3, జులై 2024, బుధవారం

నీలకంఠ దర్శనం

 "నీలకంఠ దర్శనం " 


చప్పుడు కాకుండా గేట్ తీసి, వరండా లో పేపర్ చదువుకుంటున్న సీతారామయ్య ఎదురుగా నించుని, చాలా మెల్లిగా " నాన్నా" అన్నాడు గౌతమ్. ఉలిక్కిపడి తలెత్తి చూసారు ఆయన. ఎదురుగా పెద్ద కొడుకు నవ్వుతూ నించున్నాడు. ఆయన మొహం విప్పారింది సంతోషంతో. 

"యశో, ఎవరొచ్చారో చూడు" అంటూ కేకవేసారు 

బయటకువచ్చినయశోదనుభుజాలచుట్టచేతులువేసి"అమ్మా,ఎలావున్నావు?"అడిగాడు. 

యశోద కొడుకు రెండు చెంపల మీద చేతులు ఉంచి, గౌతమ్ తలను వంచి నుదిటి మీదా, తల మీదా ముద్దుపెట్టింది. 

సీతారామయ్య , " ఇద్దరు బిడ్డల తండ్రి నీ పెద్ద కొడుకు" అన్నారు నవ్వుతూ. 

అయితే ఏం, నా కొడుకు నా కెప్పుడూ చిన్నవాడే" అంటూ "మీరుకూడా రండి, ముగ్గురం కాఫీ తాగుదాం " అంది వంటింట్లోకి వెళుతూ. 

"కోడలు,పిల్లలేరి రా" అడిగింది యశోద.

" అబ్బా, అమ్మా, వచ్చిన నన్ను పట్టించుకోకుండావాళ్ళ గురించి భాదపడతావేం? ,వస్తారులే రెండ్రోజులు ఆగి" నవ్వుతూ అన్నాడు గౌతమ్.

కాఫీ తాగాక, "పద నాన్న ఇల్లు చూద్దాము" అంటూ లేచాడు గౌతమ్. .

సీతారామయ్య కో ఆపరేటివ్ బ్యాంకులో క్లర్క్ గా చేసి రిటైర్ అయ్యారు. ఇద్దరు కొడుకులు ఆయనకు. పెద్దవాడు గౌతమ్, రెండోవాడు శరత్. ఇద్దరూ టీచర్లుగా స్థిరపడ్డారు. సీతారామయ్యకు పెన్షన్ తక్కువ, మిగతా పెర్క్స్ ఎక్కువ, తండ్రి ద్వారా తనకు సంక్రమించిన నాలుగెకరాల భూమిని , పెద్ద పెంకుటింటినీ జాగ్రత్తగా కాపాడుకొంటూ వచ్చాడాయన. ఆయన తక్కువ రెంట్ కి ఇంటిని అద్దెకిచ్చి, ఇల్లు పాడవకుండా చూసుకున్నాడు. ఆరువందల గజాల్లో ఉన్న ఇల్లు అది. రిటైర్ అవగానే పల్లెటూరులో ఉన్న తన ఇంటికి మారిపోయాడు. కొడుకులిద్దరూ తమ దగ్గిర ఉండమన్నారు,ఆయన సున్నితంగానే వాళ్ళ కోరికను తిరస్కరించి, సొంత గూటికి చేరుకున్నారు. 

వుద్యోగం చేస్తున్నంత కాలం అద్దె ఇళ్ళల్లో నానా పాట్లు పడిన యశోద, మరోమాట లేకుండా ఆయనను అనుసరించింది. గృహ ప్రవేశానికి వచ్చారు గౌతమ్, శరత్ , మళ్ళీ ఇప్పుడే గౌతమ్ రావటం.

గృహప్రవేశానికివచ్చినప్పుడుసరిగాగమనించలేదకానీ,ఇల్లుపెద్దగానేఅనిపించిందతనికి.ముందు బంగాళా పెంకులతో పెద్ద వరండా, తరువాత పెద్ద హాల్, హాల్ కి అటు, ఇటు రెండు బెడ్ రూమ్స్ చిన్న నడవా తర్వాత వంటిల్లు, దేవుడి గది . రెండు బెడ్ రూమ్స్ కి వాటి ప్రక్కన ఉన్న చిన్న గదుల స్థానంలో అటాచెడ్ బాత్ రూమ్స్ కట్టించారు సీతారామయ్య. 

అప్పటికప్పుడు పూరీ, కూరా చేసింది యశోద. టిఫిన్ తిని తీరిగ్గా ఇల్లు చూడటానికి వెళ్ళాడు గౌతమ్. పెరటి లో బావివుంది.వంగి బావి లోకి తొంగి చూసాడు , నీళ్లు స్వచ్ఛంగా, పై దాకా వున్నాయి.బావి చుట్టూ చప్టాకట్టి వుంది. దాని ప్రక్కనే అరటి చెట్లు, నీళ్లు తోడి,వాడితే వాటికి వెళ్లే నీళ్లతో, పచ్చగా వున్నాయి. 

కూర అరటి, పండు అరటి రెండూ వున్నాయిరా, కూర అరటి గెలని మీరంతా దసరాకి వచ్చినప్పుడు కొద్దామన్నది అమ్మ, పండు అరటి దసరాకి మగ్గ పెడుతుందట మీ అమ్మ"

సీతారాం గారు చెబుతున్నారు. యశోద వాళ్ళ వెనక నుంచుని, "రెండూ మీరంతా వస్తాయని కాసాయిరా " అన్నది నవ్వుతూ. 

తల్లి కళ్ళల్లోకి చూసాడు గౌతమ్, దసరా కి అంతావస్తారన్న ఆశ, సంతోషం ఆ కళ్ళల్లో. , 

పెరట్లో గోడవారగా వరుస పందిళ్లు, కాకర, బీర, సొర, పొట్ల అన్నీ వున్నాయి. వంగ, టమాటా, మిర్చి రెండేసి వరుసలు వేశారు. అన్ని రకాల ఆకు కూరలు చిన్న, చిన్న మళ్ళలో వేశారు. 

వుత్తరం వైపు రెండు మామిడి చెట్లు , సపోటా, నిమ్మ వున్నాయి. మూడో మామిడి చెట్టు కొంచం చిన్నగా ఉందికానీ కాయలతో వున్నది. 

" ఆది పునాస మామిడి రా , నాన్న వచ్చినప్పుడల్లా ఏదో ఒక మొక్క నాటి వచ్చేవారట, ఇప్పుడివన్నీ మనకు చక్కగా అన్ని ఫలాలు ఇస్తున్నాయి" అమ్మ కళ్ళలో అంతులేని తృప్తి. ఇంటి ముందుకెళ్లారు. ఓ మూల పారిజాత మొక్క వున్నది, నిండా మొగ్గలతో. దాని క్రింద చాప పరిచి వుంది .గౌతమ్ చాప కేసి చూస్తుంటే, " అమ్మ పొద్దున్నే పారిజాతాలు అన్నీ ఏరి, మాల కట్టి కృష్ణ విగ్రహానికివేస్తుంది ఓపిగ్గా" అన్నాడు ఆయన నవ్వుతూ.

కనకాంబరాలు, బంతి చామంతి ఓ పద్ధతి ప్రకారం చిన్న, చిన్న మళ్ళలో వేశారు.రంగు, రంగుల గులాబీలు అక్కడక్కడా విరగపూసి వున్నాయి. సన్నజాజి, విరజాజి, మల్లె గోడవారగా పెద్ద పందిళ్లు వేసి వున్నాయి. 

"ఇది ఇల్లా లేక ఏదైనా పుష్ప వాటికా" అనుకొంటూ ఆశ్చర్యం తో చూస్తుండి పోయాడు గౌతమ్. 

హఠాత్తుగా అతనికి అలెగ్జాండర్ పోప్ రాసిన "ode on solitude " గుర్తుకు వచ్చింది.

 అది పోప్ పన్నెండో ఏట రాసిన పోయెమ్. 


" Happy the man whose wish and care 

a few paternal acres bound 

content to breath his native air

in his own ground "   


పుట్టి పెరిగిన వూరిలో పచ్చి గాలి పీలుస్తూ, ప్రకృతి ఒడిలో సేద తీరుతూ, తనకు అవసరమైన ఆహారాన్ని తానే పండించుకుంటూ ఉండేదే అసలైన జీవితమంటాడు కవి. ఇక్కడ solitude అంటే భాదాకరమైన ఒంటరితనం కాదు, పరిపూర్ణమైన జీవన శైలితో కూడిన పచ్చని జీవితమని " తన తల్లీ తండ్రీ సంతృప్తిగా, సంతోషంగా జీవిస్తున్నారని అర్ధమయ్యింది గౌతమ్ కి. 

మధ్యాహ్నం అరటి ఆకులో భోజనం. యశోద తండ్రీ కొడుకుని వంటిట్లోనుంచి కదలనీయలేదు. పెరటిలోని గోంగూర తో పచ్చడి, ముద్దపప్పు, కాచిన నెయ్యి, ఆవకాయ, ఫ్రెష్ మెంతి కూర వేసి వండిన వంకాయ కూర, పొట్లకాయ పెరుగు పచ్చడి, పొగలు కక్కుతున్న పొలంలో పండిన బియ్యపు అన్నం, గడ్డ పెరుగు , ఎన్నో రోజుల తర్వాత కమ్మటి భోజనం తిన్నానన్న తృప్తితో లేచి చేయి కడుక్కున్నాడు గౌతమ్. 

సాయంత్రం వీధి గుమ్మానికి అటూ, ఇటూ వేసిన అరుగుల మీదపెద్దవాళ్ళు కూర్చుని చీకటిపడిందాకా మాట్లాడుకుంటున్నారు. అమ్మ ఫ్రెండ్స్ అమ్మకి వున్నారు. తండ్రి అన్ని పనుల్లో తల్లికి సాయం చేస్తున్నాడు, ఆయన ఎప్పుడూ అంతే.

ఆ రాత్రి బాగానే నిద్ర పట్టింది గౌతమ్ కి. కానీ తెల్లవారుఝామున ఒక కల. ఆ కలలో  

తల్లీ, తండ్రీ తనెంత ఆగమన్నా ఆగకుండా వెళ్లిపోతున్నారు. ఇద్దరూ వయసు మీదపడి వంగిపోయి నడుస్తున్నారు. వాళ్ళిద్దరి రూపంలో ఎంతో మార్పు, చాలా దయనీయంగావున్నారు. నాన్న, వంగిపోయిన అమ్మ చుట్టూ చేయి వేసి , :మాకు మేము ఒకరికొకరం ఆసరా" అన్నట్టుగా నడుస్తున్నారు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు గౌతమ్.

చాలాసేపు ఆలోచిస్తూ వుండిపోయాడు.. తర్వాత లేచి, లైట్ వేసి తమ్ముడు శరత్ కి మెసేజ్ పెట్టాడు.

"శరత్ నువ్వు, నేను మన భార్యల ఆలోచన సబబే అనుకుంటూ నాన్నని పొలం, ఇల్లు అమ్మి మనదగ్గిర ఉంచుకోవాలని, అలా వచ్చిన డబ్బుతో పెద్ద అపార్ట్మెంట్స్ కొని వాళ్ళని మనతో పాటు ఉంచుకొని చూసుకోవాలని అనుకొన్నాము. కానీ ఇక్కడికొచ్చాక అది ఎంత తప్పుడు ఆలోచనో నాకు ర్ధమయ్యింది. 

నాన్న , మనిద్దరినీ ప్రేమతో పెంచి, చదువు చెప్పించాడు. మన కోసం వాళ్లిద్దరూ ఎంత పొదుపుగా జీవించారో నీకూ తెలుసు. నాన్న తన తండ్రి ఇచ్చిన ఆస్తిని ఎంతో గౌరవం తో ప్రేమతో నిలబెట్టుకున్నాడు. ఈ ఇంటిలో కానీ, పొలం లో కానీ మనకు ఏ హక్కు లేదురా. వాళ్లకు మన అవసరం కలిగినప్పుడు మనం వాళ్ళని బాగా చూసుకొందాము. వాళ్ళ రూట్స్ ని మనం పెకిలించే ప్రయత్నం చేయటం చాలా దుర్మార్గమనిపించింది నాకు. ఈ అందమైన ప్రకృతి వడిలో వాళ్ళు ఈజీగా ఇంకో ఇరవై ఏళ్ళు బ్రతుకుతారు. రేపు వెళ్లి వదినా, పిల్లలని తీసుకొస్తాను.సెలవలు రాగానే నేను వచ్చేసాను, నువ్వు నీ ఫ్యామిలి తో వెంటనే బయల్దేరి రాగలవు" అంటూ ముగించాడు.

 అనుకున్నట్టుగానే శరత్ కూడా వచ్చేసాడు. గౌతమ్ మణి నీ, శరత్ సౌమ్య నీ తాము అనుకొన్న ఏ విషయాన్నీ పెద్దవాళ్ళతో చెప్పవద్దని హెచ్చరించారు. యశోద, సీతారామయ్య సంతోషానికి అవధులు లేవు. పిల్లలు ఎంతో కుతూహలంగా తిరుగుతున్నారు తోటంతా. వాళ్ళ అంతులేని ప్రశ్నలకు ఓపిగ్గా జవాబులిస్తున్నాడు తాత. అంతలో ఆయన దృష్టి మామిడి చెట్టుమీద పడింది. మామిడి కొమ్మల్లో పాలపిట్ట. ఆయన పిల్లలని అరవవద్దని చెప్పి, పెద్ద మనవడిని అందర్నీ రమ్మనమని చెప్పారు.

పాలపిట్టను చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఈ రోజుల్లో అది ఎక్కడా కనపడటమే లేదు. యశోద సంతోషం తో అన్నది" ఎంత అదృష్టం, ఇంకా దసరా వారం ఉండగానే మనకు ఈ నీలకంఠ పక్షి దర్శనమయ్యింది.శంకరా" అంటూ చేతులెత్తి నమస్కరించింది. అప్రయత్నగా అంతా నమస్కరించారు. ".

పిల్లలకు పాల పిట్టకు రామాయణ, మహాభారతాలలో ఎంత ప్రాశస్త్యం ఉందొ , అదే మన రాష్ట్ర పక్షి "అని వివరిస్తున్నాడు సీతారామయ్య. 

గౌతమ్ అనుకున్నాడు" అవును, నిజంగా అదృష్టమే, విజయానికీ, శాంతికి , శుభసూచకం ఈ పక్షి కనబడటం, అమ్మా,నాన్న గురించి తమకున్న ఆందోళనీ ఆలోచనల లోని అశాంతిని తొలగి పోయేలా దర్శనమిచ్చింది i " అనుకొంటూ ఆ పక్షి కేసి చూస్తూ నమస్కరించాడు. 


*భవానీ కుమారి బెల్లంకొండ*

కామెంట్‌లు లేవు: