25, అక్టోబర్ 2024, శుక్రవారం

*3 - భజగోవిందం

 *3 - భజగోవిందం / మోహముద్గర*

💙💙💙💙💙💙💙💙💙💙💙💙


*భజగోవిందం శ్లోకం:-1*


*భజగోవిందం భజగోవిందం గోవిందం భజమూఢమతే।*

*సంప్రాప్తే సన్నిహితే కాలేనహి నహి రక్షతి డుకృఞ౯ కరణే॥ భజ ॥ 1.*


*ప్రతిపదార్థం:-* 


గోవిందమ్ = గోవిందుని; భజ = సేవించు; గోవిందమ్ = గోవిందుని; భజ= సేవించు; .మూఢమతే= అజ్ఞానముచేత ఆవృతమైన తెలివి కలవాడా; సన్నిహితే కాలే= నిర్ణీతమైనకాలము( మరణమునకు నిశ్చితమైన సమయము); సంప్రాప్తే= ప్రాప్తించినప్పుడు; డుకృఞ్ కరణే = వ్యాకరణ శాస్త్రాధ్యాయనము; నహి నహి రక్షతి = రక్షించనే రక్షించదు; గోవిందమ్ = గోవిందుని; భజ = సేవించు; గోవిందం = గోవిందుని; భజ = సేవించుము.


*భావం:-*


సేవించు గోవిందుడిని, సేవించు గోవిందుడిని, గోవిందుడినే సేవించ వోయి మూఢమతీ! మృత్యువు ఆసన్నమయినప్పుడు నీ యీ "డుకృఞ్ కరణే'' అనే వ్యాకరణ పాఠం ముందుకు వచ్చి నిన్ను రక్షించుటయనునది జరగనే జరగని పని సుమా!.


*వివరణ:-*


‘‘భజగోవిందము’’లో ప్రప్రథమానవున్న యీ శ్లోకం పాటలోని పల్లవిగా పరిగణింపబడుతోంది. ఆ తరువాత వచ్చే ప్రతి శ్లోకాంతంలో కూడా మరల మరల యీ శ్లోకం పల్లవిగా చెప్పబడటం మామూలు సామూహిక ప్రసంగాల్లోను సత్సంగా ల్లోనూ భజగోవిందము, చేయబడటం సర్వ సాధారణ మైనట్టిది. అలాటి సమయాల్లో పాటనుపక్రమించిన గురువు ఒక్కొక్క శ్లోకమే ఫణితి తప్పక చెపుతూ వుంటే మిగతా అందరూ అందుకొని ఈ శ్లోకాన్ని మాత్రం పల్లవిగా"భజగోవిందం భజగోవిందం గోవిందం మూఢమతే" అంటూ చర్విత చర్వణం చేస్తూ వుంటారు.


ఈ శ్లోకంలో గురువు శిష్యులకు ఇలా ప్రవచిస్తున్నారు.


"వత్సా! నీ హృదయాన్ని గోవింద పరమైన ఆలోచనలతో పూరింప జెయ్యి. తదితర సంబంధమైన యోగ్యతలను ఫలాలను సాధించాలని, పొందాలని నీ యధీనముతో వాటిని పట్టి వుంచుకోవాలని నానా యాతనలతో సతమతమగుట కన్నా తత్పరమైన ఆలోచనలతో హృదయాన్ని సేవించటం యెంతో శుభమైనట్టిది" అని.


ఇందులో చెప్పిన "వ్యాకరణ సూత్రము"భౌతిక సంబంధమైన జ్ఞానమంతటినీ, వాంఛలన్నిటినీ భౌతిక వస్తుజాలాన్నంతటినీ కూడా స్ఫురింప జేయటానికి ఉద్దేశింప బడినది ఆ భౌతిక వస్తుజాల మంతా కూడా "డుకృఞ్ కరణే' అనే వ్యాకరణ సూత్రంలాగానే నిష్ప్రయోజనమైనదని ధ్వనింప చేశారిక్కడ.'


మనిషి ప్రపంచంలో కొద్దికాలం మాత్రం వుంటాడు. అతడి జీవన పరిధి చాలా చిన్నది. మృత్యువు ఎప్పుడో హఠాత్తుగా యీ పరిధిలో నుంచి అతనిని లాగి కబళించి వేస్తుంది. అలాంటప్పుడు యీ వ్యక్తికి పెద్దవ్యాకరణ గ్రంథాలు నోటికి వచ్చినవై నా,ఎన్నో సైన్సుకు సంబంధించిన విజ్ఞాన విశేషాలు తెలిసివున్నవయినా- పాపం - అవేవీ మృత్యు ముఖాన్నుండి అతనిని తప్పించలేవు. ఇదీ ఇక్కడి సూచన.


ఈ సూచన ఛాందోగ్యోపనిషత్తులో చెప్పిన ఒకానొక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తోంది.అక్కడనారదుడు సనత్కుమార మహర్షి దగ్గరకు చేరి ప్రార్థిస్తాడు. తనకు జ్ఞానోదయం కలుగజేయవలసిందని ప్రార్థించును. అందుకు ఋషి నారదునితో సరే అలాగే కాని నీకు ఇంతవరకు తెలిసినదేమిటో వివరించు, నీకు తెలియని దేదయితే మిగిలివుంటుందో దానిని చెపుతాను, అంటాడు. వెంటనే నారదుడు తనకు తెలిసిన విషయాలు ఒక బ్రహ్మాండమైన జాబితా ఆయనముందు ఏకరువు పెట్టుతాడు. అబ్బో- అందులోని విషయాలు అంతులేనన్ని, అన్నీ మహత్తరమైన శాస్త్రజ్ఞాన విష యాలే. జ్యోతిషం, ఖగోళశాస్త్రం, వాఙ్మయం, శిల్పం, గాంధర్వం, నృత్యం --- యింకా వివిధమైన ఎన్నెన్నో చాలా చెపుతాడు. వీటిలోని విషయాలన్నిటినీ నేను ఆమూలాగ్రం తెలిసికొన్నా నంటాడు. అప్పుడు ఋషి " అవన్నీ ఆయాశాస్త్రాలకు సంబంధించిన వట్టి పేర్లు మాత్రమే. "భూమ"మైన ఆ "అనంతాన్ని' తెలియనేర్వాలి. అది వీటన్నిటినీ అధిగమించి వుంటుంది, అంటాడు. 


 (మహర్షి పాణిని వ్రాసిన "ధాతు పాఠముల'నే వ్యాకరణగ్రంథములో వున్నది. సిద్ధాంతకౌముదిలో.)


ఈ సందర్భంలో నారదుడు తన యోగ్య తలుగా యిచ్చిన జాబితాలో వ్యాకరణం శాస్త్రం కూడా ఒకటి ప్రత్యేకంగా చెప్ప బడింది. ఆ సంగతియీ సందర్భంలో జ్ఞాపకం చేసుకొంటే సరళమైన అనుభూతి కలుగు తుంది.


అయితే- మరి వ్యాకరణం తెలియనక్కర్లేదా? అని శంక రావచ్చు. తెలియవలసిందే. కాని అది ఒకానొక ఆశయాన్ని పొందటానికి యేర్పడ్డ మార్గం మాత్రమేనని గమనించటం ముఖ్యం. శాస్త్రం ఏమి చెపుతున్నదో నిర్దిష్టంగా తెలిసికోవటానికి వ్యాకరణం కావలసినదే. గురువు చెప్పిన వాక్యాలు పూర్తిగా తెలిసి హృదయగతం చేసుకోటాని కి దాని ప్రయోజమెంతో వుంది. కాని ఆజన్మాంతమూ యీ మార్గాన్ని మాత్రమే పరి శీలిస్తూ అపముఖమైన శీర్ణవిషయాలు వెతుక్కుంటుపోయి ఏది మనిషిని అసంపూర్ణత నుండి ఉద్దరిస్తుందో ఆ ఉత్కృష్టమైన జ్ఞానాన్ని తెలిసికొనుట మనేది చేపట్టకుండా కాలాన్ని వ్యర్థం చేయడాన్ని ఆచార్య శ్రీ శంకర భగవత్పాదులు ఆ ఖండించారు.


వ్యక్తమైవున్న యీ ప్రపంచంలో నీ ఉనికిని తుడిచివేయటానికి మృత్యువు నీ దగ్గరకు వచ్చిన క్షణాన నీ యీ విజ్ఞాన శాస్త్రాలు నీకు ఏం ప్రయోజనమీయగలవు? నీవు కరతలామలకం చేసికొన్న శిల్పం నీకేమంత సుఖసంతోషాల నిస్తుందప్పుడు? నీ యీ వ్యాకరణ సూత్రాల విజ్ఞానం ఎంతవరకు సహాయం చేయగలుగుతుంది? ఇక్కడ జీవించి యున్నంతవరకూ మనిషియొక్క పరమోత్తమైన ఆశయం ఏమిటనుకొంటున్నావు? తన జీవిత పరమావధిని తెలిసి, దాన్ని హృదయగతము చేసి కొనటం సృష్టి వెనుకనున్న వాస్తవాన్ని సత్యాన్ని తెలియటం ఆ సత్యంతో తానేకమై ఆ ఐక్యతతో సంపూర్ణత్వాన్ని పొందటమున్నూ. అయితే అలాంటి వానికి మృత్యువు రాదా? అనవచ్చు. వస్తుంది. అతడూ మృత్యువువాత పడుగాక, అయితే అందరివలె నికృష్టమైన సర్వనాశన మనే దాన్ని ఆక్షణాన పొందటం మాత్రం కాదు. స్ప్రింగు పలకల మీదనించొని ఆకాశం లోనికి రాకెట్టు లాగినట్లు మృత్యువు నాసరా చేసికొని శాంతి మయమైన దివ్యమయిన అనంత సత్యంలోనికి నిర్గమిస్తాడు.


కొందరుంటారు వాళ్ళకు అశేషమైన పుస్తక పరిజ్ఞానం వుంటుంది. మాట్లా డుతూ మాట్లాడుతూ భగవద్గీతను ఉదహరిస్తూ కూడా వాళ్ళుంటారు. "మోక్షా నికి గాను పెద్దగ చింతపడనక్కరలేదు. దానికి ఒకే ఒక సులువైన మార్గముంది. అదేమిటంటే చనిపోయేసమయాన మాత్రం భగవంతుని జ్ఞాపకానికి తెచ్చుకుంటేచాలు.


అంతే దానితో సర్వతోముఖమైన కార్యసిద్ధిని పొందుతాము''. అని అందుకు ఆధారంగా *"అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కళేబరమ్ యః ప్రయాతి సమచ్చానం”* అనే భగవద్వాక్యాన్ని గీతనుంచి ఉదాహరిస్తారు. వాళ్ళు ఒక సంగతి గమనించక పోవటం శోచనీయం. నిశితమైన ధర్మసూత్రం ఎన్నడు మనలను దయతలచి మెత్తబడి పోవడం జరగదని వారెఱుగరు. ధర్మ సూత్రాలే భగవంతుడు.


అంతేకాదు గీత చెప్పిందేమని? "అంతకాలే చ" అని ఈ "చ" అనే శబ్దం లోని నైశిత్యం విడమరచి తెలిసికోడం ముఖ్యం. శంకరులు వారి వ్యాఖ్యానంలో యీ శబ్దానికి అర్థం ఇలా చెప్పారు. "జీవిత మంతానూ పైగా శరీరం త్యజించే సమయంలో కూడానూ భగవంతుని అను సంధానం చెయ్యాలి'' అని.


‘భజగోవిందమ్’’ అన్నప్పుడు “భజ” అంటే భజించుట. అర్పించుట, సేవించుట అని అర్థము. కాని, గానుగెద్దు గాడిలో పడి తిరిగినట్టు ఒకానొక ఆచారమనే త్రోవలో పడిచేతులతో పూలు విసురుతూ నోటికి అలవాటయిన మంత్రాలు పలికేస్తూ మనసెక్కడో పెట్టుకొని అర్పిస్తున్నామంటే సరిపోదు. భజించడమంటే అలాంటి ఊహకే తావులేదు. పరమేశ్వరుడితో మనమెలా అనుబంధింపబడి ఐక్యమైవున్నామో ఆ ఊహను అను సంధానం చెయ్యటం కావలసింది. అలా ఆయన్ను సేవించుటయే నిజమైన భజనం. నిజమైన సేవ.


ప్రజల ఉన్నతి కొరకు ఏర్పాటు చేయబడ్డ దేవాలయాల్లో గాని, కుటుంబ శ్రేయస్సు కోసమై ప్రత్యేకించబడిన యిండ్లలోని పూజా మందిరాల్లోగాని సర్వమత సంప్రదాయాల్లోనూ-ఈ పూజా విధానాలు, భగవత్సేవనములు ప్రత్యేకమయిన ఒక పద్ధతిలో క్రమబద్ధం చేయబడినవి. దీనివల్ల దేశంలో సర్వమతైక్యము సర్వ మత సామరస్యము సుస్థిర మగును. ఆ పద్దతిలో ఆరాధించడం మత సంబంధమైన ఆచారం చేయడం మాత్రమే అవుతుంది. అదే దాని ప్రయోజనం. అలాకాక ఆ కర్మను నెఱవేర్చేటప్పుడు మనం ఆత్మసమర్పణం చేసుకొన్న ట్లయితే, ప్రేమ ప్రపత్తులతో భగవంతుని సేవించినట్ల యితే అదే అసలైన, సిసలైన, నిజమైన భజనం.


ఈ ఆత్మ సమర్పణం ఏవరికి? భగవంతుడికి, అతడెక్కడు న్నాడని, భక్తుడు ఆ భగవంతుని సాన్నిహిత్యం యే పవిత్ర ప్రదేశంలో వున్నట్లు తన ఊహలో సాక్షాత్కారించుకొంటాడో ఆ ప్రదేశంలోనే వున్న ఆ భగవంతుని పాదాల దగ్గర ఆత్మ సమర్పణం చేసికొంటాడు. అలాటి ప్రదేశాలే యీ దేవళాలు.


ఆత్మసమర్పణ అంటే భగవంతుని పాద సాన్నిధ్యంలో భక్తుడు కరిగి పోయిభక్తుడు నశించి భక్తి మాత్రం మిగిలిందన్నట్లు ద్రవీభూతుడు కావడమే, ఇలాంటి స్థితికి దోవలు తొమ్మిది. ఆయా అన్వేషణా మార్గాలనుబట్టి యీ వైవిధ్యాలు చెప్పబడినవి. అవేవంటే- 1)శ్రవణం; భగవదైశ్వర్యములను వినటం, 2) కీర్తనం; వాటిని గానం చెయ్యటం, 3) స్మరణం; నిరంతరం భగవంతుని స్వభావ సౌందర్యాన్ని మననం చేయటం,4) పాదసేవనం; ఆయన పాదాల్ని మనఃపుష్పాలతో అలంకరించటం; 5) అర్చనం; మంత్రములతోనూ దేవుని పవిత్రములైన వేదఋక్కులతోనూ అందుకు సేవించటం. 6) వందనం; అనుషంగికమైన తంత్రముతోనూ దేవుని నమస్కరించుతూ వుండటం. 7) దాస్యం; దాసునివలె సేవించటం. 8)సఖ్యం; భగవంతుని స్నేహితునిగా ఉపాసించి అంతటి ప్రేమతో ప్రవర్తించటం. 9) ఆత్మ నివేదన; అంతరింద్రియాలు భౌతిక దేహంతో సహా భగవంతునికి పూజా పుష్పంగా ఉపాసింపబడిన మూర్తి ఎదుట వినమ్రుడై సంపూర్ణముగా తన్ను తాను సమర్పించుకొనడం వీటన్నింటి లోనూ కూడ నేను అనే ది వున్నది. అన్ని చోట్ల కూడ మనసు యొక్క ఆ ఉపాసనా స్థితిని ఉపయోగించ వలసి వున్నది. పూజ అనే దాని ఆంతర్యమైన ఉద్దేశ్యం యీ స్థితిలో వుండి సేవ చేయుటయే ఈశ్వరుని గూర్చి యీ స్థితిలో సేవ చేసినట్లయితే అది ఈశ్వర భజన అవుతుంది. అంతేకాదు అలాగే చేసిన జనసేవ కూడా జనార్దన సేవే అవుతుంది.


‘‘గోవింద’’ అనేది విష్ణుమూర్తికి పేరు. విష్ణు సహస్రనామాల్లో రెండుచోట్ల వస్తుంది ఆ నామం. శంకరులు తమ వ్యాఖ్యానంలో యీ శబ్దాన్ని శభోత్పతి శాస్త్ర రీత్యా తరిచి వివిధ మార్గాల్లో అర్థం చెప్పారు. పరమ సత్యాన్ని అనంతమైన బ్రహ్మ పదార్థాన్ని సూచిస్తూ క్రింది నాలుగువిధాలుగా చెప్పారు. 1)భూమినియెవడయితే కనుగొన్నాడో లేదా తెలిసికొన్నాడో అతడు అని- అంటే ఈ చరాచర ప్రపంచ కార్యకలాపం దేనిమీదయితే నడుస్తూవుందో దాని అంతరాంతరాల్లో కూడా తెలిసిన వాడని అర్థం. భూమి పుట్టుకముందు నుంచి వున్నవాడు కనుక దాని పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన వాడనవచ్చును.


2) పశుసంపదకు ఎవరు స్వామియై వున్నాడో అతడు గోకులంలోని గోపాలకుడైన గొల్లపిల్లవాడనే కాదు. పశుసంబంధమైన జీవ సంబంధమైన మనోవాంఛలన్నిటికీ ఆధారంగా వెనుక నున్న శక్తి అని అర్థం. 3) ఎవడైతే వాక్శక్తికి ఆధార భూతుడో అతడు. జీవికి తన భావాన్ని మాటలద్వారా లేదా అరుపుల ద్వారా ఇతరులకు తెలియచేయడానికి యే శక్తి వుందో అది అని అర్థం. ఓండ్రపెట్టే గాడిద కావచ్చు. అరిచే కుక్క కావచ్చు అనర్గళంగా వుపన్యసించే మేధా సంపన్నుడు కావచ్చు. అలా తమ భావాల్ని వ్యక్తీకరించడానికి ఆధారం ఆ శక్తే. 4) ఎవడు వేద ఋక్కుల ద్వారా తెలిసి కొనబడుచున్నాడో అతడు. ఆ మహావాక్యాలు ఏ పరమార్థాన్ని సూచిస్తున్నాయో ఆ పరమార్ధమే ఆ మహాసత్యమే అతడు. 


సంగ్రహంగా చెప్పాలంటే గోవిందుడన్నప్పుడు- మన చుట్టూ వున్న యీ స్థావర జంగమాలన్ని యిలా క్షణక్షణాన మారిపోతూ వున్న స్థితిలో వాటి వెనుక నిత్యమై నిరంతరం నిలిచివుండే సంబంధం. శాశ్వతత్వం సారమేదయితే వుందో ఆయాత్మే అతడని చెప్పాలి. గోవిందుడే ఉపనిష ద్రహ్మము. అతడే పరమోత్కృష్ట సత్యము ప్రభువులకు ప్రభువు. అందువల్ల భజగోవిందమ్ అన్నపుడు అర్థం యేమిటంటే "గోవిందుడితో మన ఐక్యత యేదో” అది తలచి దాన్ని సేవించమని అర్థం. గడచిపోయే అనుభవముల గూర్చిగాని ఆ సమయాలను గూర్చిగాని తాత్కాలిక కీర్తి ప్రతిష్ఠల గూర్చి గాని ప్రాపంచిక వస్తు సంగ్రహాన్ని గూర్చిగాని, కాలం వ్యర్థం చేస్తారు. ఇహపరానికి భిన్నమైన జ్ఞానం కోసం ప్రాకు లాడటం వట్టి నిష్ప్రయోజన మైనట్టిది. అలాంటి వానిని అన్వేషణంలో, వ్యాకరణ సూత్రాల వెంబడి వేటాడుతూ మీ సమయాన్ని వ్యర్థం చేయవద్దు సుమా అని యర్థం.

*సశేషం*

🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴🌴

కామెంట్‌లు లేవు: