13, మే 2024, సోమవారం

శంకరుల అవతారం

 ॐ శంకర జయంతి ప్రత్యేకం  

    ( నిన్న 12వతేదీ వైశాఖ శుక్ల పంచమి - శంకర జయంతి ) 

    

                                    భాగం 2/10 


శంకరుల అవతారం 


1.ఆవశ్యకత 


    శతాబ్దాల క్రితంనాటి దేశ పరిస్థితులు గమనిస్తే, అనేక సమస్యలతోపాటు వివిధ దేవతారాధనలమధ్య సమన్వయం లోపించడం వంటి సంకుచిత భావాలు తెలుస్తాయి. 

    ఆ సమయంలో పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరించి దేశపరిస్థితిని సరిదిద్దారు. 

    అయితే, ఆ కాలంలోని పరిస్థితులు ఇప్పుడు లేవు కదా! అని, ఇప్పటి పరిస్థితులకి అనుగుణంగా మరొక విధానం రావాలనే వాదన కొంతమంది చెయ్యొచ్చు. 

    కానీ ఏ అవతార విశేషాలైనా, అవి, అన్ని కాలాలలోనూ ఉపయోగపడేవే! 

    ఉదాహరణకి 

1.శ్రీమద్వాల్మీకి రామాయణ కథ భూమిమీద పర్వతాలూ, నదులూ ఉన్నంతవరకూ నడుస్తుందని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే వాల్మీకిమహర్షితో చెప్పి వ్రాయించాడు. అది కథాభాగంగా ఉన్న వేదవివరణ కనుక. 

2.ద్వాపర యుగాంతంలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు భగవద్గీత ఉపదేశించాడు.అది ఆ కాలంలోని అర్జునునికి మాత్రమేకాక, అందఱూ ఏ కాలంలోనైనా తెలిసికొని, సాధనలో గమ్యాన్ని చేరడానికి. అది వేదాంతమైన ఉపనిషత్సారం కాబట్టి. 

 * అదే విధంగా అద్వైత సిద్ధాన్తాన్నీ, స్మార్త సంప్రదాయాన్నీ, సులువుగా ఆచరించే ఆరాధనా విధానాన్నీ, ఇటువంటివి అనేకం, ధర్మాచార్యులుగా ఆదిశంకరులు అందించారు. 

    అవన్ని వేదప్రామాణికం. 

    వేదం సార్వకాలీనం కదా! 


    త్రేతాయుగంనాటి మానవరూపంలో శ్రీరాముని ధర్మాచరణ, 

    ద్వాపరంనాటి శ్రీకృష్ణుని ప్రకటిత దైవశక్తితో చేసిన బోధ అన్నికాలాలకీ అనుసరణీయం కదా! 

    అట్లే, జగద్గురువులైన ఆదిశంకరుల అవతార లక్ష్యం - బోధనా విధానమూ ఎప్పటికీ అనుసరించదగినదే! విశేషించి కలియుగంలో అత్యంత ఆవశ్యకం. 

                                        కొనసాగింపు ....  


                          =x=x=x= 


    — రామాయణం శర్మగా పిలువబడే 

      బొడ్డపాటి శ్రీరామ సుబ్రహ్మణ్యేశ్వర శర్మ 

         భద్రాచలం

కామెంట్‌లు లేవు: