*రచనలు - సభ్యుల స్పందన*.
మానవ అస్థిత్వములో రచనలు అత్యంత కీలకమని జ్ఞాన గ్రహణకు, అవగాహనకు ఇతివృత్తాలు అవసరమని ఇప్పటికే రూఢి అయిన విషయము యధార్థం.
రచన అనేది విశ్వజనీనము. అవి ప్రపంచములో, ఆ దేశపు స్థానాన్ని, ఆ రచయిత స్థానాన్ని తెలియ జేస్తాయి. ప్రజలు ఎలా ఉండాలో గూడా ఉత్తమ, ఆదర్శ రచనలు నేర్పుతాయి. రచయితల దృక్పథాన్ని రూపకల్పన చేస్తాయి. అందులోని సారాన్ని జనులకు తెలియజేస్తాయి, నైతికాంశాలను ప్రస్తావిస్తాయి.
భారతీయ రచనా సంప్రదాయంలో రచనలు మానసికంగా రచయితలలో జీవిస్తాయి. వాటిని ప్రక్క వాళ్లకు (సమాజానికి) వినిపించటం ఆ రచయిత బాధ్యత.
*కొన్నిటిని మన కొరకు మాత్రమే ఉంచుకోవడము కుదరదు. ముఖ్యంగా ఆహారాన్ని, విద్యను, కళలను, సమాజ హితాన్ని ఇతరులకు గూడా ఇవ్వాలి, పంచాలి*.
రచన అనేది కేవలము వినోదాలకు, ఉల్లాసాలకు, ఉద్రిక్త, భావావేశాలు కల్గించుటకు మాత్రమే కాదు. అది చాలా ముఖ్యమైన సామాజిక బాధ్యత. *రచనలు సమాజ ఉద్ధరణకు తోడ్పడాలి*.
*రచనలలో వేద, పురాణ, ఆధ్యాత్మిక అంశాలపై భాష్యాలు, అర్థ సహిత తాత్పర్యాలు, కథలు, గాథలు, అనువాదములు, కల్పితాలు, చారిత్రకాలు, పరిశోధనా గ్రంథాలు, ఆత్మ కథలు, సృజనాత్మకాలు, గేయాలు, కావ్యాలు వగైరా వగైరా*
*మన వద్ద నున్న ఊహాశక్తిని, జ్ఞానాన్ని అందరికీ పంచక పోతే మనము సామాజిక బాధ్యతను విస్మరించినట్లే*.
కథలు, నాటకాలు, రచనలు చదువరుల అనుభూతులకు సంబంధించినవి, వారిలోని చిత్తాన్ని ప్రక్షాళన గావించి, కల్మశాన్ని తొలగించి ఆ వ్యక్తిని అజ్ఞానము నుండి విముక్తుడిని చేస్తాయి.
మూల్యాంకనము, పునర్మూల్యాంకనము, నిర్ధారణ, పునర్నిర్ధారణనలు, ప్రగతి మార్గంలో పయనించే వ్యక్తులు చేసే పనులు.
*సాహితీ మార్గములో ఈ పనులు చేసేది విమర్శకుడు*. సృజన కారుడికి ఉన్నట్లే విమర్శకునికి గూడా ఒక ధృక్పథం ఉంటుంది. *మెరుగైన సాహిత్య ప్రస్థానము కోసమే విమర్శ*. రచనకు సంబందించిన విషయ పరిచయం, సమీక్ష, విశ్లేషణ, విమర్శ అనే పేరు మీద జరిగే తతంగమే విమర్శ. *రచనలు ఎట్లున్నవో, ఎట్లా ఉండాలో చెబుతుంది విమర్శ*.కవులు, రచయితలకంటే నిశ్చయంగా *విమర్శకుడు* (CRITIC) అధికుడు.
సమాజము - సాహిత్యము రెండు వస్తు - శిల్పాలాగా పరస్పరాధారితాలు.
ఈ మధ్యన చాలా వరకు శిల్పాన్ని వదిలి వస్తువు గురించి మాట్లాడుతున్నారు.
"వస్తువు" కళగా మారటంలో తోడ్పడేది "శిల్పము". "వస్తువు" సాహితీ రూపంగా మారడానికి దోహద పడేది కూడా "శిల్పమే". *వస్తువును గ్రహించడము కొంత సులభమే, కానీ శిల్పాన్ని సాధించడము కష్టము*.అవుతే ఈ మధ్యన *శిల్పముపై* దృష్టి పెట్టే రచయితలు తక్కువగా కనిపిస్తున్నారు.
ఎవరో మెచ్చాలని పూవు పూయదు, పరిమళించదు. పూవు పూయడం, పరిమళించడం దాని స్వభావం. ప్రకృతి తన సహజ పద్ధతులలో ముందుకు సాగుతూ ఉంటుంది. ఆలాగే రచయితలు ఎవరో మెచ్చాలని రచనలకుపక్రమించరు. రచయితల వ్యక్తిత్వం, అవగాహన, మూర్తిమతత్వం, సంస్కృతి, ప్రపంచ జ్ఞాన మిశ్రమాలతో రచనలు వెలువడుతాయి.
రచనలను మెచ్చుకునుట, ప్రోత్సహించుట వలన రచయితలలోని శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను మరింత వెలికితీయడానికి, మరింత సాన బెట్టడానికి దోహదం చేస్తాయి. చదువరుల ప్రశంస మరియు మెప్పుదల రచయితకు శక్తికారకాలు. *ఇంతే కాకుండా రచనలను మెచ్చుకునుట వలన ఆయా విషయాలపై మనకున్న అవగాహన, మన ప్రతిభ, మన సంస్కారము కూడా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి*.
సంప్రదాయ పరిరక్షణ, సమాజ నిర్మాణ, సమాజ జాగృతి, సమాజాభివృద్ధి రచనలను ప్రత్యేకంగా ఆదరిద్దాము, రచయితలను ప్రశంసిద్దాము.
ధన్యవాదములు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి