25, అక్టోబర్ 2024, శుక్రవారం

*2 - భజగోవిందం మోహముద్గర*

 *2 - భజగోవిందం మోహముద్గర*

     

      *ఉపోద్ఘాతం*


దారిలో ఒక వృద్ధ పండితుడు వ్యాకరణ సూత్రాలు వల్లె వేస్తూ వుండడం విన్నారు. వృద్ధాప్యము వచ్చినా యింకా, లౌకిక జ్ఞానానికై కాలాన్ని వృధా పరుస్తూ, ఆత్మ సాధనకి ప్రయత్నించని అతనిని చూచి శ్రీ శంకరులు హృదయం లోంచి ఈ మోహముద్గర శ్లోకాలు వెలువడినాయి అని అంటారు. దీనినే భజగోవిందం అని పిలుస్తారు. వ్యాకరణ సూత్రాలు ఎవరినికూడ మృత్యుసమయంలో రక్షించవు. జీవించి యుండగానే పవిత్రము, పరిపూర్ణము అయి దేశకాలా తీతమైన అమృతత్వాన్ని పొందడానికి త్వరపడు”.


మొదటి శ్లోకం పల్లవి. ప్రతి చరణం చివర తిరిగి దానిని పాడాలి. దాని తర్వాత వచ్చే పన్నెండు శ్లోకాలు శ్రీశంకరులు స్వయంగా చెప్పినవని ప్రథ. ఇవి ద్వాదశ మంజరికా స్తోత్రమనే పేరుతో ఉన్నవి. ఈ శ్లోకాలు చెప్పిన వెంటనే, ఆయన వెంటనున్న శిష్యులు గురుదేవుల ఫణితి నందుకుని, వెల్లువలా హృదయాల్లోంచి భావాలు పొంగిరాగా, ఒక్కొక్కడు ఒక్కొక్కటిగా శ్లోకాలు చెప్పారు. ఈ పధ్నాలుగు శ్లోకాలు చతుర్దశ మంజరికాస్తోత్రమని అన బడతాయి. శిష్యులు చెప్పిన శ్లోకాలు విన్న తరువాత శ్రీ శంకరులు తిరిగి నాలుగు శ్లోకాలు చెప్పి; తద్వారా సర్వకాలం ముముకు జనావళిని అనుగ్రహించి, ఆశీర్వదించారు. 


ఈ ముప్పయ్యొక్క శ్లోకాలు కలిసి "మోహముద్గరమనే పేరుతో ప్రసిద్ధి పొందాయి. చాలా కాలం నుండి ఇవి పాడబడుతున్నవవడం చేత అనేకసార్లు అచ్చు అయినవి. పాఠాంతరాలు వచ్చాయి. ఈ వ్యాఖ్యానంలో అక్కడక్కడ పాఠాంతరాలు కూడ సూచింప బడినాయి.


ఈ మోహముద్గరము యొక్క కొన్ని ప్రచురణలలో అన్ని శ్లోకములు లేవు. కొన్నింట్లో ఈ వరుసగాక ముందువి వెనక, వెనకవి ముందు వున్నవి. కొన్ని టియందు శ్లోకం లోని ఒకపాదం, యింకో శ్లోకంలోని రెండో పాదంతో కలిసి వున్నది. కొన్నిచోట్ల పాదాలు తికమక అయినవి, కొన్ని చోట్ల మాటలే మారాయి. ఏది ఏమైనా ఎక్కడా ఈ శ్లోకాలయొక్క ముఖ్యార్థం మాత్రం మారలేదు


మొదటి పన్నెండు శ్లోకాలని "ద్వాదశమంజరికా స్తోత్ర'' అని అంటారు. వికసించిన పండ్రెండు పూవులున్న గుత్తి దూరంనుండే అందంగా కన్నుల పండువుగా వుంటుంది. అలాగే యీ పండ్రెండు శ్లోకాలు వింటుంటూనే పులకల తోడి ఆనందం కలుగుతుంది. నిరంతరం పనిచేసే తేనెటీగలు పూలచుట్టూ తిరిగి వాటిలోనికి ప్రవేశిస్తే, వాటికిమంచి తేనె అందు తుంది. ఆలాగే సాధకులు లయ బద్దమైన శ్లోకాల అర్థంలోకి ప్రవేశించితే వేదాంతామృతాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు. భజగోవిందం నుండి ఊరడించే వేదాంతం, సంతృప్తినిచ్చే జీవన విధానం లభిస్తాయి.


ఇది స్తోత్రమని, స్తుతుల తరగతిలో చేర్చబడినప్పటికినీ, దీనిలోని పల్లవి మాత్రమే స్తోత్రం. మిగిలిన ముప్పై శ్లోకాలు శాస్త్రీ యమైనవి. మనిషిలోని విలువయిన సత్యపదార్థాన్ని కప్పివేసే తెలివి మాలినతనాన్ని - అజ్ఞానాన్ని- మూఢత్వాన్ని విశ్లేశించి, నిపులంగా విశదపరుస్తాయి. ప్రపంచంలో వ్యక్తి ఏర్పరచుకొన్ని అక్రమ సంబంధాన్ని, దాని కాధారమైన మూర్ఖతని వ్రేళ్ళతో పెకిలించి పారేస్తాయి. ఈ శ్లోకాలని వేదాంత శాస్త్రంలో ప్రక్రియ గ్రంధం అనవచ్చును.


ఆత్మబోధ, వివేక చూడామణి పంచదశివంటి వేదాంత గ్రంధములకు భిన్నంగా, తన పరిధిమేరలో భజగోవిందము” భగవత్సాక్షాత్కార నిమిత్తమై సంపా దించుకోవలసిన విలువలని, దానికి విఘ్నాలుగా ఉండే మానవ బలహీనతలని చక్కగా విపులీకరిస్తుంది. సాధకునికి జీవిత గమ్యాన్ని, సాధనోపాయాలు బోధించడమే కాక ఇప్పటి జీవితంలోని బాధాకరమైన న్యూనతని, నేటి జీవితంలోని భయంకరమైన విలువలని, వాటిని ఇలాగే కొనసాగిస్తే పర్యవసానంగా లభించే దుష్ఫలితాలని భజగోవిందం స్పష్టంగా వివరిస్తుంది. అహం కారము, కోరికలతో కూడుకున్నది యిప్పటి జీవితం.


ఈ స్తోత్రము తనతో సమానులైన వేదాంత వేత్తలకు గాని తర్క పండితులకు గాని చెప్పినట్టిది కాదు. అందుచేత ఇందులో తర్కాలు లేవు. దుష్టమతాలని, దురభిప్రాయాలని ఖండించడంలో ఆయన శక్తిని వ్యర్థపరచలేదు. సిద్ధాంతాలు కూడా చేర్చబడలేదు.


అద్వైత వ్యతిరేకుల తర్కాలు లేనంత మాత్రాన భజగోవిందం సున్నితమైన భావాలతో హృదయాన్ని కదిలిస్తూ తాత్కాలిక దివ్యానుభూతులనిచ్చే మధుర సంగీతం అనుకోరాదు. ఈ శ్లోకాలు కొరడా ఝళిపింపులవలె ఉంటాయి. తప్పుదారిన నడిచే సాధకుని నెమ్మదిగా మంచిదారికి నడిపించే సున్నితత్వం లేదు. మానవుడి వీపు మీద వాతలు పడే కొరడా దెబ్బలు తగిలిస్తాయి.


యీ బోధ ఉపదేశగ్రంథంగాని వాదసంయుతమైనదిగారు. భజగోవిందములో హృదయాంతరాళములోని రహస్యాన్ని ప్రేమతో, శిష్యులకు బోధించే గురువునే దర్శిస్తాము. శిష్యుడెవరంటే (1) శిక్షింపబడేవాడు శిష్యుడు ( శిక్షతే ఇతి శిష్య:) అనిగాని లేదా (2) బాహ్యప్రపంచ దృష్టిని వదలి అంతర్దృష్టిని పొందడం చేత ఇంతకు పూర్వమున్న స్థితికంటే ఉత్తమతరమైన స్థితిని పొందినవాడు శిష్యుడు (శిష్యాత్ విశిష్యతే శాస్త్రాది పరిజ్ఞానేన బహిర్ముఖం అనపేక్ష్య ఇతి శిష్యః) అనిగాని లేదా (3) జ్ఞానేంద్రియ ఔద్ధత్యాన్ని నియమించి వశపరచుకునేవాడు శిష్యుడని (ఇంద్రియాది ప్రవృత్తిం శిష్యతి ఇతి శిష్య:)


కనుక, నిజమైన శిష్యుడెవరంటే గురువులచేత బోధింపబడుచున్న వాడును, ఆ బోధవలన బాహ్య ప్రపంచదృష్టిని మార్చి అంతర్దృష్టి నలవరచుకొనిన వాడును, ఉద్రేక ములను, బాహ్యదృష్టి కలిగించే ఆలోచనలను నియమించిన వాడును అని విశదపరిచిరి. అటువంటి శిష్యులకే " భజగోవిందం” చెప్పబడినది.


ఈ శ్లోకములు ప్రతివాది భయంకరాలై లేవన్నంత మాత్రాన అవియేమో చాలా మృధువై; సుతిమెత్తనై పసివాళ్ళు, ఆలోచన చేయలేనివాళ్ళు, యేదో ఫణితిలో కూనిరాగాలు తీయడానికి మాత్రమే పనికివచ్చేవనే దురభిప్రాయం పడరాదు. అవి పాడి నంత మాత్రముననే మొదట దివ్యభావం కలిగి, తరువాత యే ఫలితమూ యివ్వనట్టి బోధకాదిది. అలాంటి మెతకతనం ఈ శ్లోకాల్లో లేదు. ఈ ముప్పది శ్లోకాలు కూడ ఒక్కొక్క కొరడాదెబ్బను కొట్టి నప్పటి ఫలితాన్ని తప్పు చేస్తే మనసు మీద పడవేస్తవి. కొరడాతో కొట్టడమేమి? మనిషి వీపుమీద చళ్ళున తట్టడమేమి? అన్ని ఝళిపింపు లూ చేస్తవి. ఇదంతా అవుసరం కొద్ది చేయవలసి వచ్చినపని. కొంప అంటు కున్నప్పుడు అందులో వున్న వాళ్ళనెలా మేల్కొల్పడం? వెంటనే మేల్కొనకపేతే యికవాళ్ళు దక్కరు కదా? మనిషిని కుదిపి తట్టిలేపాలి- పూజ్యపాదులైన తల్లిదండ్రులు, ప్రేమ పాత్రులైన భార్యాబిడ్డలు - ఆ సమయంలో మర్యాదలు పాటించుతారా? ఇందులో తీయని విసుర్లున్నాయి. దయాపూర్ణతతో కూడిన తీవ్రమయిన ఆక్షేపణలున్నాయి. నీవు తెముల్చుకొని ఎప్పుడో ఏదో చేద్దామంటే వినే సహనం కనబర చే స్థితికాదు. శిష్యుల సంక్షేమం కోసం, వాళ్ళను ప్రేమతోనే కసిరి అసహించుకొనడం జరగాల్సి వచ్చింది. ఇంకా యీ సంసారంలో – దుఃఖాల్లోపడి నిద్రించడం- మృత్యువనే అగ్నితో ఒక ప్రక్క కొంప అంటుకుంటుంటే సహించేదెలా?


*సశేషం*

❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

కామెంట్‌లు లేవు: