25, అక్టోబర్ 2024, శుక్రవారం

కాళిదాసు సమయస్ఫూర్తి

 కాళిదాసు సమయస్ఫూర్తి - భోజారాజు ఔదార్యమ్


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

... బ్రహ్మశ్రీ చొప్పకట్ల సత్యనారాయణగారు ...

@@@@@@@@@@@@@@@@@@@ 


భోజుడు కేవలం పండితులనే కాక నిరక్షరకుక్షులను కూడా బీదవారైతే ఆదరించేవాడు. సహాయం చేసే వాడు.


ఆ విషయము చాలా మందికీ తెలియదు. 

అది తెలియని ఒక బీదబ్రాహ్మణుడు ఒకదినము కాళిదాసు దగ్గరకు వచ్చాడు.

తాను నిరుపేదనని రాజుగారికి చెప్పి తనకేదయినా దయచేయించుడని ప్రాధేయ పడ్డాడు.


కాళిదాసు:- నీవేమైనా చదువుకున్నావా?


బ్రాహ్మణుడు:- ఏదో వానాకాలం చదువు చదువుకున్నాను. మీరే ఆధారము.


కాళిదాసు:- నేనొక శ్లోకమును వ్రాసి ఇస్తాను.దానిని రాజు దగ్గర చదువుతావా?


బ్రాహ్మణుడు:- చదువలేను కాళ్ళు వణుకుతాయి. దడ పుడుతుంది.


కాళిదాసు:- సరే రేపు రాజుగారికి ఏదయినా కానుక తీసుకొని ఆస్థానమునకు రమ్మని చెప్పి పంపెను.


సరే అని ఆ బ్రాహ్మణుడు యింటికి బోయి తన దగ్గరనున్న రెండు పైసలతో రెండు చెరుకుగడలను కొని తన తువ్వాలులో చుట్టి ఆస్థానమునకు వచ్చాడు. ఇంకనూ ఆస్థానము తెరచు సమయము కానందున 

అక్కడ దగ్గరలోనున్న చెట్టు క్రింద ఆ చెరుకు గడలమూట పక్కన పెట్టుకొని పడుకున్నాడు. చల్లగాలికి బాగా నిద్ర పట్టేసింది. ఇంతలో ఒక దొంగ వచ్చి ఆ చెరుకుగడలను తీసుకొని ఆ తువ్వాలులో అక్కడే చెట్టు క్రింద ఉన్న రెండు కాలిన కర్రముక్కలను పెట్టి వెళ్లిపోయాడు.


ఆ బ్రాహ్మణుడికి మెలుకవ వచ్చి సమయమై పోయిందని హడావుడి గా ఆ మూటను తీసుకొని ఆస్థానానికి వెళ్ళాడు. అక్కడ రాజుగారిని చూడగానే భయపడి పోయాడు. 

ఆ తువ్వాలును రాజుగారికి సమర్పించాడు. అందులోని కాలిన కట్టెలను చూసి రాజుగారు ఏమిటిది?అని గద్దించారు.

వాడు వణికి పోయాడు.

చెరుకుముక్కలకు బదులు ఆ కొరువులు ఎలా వచ్చాయో అర్థం కాక అలాగే నోరు తెరుచుకొని చూస్తూండి పోయాడు.


అప్పుడు కాళిదాసు ఏమి జరిగి వుంటుందో ఊహించి "రాజా..ఈ కొరకంచులను ఈ విప్రుడు ఎందుకు తెచ్చాడో నేను చెప్తాను అని ఈ క్రింది శ్లోకం చెప్పాడు.


    దగ్ధం ఖాండవమర్జునేన చ వృధా దివ్యద్రుమైర్భూషితం

    దగ్ధా వాయుసుతేన హేమరచితా లంకాపురీ స్వర్గభూఃl

    దగ్ధ స్సర్వ ఖాస్సదశ్చ మదనో హా హా వృధా శంభునా 

    దారిద్ర్యం ఘనతాపదం భువి నృణాం కేనాపివా దహ్యతేll


తా:--పూర్వము అర్జునినిచే వ్యర్థముగా ఖాందవవనము దహింపబడి అచ్చటి దివ్య వృక్షములన్నియు నాశన మయ్యెను. స్వర్గనగర తుల్యమైన లంకానగరమును హనుమతుడు వృథాగా తగులబెట్టేను. ఈశ్వరునిచే ఏ పాపమెరుగని మన్మథుడు దహించ బడినాడు.

కానీ ఈ దరిద్రమును తగులబెట్టుటకు ఎవ్వరూ పుట్టలేదు. నీవైనా దారిద్ర్యానికి నెలవైన ఈ కర్రలను దహించి వెయ్యి.

(అంటే నీవు నాకు ధనమును యిచ్చి నా దారిద్ర్యాన్ని పోగొట్టుము).


భోజరాజు ఆ బ్రాహ్మణుడికి లక్షసువర్ణవరహాలను యిచ్చి పంపించెను. పిమ్మట కొంత కాలమునకు ఈ చమత్కారము కాళిదాసే చేసినాడని ఎరిగి అతని సమయస్ఫూర్తికి చాలా సంతసించెను.


ఈ శ్లోకమునే ఎవరో అజ్ఞాత కవి తెలుగులో యిలా వ్రాశాడు.


              నరుడను వాడు ఖాండవ వనంబు వృధా దహనంబు జేసే, వా 

             నర వరుడైన పవన నందనుడూరక లంక గాల్చె నా 

             హరుండు పురంబు లార్చేనన నంతియే కాని మహాదారిద్ర్య వి 

            స్ఫురణను గాల్చు వాడొకడు భూమి జనింపక బోయె భూవరా !


అర్థము:--- అర్జునుడు ఖాండవ వనాన్ని వృధాగా కాల్చి వేశాడు,హనుమంతుడు పనీ పాటా లేనట్టు వృధాగా సుందర నగరమైన లంకను కాల్చాడు,శివుడు విద్యున్మాలి,తారకాక్షుడు, కమలాక్షుడు అనే రాక్షసుల పట్టణాలను కాల్చాడు. ఈ మూడు దహన కాండలకు ఏవో కారణాలు వుండ వచ్చు. కానీ రోజు రోజుకు అధికమవుతున్నఈ దారిద్ర్యాన్ని దహించే వాడు భూమిలో యింత వరకు పుట్టలేదు కదా! 

అని ఒక బీదకవి ఆవేదన.


                                      .... సేకరణ

కామెంట్‌లు లేవు: