🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹
'రైతు బంధు' అనే వ్యవసాయ పత్రిక వారి కథల పోటీలో ప్రోత్సాహక బహుమతిని పొందిన కథ.
*‘ఆలనగా... పాలనగా...’*
రచన: నండూరి సుందరీ నాగమణి
“చాలా బాగున్నాయండీ మీ మొక్కలు, మీ తోట... ఎంతో శ్రమపడి పెంచారు...” మనస్ఫూర్తిగా మెచ్చుకున్నాడు శ్రీహరి.
“థాంక్స్ బాబూ... నాకూ, మా ఆవిడకూ తోట అంటే ప్రాణం... తప్పనిసరియై ఇల్లు అద్దెకు ఇస్తున్నాము కానీ మా ప్రాణాలన్నీ ఈ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉంటాయి...” దిగులుగా అన్నాడు జగన్నాథం.
“మాలీ ప్రతీ రోజూ వస్తాడు... తోట సంరక్షణ అంతా అతనే చూసుకుంటాడు... కానీ మీరు కూడా ఓ కంట కనిపెట్టి చూసుకోండి బాబూ... అమ్మాయికి కూడా చెప్పండి...” దిగులుగా అంది మాణిక్యాంబ.
“అయ్యో పిన్ని గారూ, మీరింతగా చెప్పవలసిన అవసరం లేదండీ, మా ప్రాణంలాగే చూసుకుంటాము... మీరు నిశ్చింతగా వెళ్ళి రండి...” చెప్పాడు శ్రీహరి.
ఆ రెండంతస్తుల భవనం చుట్టూ పెద్ద ఖాళీ స్థలం, అందులో రకరకాల పూల మొక్కలు, ఫల వృక్షాలు పెంచుతున్నారు జగన్నాథం దంపతులు. ప్రతీరోజూ ఉదయమే తోటలో తిరగటం, ప్రతీ చెట్టునూ, పువ్వునూ పలకరించటం ఆ దంపతులకు అలవాటు.
పూజకు అవసరమైన పువ్వుల దగ్గరనుంచి, దేవుడికి కొట్టే కొబ్బరికాయ దాకా అన్నీ ఆ తోటే వారికి ఇస్తుంది... అలాగే, పులుసులో వేసుకునే కొత్తిమీర నుంచి వీధిలోని పిల్లలకు పంచే జామ పళ్ళవరకూ కూడా ఆ తోటే ప్రసాదిస్తుంది...
ఉదయం ఆరు గంటలకల్లా మాలి వచ్చి తోటలోని మొక్కలకు నీరు పెట్టి, కలుపు తీసి, ఎండిపోయి రాలిన ఆకులు, కొమ్మలు ఏరి, శుభ్రంగా ఉంచుతాడు. ప్రతీరోజూ నవవధువులా కళకళలాడుతూనే ఉంటుంది జగన్నాథం గారి ఇంటి తోట...
జగన్నాథానికి ఆయన కూతురు ఒక్కతే సంతానం. చదువు పూర్తికాగానే, పెళ్లి చేసుకుని భర్తతో అమెరికా వెళ్లిపోయింది. అంత దూరం అమ్మాయిని పంపటానికి ఇష్టం లేకున్నా, మారే కాలంతో పాటుగా మనమూ మారాలన్నట్టు, గుండె రాయి చేసుకుని అమ్మాయిని పంపించి తాము మాత్రం ఇండియా లోనే ఉండిపోయారు జగన్నాథం, మాణిక్యాంబ.
అయితే ఇప్పుడు తప్పనిసరిగా వారు అమెరికాకి వెళ్లవలసిన సమయం వచ్చింది. అమ్మాయికి తొలిచూలు... ‘సహాయానికి ఎవరూ లేరని, తప్పక మీరిద్దరూ రావాలని’ అల్లుడు గారి పిలుపు... మాణిక్యాంబను పంపిస్తానని, తాను మాత్రం ఇల్లు వదిలి రాలేనని చెప్పాడు జగన్నాథం.
కానీ ఆయన కూతురు నవ్య అతన్ని అంతా సులువుగా వదిలిపెట్టలేదు... ఇద్దరూ రావలసిందేనని మంకు పట్టుబట్టటమే కాకుండా టికెట్ కూడా కొని పంపించారు. ఇక తప్పనిసరి పరిస్థితులలో ‘ఊ’ అనాల్సి వచ్చింది జగన్నాథానికి.
తాము ఉంటున్న క్రింది వాటాకి ‘టులెట్’ బోర్డ్ తగిలించారు. ఇల్లు చూసుకోవటానికి వచ్చిన ప్రతీవారికీ, తమ తోట కూడా చూపించి, దాని సంరక్షణ భారం అంతా తాము తిరిగి వచ్చేవరకూ చూసుకోవాలని చెబుతూ వస్తున్నారు. చాలా మందికి ఈ తోట వ్యవహారం నచ్చలేదు. అవును మరి అందరూ బిజీ వ్యక్తులే...
ఈ రోజు శ్రీహరి ఇల్లు చూసుకోవటానికి వచ్చి, ఇల్లు చాలా నచ్చటంతో రెండు మాసాల అద్దె కూడా అడ్వాన్స్ గా చెల్లించాడు. తన భార్య సుధకు కూడా ఇల్లు నచ్చి తీరుతుందని నమ్మకంగా చెప్పి, ఆదివారం వచ్చి పాలు పొంగించుకుంటామని చెప్పాడు.
తమకున్న కొద్ది సామానూ, మేడమీద కొత్తగా వేసిన గదులలోకి మార్పించుకున్నారు జగన్నాథం దంపతులు.
***
“సుధా... మనకోసం మంచి ఇల్లు చూశాను... ఈ ఆదివారం వెళ్ళి పాలు పొంగించుకుందాం...” అంటూ వివరాలన్నీ చెప్పాడు శ్రీహరి.
“అయ్యో, ఆ కాలనీయా, సిటీకి చాలా దూరం కదండీ... పైగా పిల్లలకు స్కూల్ కి చాలా దూరం అవుతుంది కూడాను...” అయిష్టంగా నసిగింది సుధ.
“అద్దె చాలా తక్కువ సుధా... పిల్లలకు స్కూల్ బస్ అక్కడివరకూ వస్తుంది... సమస్య ఏమీ లేదు... ఆ తోట ఉంది చూశావూ, నాకెంత నచ్చిందో చెప్పలేను... ఇంటివాళ్ళు స్టేట్స్ కి వెళుతున్నారు. ఆరు నెలలవరకూ రారు... పైన పోర్షన్ లో వాళ్ళు ఉంటారు... క్రింద అంతా మనదే... స్వచ్ఛమైన గాలి... రంగురంగుల పూలు... రకరకాల పళ్ళు... పిల్లలకు ఆడుకోవటానికి కావలసినంత స్థలం... చూసావంటే నువ్వే ఎంతో ఇష్టపడిపోతావు... నిజం...” చెప్పాడు శ్రీహరి.
“ఏమో... ఒక ఇరుగూ పొరుగూ లేకుండా ఎలా? ఇక్కడ ఈ ఫ్లాట్స్ లో మనకి అలవాటు అయిపోయింది. ఇప్పుడలాంటి అడవిలోకి వెళ్ళాలి అంటే... దిగులు... ఇప్పుడైనా మనింటివాళ్లు ఖాళీ చేయమన్నారు కాబట్టి మారవలసి వస్తోంది... సరే... తప్పదు కదా... ఆదివారం వెళ్ళి ఇల్లు చూద్దాము... నాకు నచ్చితేనే మరి పాలు పొంగించేది... సరేనా?” అన్నది సుధ.
“సరే...” అని నవ్వాడు శ్రీహరి, తాను అడ్వాన్స్ చెల్లించిన విషయం ఆమెకు చెప్పలేదు. తప్పకుండా ఇల్లు ఆమెకు నచ్చి తీరుతుంది అనుకున్నాడు నమ్మకంగా...
***
ఆదివారం పిల్లలను, భార్యను తీసుకుని, ఆ ఇంటికి వచ్చాడు శ్రీహరి.
గేటు తీసి లోపలికి అడుగు పెడుతూనే పులకరించిపోయింది సుధ.
గేట్ కి ఇరువైపులా సైనికుల్లా నిలబడి ఉన్నాయి పున్నాగ చెట్లు... వాటి నుంచి రాలిన తెల్లని పూలు గేట్ నుంచి ఇంటి వరకూ వేసిన కాలి బాట మీద తెల్లని తివాచీ పరిచాయి. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ... ఎనిమిది కొబ్బరి చెట్లు... ఇంటికి ఇరువైపులా ముందు భాగంలో అన్నీ పూల చెట్లు... మల్లె గుబుర్లు, పది రంగుల్లో మందారాలు... మరో ప్రక్కన రంగు రంగుల గులాబీలు, మూడు వన్నెల్లో డిసెంబర్ పూలు, రెండు వర్ణాల్లో కనకాంబరాలు... ఇంకా మేడ మీదకు పాకించిన సన్నజాజి, విరజాజి, మాలతి తీగలు... అన్నీ నిండుగా పూచి ఉన్నాయి.
గేట్ మీద ఆర్చ్ పై పాకించిన రాధా మనోహరాలు తేలికపాటి సౌరభాలను అందిస్తూ మైమరపిస్తున్నాయి. గేట్ కి కుడివైపున ఉన్న స్థలంలో ఒక గున్నమామిడి చెట్టు, చెట్టు చుట్టూ తిన్నెతో నిండా పూతతో ఎంతో ముద్దుగా ఉంది. మామిడి చెట్టుకు కొంత దూరంలో రెండు సపోటా చెట్లు, రెండు జామ చెట్లు ఉన్నాయి.
ఇంటి వెనకాల కూరగాయల మొక్కలు, ఆకు కూరలు, కొత్తిమీర మడి, కరివేపాకు చెట్టు, తులసి కోట, తులసి చెట్లు, బొప్పాయి, అరటి చెట్లు ఉన్నాయి. అక్కడే పందిళ్ళు వేసిన చిక్కుడు, బీర, సొర పాదులు ఉన్నాయి. అన్నీ పూత, పిందె మీద ఉన్నాయేమో ఆ దృశ్యం కన్నుల పండువగా ఉంది.
పెరట్లోనే ఒక ప్రక్కన పెద్ద గోరింట చెట్టు కూడా ఉంది...సుధ మనసులో వెంటనే ఆషాఢ మాసం మెదిలింది. రుబ్బిన గోరింటాకు చేతులకు పెట్టుకుని, ఆ వాసన ఆఘ్రాణిస్తూ ఉంటే ఎంత బావుంటుంది?
పిల్లల సంబరం అంబరాన్ని దాటింది. రశ్మి, రాకేష్ ఇద్దరూ తోటలో పరుగులు తీస్తూ ఆడుకోసాగారు.
ప్రశాంతమైన ఆ ఇంటి వాతావరణానికి, మాణిక్యాంబ గారి ఆదరపూర్వకమైన మాటలకు సుధ మనసు ఎంతగానో పొంగిపోయింది.
ఆ సాయంత్రమే కొద్దిపాటి సామానుతో వచ్చి పాలు పొంగించేసుకున్నారు శ్రీహరి, సుధ తమ పిల్లలతో సహా... ఆ పై ఆదివారమే మొత్తం సామానంతా తెచ్చేసుకున్నారు వారు.
***
జగన్నాథం దంపతులు స్టేట్స్ కి వెళ్ళిపోయారు. శ్రీహరి, సుధ, పిల్లలు కొత్త ఇంటికి త్వరగానే అలవాటు పడిపోయారు.
ఉదయమే పూజకు బోలెడు పూలు... సాయంత్రం ఇంటికి రాగానే సహజంగా పండిన పళ్ల ముక్కల ఫలహారాలు... వంటల్లోకి ఇంట్లోనే పండిన కూరగాయలు, ఆకుకూరలు... సాయంత్రం తులసి మాత దగ్గర దీపం పెట్టుకోవటం... ఇవన్నీ సుధకు ఎంతగానో నచ్చాయి.
తోటమాలి మల్లయ్య అక్కడికి దగ్గరలోనే ఉంటాడు. ఉదయమే తోటకు వచ్చి నీరు పెట్టి, ఎండిన ఆకులు, పూవులు తీసి, తాను తయారు చేసే కంపోస్ట్ బిన్ లో వేస్తాడు. సుధకు కూడా చెప్పాడు, కూరగాయల చెత్త కానీ, ఇంట్లో మిగిలిపోయిన అన్నం, కూరలు కానీ బయట పారవేయవద్దనీ, తనకు ఇస్తే ఎరువుగా తయారు చేస్తాననీ...
ఇంటి వెనుక భాగంలో ఏర్పాటు చేసిన బిన్స్ చూపి అందులో పొరలు పొరలుగా ఎలా వేయాలో, అది ఇరవై ఒక్క రోజుల నుంచి ముప్పై రోజుల్లో ఎలా సేంద్రియ ఎరువుగా తయారవుతుందో, అది వేయటం వలన మొక్కలు ఎంత బాగా పెరుగుతాయో వివరంగా చూపించాడు.
సుధ కూడా ఇంట్లోని తడిచెత్తను బిన్లలో వేయటం మొదలుపెట్టింది.
పిల్లలకు స్కూల్లో చెప్పే సైన్సు పాఠాలు అన్నీ ఇంట్లో మొక్కలను చూపించి సోదాహరణంగా చెప్పేవాడు శ్రీహరి.
కంటికి ఇంపైన పచ్చని ఆకుల వర్ణం, ఇంట్లోనే పండిన తీయని పండ్లు, చక్కని పూవులు, వాటి ఉపయోగాలు, పైగా మొక్కలు పగటి పూట కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకొని, ఆక్సిజన్ ను విడుదల చేసి, పర్యావరణానికి మేలు చేయటం, ఆకులు, పువ్వులు వాటి నిర్మాణాలు, కిరణజన్య సంయోగ క్రియ, పరపరాగ సంపర్కం ఇవన్నీ పిల్లలకు ఎంతో విశదంగా, ప్రయోగాత్మకంగా వివరించేవాడు శ్రీహరి.
సుధకు కూడా బజారుకు వెళ్ళి మరీ కాయగూరలు తెచ్చే శ్రమ తగ్గిపోయింది. పెరటిలోని ఆకుకూరలు, కూరగాయలు వంటకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అటు ఖర్చు కూడా బాగా తగ్గింది.
ఆదివారం వస్తే చాలు తోటలోని జామచెట్టు కింద కూచుని భోజనాలు చేసి, పిల్లలు ఊయలలు ఎక్కి ఊగేవారు... వాళ్ళ స్నేహితులు కూడా వచ్చి ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు.
***
మ
నాలుగు రోజులుగా మల్లయ్య రావటం లేదు. తోట అంతా భీకరంగా తయారైంది. రాలిన పూవులు, ఆకులు పోగు పడుతున్నాయి. చెట్లకు నీరు పెట్టేవారు లేకపోయారు.
సుధ తోటకు నీరు పెట్టాలని ప్రయత్నించింది కానీ, ఆమెకు ఇంటి పనులు కూడా ఉండటం వలన శ్రమ ఎక్కువ అయింది. అది చూసిన శ్రీహరి తాను ఒక రెండు రోజుల పాటు ఉదయమే లేచి నీరు పెట్టి, చెత్త ఎత్తి బిన్లలో వేసాడు.
ఇదంతా చూసిన సుధకు కొద్దిగా విరక్తి వచ్చింది. ఎందుకింత చాకిరీ చేయాలి తాము? ఇంట్లో అద్దెకి వచ్చారు కానీ ఈ ఇల్లు కానీ, ఈ తోట కానీ తమ స్వంతం కాదు. దీనికోసం ఇంత శ్రమ పడటం వృధా ప్రయాసగా తోచిందామెకు.
వేరే ఇల్లు చూసుకుని వెళ్లిపోదామని భర్తతో అన్నది సుధ. ఒక చిన్నపిల్లను చూసినట్టు ఆమె వైపు చూసి నవ్వాడు శ్రీహరి. అన్నీ సరి అవుతాయన్నట్టు చూసాడు.
ఆ సాయంత్రం మల్లయ్య ఇల్లు వెదుక్కుంటూ వెళ్ళాడు శ్రీహరి.
చిన్న తాటాకుల ఇల్లు. బయట మట్టితో అలికిన అరుగులు ఉన్నాయి. అరుగుమీద పక్కపై పడుకుని ఉన్నాడు మల్లయ్య. అతని భార్య కాబోలు అతన్ని లేపి కషాయం ఏదో తాగిస్తోంది.
శ్రీహరిని చూడగానే మల్లయ్య అరుగు దిగబోయాడు.
“అయ్యో, తాతా పడుకో... ఏమైంది? ఒళ్ళు బాగాలేదా?” చనువుగా అతని నుదుటిపై చేయి వేసి చూశాడు శ్రీహరి.
“నాల్రోజుల మట్టీ జరమయ్యా. మూసిన కన్ను తెరవటం లేదు. ఆస్పత్రికి తీసుకుపోయాను. మందులు వేస్తున్నాను... ఇంకా తగ్గలేదు...” దిగులుగా చెప్పింది మల్లయ్య భార్య.
“అయ్యో... అవునా!” అంటూ మల్లయ్య చేయి పట్టుకుని “తగ్గిపోతుందిలే తాతా... బాధ పడకు...” అన్నాడు శ్రీహరి.
“తోట ఎలా ఉందో... నేను వెళ్ళాలి – అంటూ ఒకటే కలవరింతలు బాబూ... మాకు పిల్లలు లేరు... ఆ మొక్కలు, చెట్లే ఈయన పిల్లలు... మొక్కలకి తడి పెట్టని రోజున ఈయనకి నిద్ర రాదు... నన్ను వెళ్ళి పెట్టమని ఒకటే పోరు. ఈయన్ని వదిలి రాలేక నేను రాలేదు...” చెప్పింది మల్లయ్య భార్య.
“ఫరవాలేదు తాతా... నీకు బాగా తగ్గినాకే రా. మేము చూసుకుంటాములే తోటను...” అనునయంగా చెప్పాడు శ్రీహరి.
“అయ్యో, ఎరువులు వేసేది మీకు తెల్వదు బాబూ...”
“అవును... నువ్వు చెప్పు నేను నేర్చుకుంటాను... నువ్వు వచ్చేదాకా మన తోటకు నేనే మాలీని...”
మల్లయ్య, ప్రతీ మొక్కకూ బిన్స్ లో ఉన్న ఎరువును ఎలా వేయాలో వివరంగా చెప్పాడు. అలాగే మొక్కలకు తవ్వవలసిన పాదులు, నీరు ఏ మేరకు ఎలా పెట్టాలో అన్నీ విపులంగా చెప్పాడు.
“చాలా చక్కగా చెప్పావ్ తాతా... అలాగే చేస్తాను. కానీ... కూరగాయల మొక్కలు, కొన్ని పూల మొక్కలు కొద్దిగా వాడినట్టు ఉన్నాయి. ఏదో చీడ పట్టినట్టు తోస్తోంది మరి…” అన్నాడు దిగులుగా...
దానికి ఇంట్లోనే చేసుకునే సేంద్రియ పురుగు మందును ఎలా తయారు చేసుకోవాలో, మొక్కల మీద ఎలా పిచికారీ చేయాలో చెప్పాడు మల్లయ్య.
మర్నాడు వంట్లో పరిస్థితి కాస్త మెరుగైతే తానే వచ్చి చేస్తానని చెప్పాడు. కానీ పూర్తిగా తగ్గే వరకూ రావద్దని గట్టిగా చెప్పి, మల్లయ్య భార్య చేతిలో వెయ్యి రూపాయలు ఉంచాడు శ్రీహరి ఖర్చులకు ఉంచమంటూ....
***
మర్నాడు ఉదయమే ఆఫీసుకు వెళ్లకుండా పాత టీ షర్టు, పైజామా వేసుకొని, ఆ క్రిమి సంహారక మందును తయారు చేసుకుని, స్ప్రేయర్ లో నింపి మొక్క మొక్కకూ పిచికారీ కొడుతూ ఉంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉండిపోయింది సుధ.
ఆ తరువాత తానూ నడుం బిగించి భర్తకు సహాయం చేయటానికి ముందుకు వచ్చింది. ఆ సాయంత్రం మొట్టమొదటి సారి తమ తోట మీద, ఆ మొక్కల మీద ప్రేమ కలిగింది సుధకు.
ఆ తరువాత మల్లయ్యకు ఆరోగ్యం సమకూరి పనిలోకి వచ్చినా, అది తమ పని కాదన్నట్టుగా కాక, భార్యాభర్తలు ఇద్దరూ అతనికి ఎంతో సహాయం చేస్తూ ఉండేవారు.
***
ఆరోజు శ్రీహరి, సుధల వివాహ వార్షికోత్సవం. ఆ సాయంత్రం శ్రీహరి తన దగ్గర స్నేహితులనందరినీ కుటుంబాలతో సహా తమ ఇంటికి భోజనాలకు పిలిచాడు. తోటలోని చెట్లను విద్యుద్దీపాలతో అలంకరింపజేశాడు.
ఇంట్లో పండిన కూరలతోనే వండిన రుచికరమైన ఆహార పదార్థాలతో విందు జరిపాడు. తోటను చూసిన అతని కొలీగ్స్, స్నేహితులు ఎంతో సంతోషాన్ని పొందారు. తోటమీద శ్రద్ధ తీసుకుంటున్న శ్రీహరినీ, సుధనూ ఎంతో అభినందించారు.
అప్పుడు శ్రీహరి చెప్పాడు...
“ఈ ఘనత నాది కాదు... ఇదిగో... ఈ మల్లయ్య తాతది. అతని భార్య గంగమ్మదీ… మీరు నమ్ముతారా? ఈ మల్లయ్య తోటలో పనిచేయటం ఒక శ్రమ అని అనుకోడు... అది అతనికొక ఆట... సంతోషకరమైన చర్య... ప్రతీ చెట్టుతో ఊసులాడుతాడు... ప్రతీ మొక్కనూ ప్రేమగా స్పృశిస్తాడు. మొక్కలను పెంచటం బిడ్డను పెంచటంతో సమానమని ఆయన భావన...
అవును... మొక్కలను ప్రేమించాలి... అప్పుడే అవి కళకళలాడుతూ నవ్వుతాయి... పూలనవ్వులనూ, పండ్ల సిరులనూ ప్రేమగా అందిస్తాయి...
ఈ యజ్ఞం ఒక పరమావధిగా చేస్తున్న మల్లయ్య తాత ఎంతో అభినందనీయుడు... అతనికి సహకరించే గంగమ్మవ్వ కూడా...
ఈయన జీతం కోసం పనిచేయడు... తన ఆనందం కోసం పనిచేస్తాడు... ప్రేమించటం ఎలాగో నేర్పించిన ఈ తాతకు ఈరోజు... చంద్రునికో నూలుపోగులా చిరుకానుక...” అంటూ మల్లయ్యకూ, గంగమ్మకూ కొత్తబట్టలు చేతిలో పెట్టి, వారికి నమస్కరించారు శ్రీహరి, సుధ.
మల్లయ్యకు ఎలా స్పందించాలో తెలియక కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు... తమను ఇంత ఆదరంతో చూస్తున్న శ్రీహరి అంటే అవ్యాజమైన వాత్సల్యం కలిగింది మల్లయ్యకు, అతని భార్య గంగమ్మకు...
“విందు తరువాత డెజర్ట్ ఇదిగో ఈ పళ్ళు... ఎంత తీయగా ఉన్నాయో చూడండి” అని చిన్న చిన్న బౌల్స్ లో వేసిన తీయని సపోటా, జామ, మామిడి పళ్ళ ముక్కలు అందరికీ అందించాడు శ్రీహరి.
అవి తిన్న వారందరూ ఆ రుచికీ, తాజాదనానికి ఎంతగానో ఆనందించారు. తాను స్వయంగా ఆకు దూసిన మల్లె గుబురులలోంచి విరగబూసిన ఘుమ ఘుమలాడే మల్లెపూల మాలలు అక్కడికి వచ్చిన స్నేహితురాళ్ళకు అందించింది సుధ.
అందరి మనసులూ ఆనంద పరిమళమయమే అయ్యాయి. అందరూ తమ తమ ఇళ్ళల్లో, కుండీల్లోనైనా కానీ తప్పక మొక్కలు పెంచాలన్న గట్టి నిర్ణయం తీసుకుని, దాన్ని వెల్లడించారు కూడా...
ఎవరి పుట్టినరోజులకైనా, ఫంక్షన్లకైనా వెళ్లినప్పుడు పూలగుత్తుల బదులుగా మొక్కలు బహుమతులుగా ఇవ్వాలని, ఎవరింట్లో పుట్టినరోజైనా వాళ్ళు ఆరోజు ఒక మొక్క నాటి తీరాలని కూడా తీర్మానం చేసేసుకున్నారు.
అమెరికా నుంచి ఒక పాపకు తాత, అమ్మమ్మలై తిరిగి వచ్చిన జగన్నాథం దంపతులు ఇంటికి రాగానే సరికొత్త శోభను సంతరించుకున్నట్టున్న తమ తోటను చూసి మురిసిపోయారు.
తాము వేసిన మొక్కలే కాక, ఇంకా చాలా రకాలు నాటబడి ఉండటం, అవన్నీ కూడా కంటికి ఇంపైన రంగుల్లో పూసి ఎంతో ఆహ్లాదాన్ని కలిగించటం వాళ్ళను ఆశ్చర్యానందాలలో ముంచి వేసింది.
ఎప్పటినుంచో అనుకుంటున్నట్టుగా, మల్లయ్యకూ, గంగమ్మకూ ఉండటానికని రెండు గదులు పెరట్లోనే వేయించాడు జగన్నాథం.
మల్లయ్యకు ఇక తోటే ప్రాణమైపోయింది. శ్రీహరికి జగన్నాథం దంపతులు పిన్నీ బాబాయిలై పోయారు...
శ్రీహరి ఎప్పుడైనా సుధతో అంటూ ఉంటాడు “ఏమోయ్, ఇల్లు మారదామా?” అని...
“ఊహూ, వెళితే మీరు వెళ్ళండి... తోటను విడిచి మేము రాము...” అంటుంది సుధ నవ్వుతూ....
*నండూరి సుందరీ నాగమణి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి