళ్ళు తిన్నాం...

ఇప్పటినుంచైనా కాస్త జాగ్రత్తగా వుంటే ఏవైందిట ?"


"ఏడు దశాబ్దాలు దాటేశాం...

నాటౌటు...

ఇప్పటిదాకా ఏం కాలేదు...ఇప్పటికీ గుండ్రాయిలా ఉన్నాం...ఒకవేళ నోరు కట్టుకుని, వందేళ్ళు బతికినా...ఎవరికోసం, ఎందుకోసం ? ఓ కొత్తావకాయ తినక, మాగాయ్ అన్నంలో పెరుగు కలుపుకోక, నాలుగు మావిడిపళ్ళు, పది పనసతొనలు తినక, ఎందుకు బతకడం ? ఒకవేళ అన్నీ మానేసి, నెయ్యి - నూని కూడా ఒదిలేసి, చెరో రెండూ ఎండు పుల్కాలు తిని, బతికేస్తాం అనుకో...సెంచరీ కొట్టేస్తామా ? ఎవరైనా గేరంటీ ఇవ్వగలరా ? హంసలాగ ఆర్నెల్లు బతకమన్నారుగా ?"


 "మీతో వాదించే కన్నా...ఊరుకోడం అంత ఉత్తమం లేదు..."


"కదా...అంచేత, ఆ చల్ల మిరపకాయల డబ్బా, అప్పడాల డబ్బా, ఒడియాల మూట, నాకు కనపడకుండా ఎక్కడ దాచేశావో చెప్పు...నేనే వేయించుకు తింటాను..."


"ఇప్పుడు నన్ను వేయించుకు తింటున్నది చాలదూ...మీతో వేగడం కష్టం...మళ్ళీ మీకెందుకు శ్రమ ? నేనే వేయించి తెస్తాను, భోయినం దగ్గర కూచున్నాక మీరు లేవడం ఎందుకు..."


"ఇప్పుడు నా అర్ధాంగి అనిపించావు, రానీ, అవన్నీ వచ్చేదాకా వేచి ఉంటాను, వచ్చేప్పుడు...కాస్త కొత్తావకాయ్ జాడీకూడా తీసుకురా..."


"మహాప్రభో...మీకో నమస్కారం !"


"దీర్ఘ సుమంగళీ భవ !!!"


                *వారణాసి సుధాకర్.*

              💐💐💐💐💐💐💐

కామెంట్‌లు లేవు: