3, జులై 2024, బుధవారం

కల్కి

 #కల్కి

తన ముద్దుల చెల్లెలు, గారాలపట్టీ అయిన దేవకీదేవిని, బావగారు వసుదేవుణ్ణీ రథాన తీసుకుని వెళుతుండగా అశరీరవాణి కంసుడితో చెబుతుంది...

‘మూర్ఖుడా, నీ చెల్లెలి అష్టమగర్భాన జన్మించబోయే కుమారుడు నీపాలిట యముడవుతాడు. అతని చేతిలో నీ మరణం తథ్యం!’

అక్కడినుంచి కంసుడికి ప్రాణభయం పట్టుకుంటుంది. చెల్లీబావలను చెరసాలలో పడేస్తాడు. వారికి జన్మించిన బిడ్డలందరినీ ఖండిస్తాడు. 

దేవకీవసుదేవులు తమ ఏడవ సంతానాన్ని రోహిణీగర్భానికి బదిలీ చేయిస్తారు. ఎనిమిదోవాడిని నందుని ఇంట్లో పెంపకానికిచ్చేస్తారు. లెక్కప్రకారం ఎనిమిదో గర్భాన్ని చంపాలని చూస్తే అదికాస్తా ఆడపిల్లయి కనబడుతుంది. జరిగిన మోసం అర్ధమైన కంసుడు కేవలం మధురలోనే కాకుండా యావత్ సామ్రాజ్యంలో ఉన్న పసివాళ్ళనందరినీ మట్టుబెట్టమని పూతన, శకటాసురుడు, ధేనుకాసురుడు మొదలైన రాక్షసులందర్నీ పంపిస్తాడు. ఇదంతా మనకు తెలిసిందే.

దాదాపుగా ఇదే మూలాధారం చేసుకుని కలిపురుషుడి పాత్రను సృష్టించారనిపిస్తుంది.

కృత్రిమ గర్భోత్పత్తి ద్వారా వందలకొద్దీ స్త్రీలను గర్భవతుల్ని చెయ్యడం, వారినుంచి సీరమ్ సేకరించి తనలోకి ప్రవేశపెట్టుకోవడం కలిపురుషుడి తపన. అతనికి తెలుసు, కల్కి అవతరించబోతున్నాడని, అతను అత్యంత శక్తిమంతుడని. 

అనుకున్నట్లుగానే ఒకేఒక చుక్క సీరమ్‌తో తన వికృతరూపుని పోగొట్టుకుని, పూర్తి యవ్వనాకారాన్ని సాధించగలగడం చూస్తే అర్ధమవుతుంది రెండోభాగం ఎలావుండబోతుందో.

హిందూపురాణాల్ని ఆధారంగా చేసుకుని కథ రాసుకున్నారు. ద్రోణాచార్యుని పుత్రుడు అశ్వత్థామ, కర్ణుడు, అర్జునుడు మన కళ్ళకు కనబడతారు. కృష్ణుడు మాత్రం వినబడతాడు.

ఇంతకుమించి కథావివరాల్లోకి వెళ్లొద్దు.

అంతా బానేవుంది. కానీ ఈ మరియం, కైరా, రాయా, యాస్కిన్, రాక్సీ, రూమి, ల్యూక్, లిల్లీ, బానీ, సిరియస్, రోనీ, యూరీ, లియాన్.... ఏవిఁటీ పేర్లన్నీ?

చక్కగా లలిత, కమల, మాధురి, వైదేహి, నారాయణ, మోహన్, ప్రకాష్ అంటూ మనవాళ్ళ పేర్లే పెట్టొచ్చుగా? 

అంటే వాళ్లందరూ ఈ పానిండియా ప్రజలని మనం అర్ధం చేసుకోవాలా?

ఎక్కడ చూసినా ఇసక, దుమ్ము, ఇనుము. ఒక్క చుక్క నీటికోసం విలవిలలాడే ప్రజలు. కాంప్లెక్స్‌లో పనిచేసే కార్మికులు మాత్రం ఏ విప్రోనో, టీసీఎస్సో ఎంప్లాయిస్‌లా యూనిఫారాలేసుకుని లిఫ్టెక్కి పోతుంటారు.

అందరికీ అతీంద్రియ శక్తులుంటాయి. గాల్లో ఎగురుతుంటారు. వందలమంది యోధుల్ని మట్టికరిపించేస్తుంటారు. కానీ ‘ఇంటద్దె’ కట్టడానికి డబ్బులుండవు. అదియొక ప్రహసనము.

గర్భవతులందరూ మా ఎస్ఎన్‌సియూ ఇంక్యుబేటర్లలో చంటిపిల్లల్లా పడుకునివుంటారు. అక్కడే అన్నీ. విపరీతంగా రక్షణవలయం ఉంటుంది. 

ఇక సంబాలా అనే ద్వీపంలో జువ్వలు, విష్ణుచక్రాలు, భూచక్రాల్లాంటి ఆయుధాలతో వందలమంది మందలుమందలుగా ఉంటారు. ఒక చెట్టుకి దీపాలెట్టి ఏదో క్రైస్తవ భక్తిగీతం ట్యూనులో పాటపాడతారు. అది ఏ భాషాగీతమో తెలియరాలేదు.

వారందరికీ ఆధిపత్యం వహించేది మరియం అనబడే శోభన. ఆవిడని కమాండర్ మానస్ ఒకసారి అడుగుతాడు ‘మీ రెబల్స్ లక్ష్యం ఏమిట’ని

‘నీ అందం!' అంటుంది శోభన. 

కొంపదీసి ఈ శోభన ఆ మానస్‌గాడి ‘అందం’ చూసి ప్రేమించి మోసపోయిందేమో అదే ఫ్లాష్‌బాకేమో అనుకుని తనకు టూకీగా అప్పటికప్పుడు అల్లేసి ‘ఇదీకథ’  అని చెప్పేశాను కూడా.

తను నా డొక్కలో ఒక్క పోటు పొడిచి నవ్వుతూ అంది. 

శోభన అన్నది ’నీ అంతం!’ అనిట. 

ఏమి ఖర్మమొచ్చి పడినదిరా నా తెలుగుకు? 

ఇక సినిమా మొత్తం తెలుగు భాషను మేకలు చింపిన వాల్‌పోస్టరులా తయారుచేసి పడేశారు. ఒక్కరంటే ఒక్కరికీ భాషపట్లసరైన అవగాహన, గౌరవం లేవు. ఎన్నో తెలుగు చిత్రాలను నందమూరి, అక్కినేని, నటశేఖరవంటి దిగ్గజాలతో నిర్మించిన నిర్మాత అశ్వనీదత్తు గారు ఏదీ వినబడకుండా మర్యాదపూర్వకంగా మార్షల్ హెడ్‌ఫోన్స్ పెట్టుకున్నట్టున్నారు. ఈ గొడవంతా ఆయనకు అనవసరమనేమో?

మనం నిజంగానే అదేదో గ్రహంలో ఉన్నామన్న భావన కలిగించడంలో దర్శకుడు ఈ డైలాగుల ద్వారా నూటికి రెండువందలపాళ్ళూ విజయం సాధించాడు.

మన కారుణ్య, హేమచంద్ర, రేవంత్, అనురాగ్‌లాంటి అచ్చతెలుగు గాయకులుండగా ఆడెవడో ఎదవ ‘మాదవా...!’ అని ఏడుస్తుంటే ఐనాక్సులో సీట్లు కోసెయ్యాలనిపించింది. డిస్గస్టింగ్!

బ్రహ్మానందం ఇక కామెడీకి పనికిరారని నాలుగేళ్లక్రితమే ఒక పోస్టులో వాపోయాను. ఆయననలా ఇబ్బంది పెట్టి, తద్వారా మనందరినీ విసిగించి, ఆఖర్న పాప్‌కార్న్ సైతం డోక్కునేలా చెయ్యగలగడం అవసరమా అధ్యక్షా?

సినిమాలో ఏదైనా బాగుందీ, ఉత్సుకత రేపిందీ అంటే అది కమలహాసన్ సన్నివేశాలు మాత్రమే. భయపెట్టాడు నిజంగానే!

అమితాబ్. ఆ వయసులో ఆయన చింపేశాడు, చంపేశాడూ అంటూ రివ్యూలు రాస్తుంటే ఏమిటో అనుకున్నాను. నూటికి తొంభైతొమ్మిది శాతం ఫైటింగ్ సన్నివేశాలే ఆయనవి. అవన్నీ గ్రాఫిక్సే కదా? ముఖంలో హావభావాలు చూపే సన్నివేశాల్లో ముఖం చుట్టూ గోనెపట్టా కప్పుకుని ఉంటాడు. ఇక ఏముంది చింపడానికి?

దీపికా పడుకొనే ఎప్పుడూ పడుకునే ఉంటుంది. కాసేపటి తరవాత బయటపడి కథను ముందుకు నడిపిస్తుంది. తనకు శోభిత డబ్బింగుట! 

కృష్ణుడికి అర్జున్‌దాస్ డబ్బింగ్ చెప్పాడు. అతగాడి వాయిస్ మహాద్భుతంగా ఉంటుంది. కానీ సాంబార్ వాసనేస్తూ తమిళయాసలో వినబడింది. అదేపని హేమచంద్ర చేసివుంటే చాలా చాలా బావుండేది.

విజయ్ దేవరకొండ కాసేపే కనబడి రిలీఫిచ్చాడు. చూట్టానికి అర్జునుడిలా చాలా బావున్నాడు.  రెండో భాగంలో ఏరకంగా మాటాడబోతున్నాడో ఊహించుకుని ఇప్పట్నించీ దడుపు జొరాలవీ తెచ్చుకోవడం అనవసరం.

పశుపతి, అన్నాబెన్‌ల సన్నివేశాలన్నీ మాడ్‌మాక్స్ సిరీస్‌లో కనబడేవే! మనం కూడా తియ్యగలమని నిరూపించుకోవాలని తాపత్రయపడినట్లున్నాయి అవన్నీ!

దిశా పఠానీయో, పల్లీ బఠానీయో, ఓ సాంగేసుకుని వెళిపోయింది. అంతే! ఏదో ఆ కాసేపూ పువ్వులూ, నీళ్ళూ కనబడ్డాయని ఆనందంతో కేరింతలు కొట్టింది తను.

సంబాలా వారి రహస్య స్థావరం, వారి వివరాలను చెప్పమంటూ వేధించడం, వారికోసమై ఒకరు పుడతారని ఎదురుచూడటం.... ఇదంతా నార్నియా సినిమాను గుర్తుకుతెస్తుంది. 

మొత్తానికి కల్కి చిత్రం మాకు తిక్కరేగేలా చేసింది. భారీతనం అడుగడుగునా కనబడినా అదంతా మనకు అర్ధంకాని రీతిలో ఉంటుంది. మధ్యమధ్యలో ఎవరెవరో వచ్చి ఏదేదో చేస్తూ ఉంటారు. అన్నీ యంత్రాలు. ఒక ముసలమ్మ తమలపాకులు తింటూవుంటుంది. చిలకజోస్యం చెప్పేవాడుంటాడు. 

ఎఆర్, విఆర్, ఎఐ.... అంటూ అన్నిరకాల టెక్నాలజీలనీ వాడేశారు. కానీ కంటతడి తెప్పించలేకపోయారు.

నానాజాతిసమితిలా లబ్ధప్రతిష్టులందరినీ పెట్టుకున్నారు. కానీ మనసారా నవ్వించలేకపోయారు.

ఇక రెండోభాగమంటూ ‘రేపటికోసం’ ఎదురుచూట్టం అనవసరం.  

ఇది కేవలం నా అభిప్రాయం. చీల్చి చెండాడి, తగువులకి రాకండి. నాకంత టైము లేదు. కొట్టడానికి బస్సులేసుకుని కాంప్లెక్సుకి వచ్చెయ్యకండి. అనవసరంగా యూనిట్లు దండగ! 

.......కొచ్చెర్లకోట జగదీశ్

కామెంట్‌లు లేవు: