8, జూన్ 2021, మంగళవారం

రావణుడికి మంచి మాటలురావణుడికి మంచి మాటలు

 *రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు..*


*ఇహ సంతో న వా సంతి*

*సతో వా నాను వర్తసే*

(సుందర సర్గ 21 శ్లోకం 9)


*నీకు మంచి చెప్పేవాళ్ళు ఇక్కడ లేరా లేక నువ్వు వాళ్ళ మాట వినడంలేదా అన్నది సీతా దేవి ప్రశ్న.*


 ఆమాట కొస్తే సీత స్వయంగా అప్పుడు చెప్పిన మంచి మాటలు అంతకు ముందు రెండు సార్లు రావణుడి తో చెపుతుంది. పంచవటి దగ్గర మొదట, లంకకు రాగానే రెండో సారి, సుందరకాండ లో ఆఖరిసారి. 


రావణుడికి మంచి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాడు వాళ్ళ మాట వినలేదు. 


*రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళ లో మొదటివాడు మారీచుడు.*


ఖరుడి చావు గురించి చెప్పి రాముడిని నువ్వు ఎదిరించలేవు, కానీ ఆయన భార్యను ఎత్తుకొస్తే రాముడు దిగులుతో చనిపోతాడు అని  సలహా ఇచ్చినవాడు, రావణుని మంత్రి అకంపనుడు. వీడు యుధ్దం లో ఆంజనేయుడి చేతిలో చస్తాడు.  వీడు కూడా రాముడి పరాక్రమం గురించి సరిగానే చెప్తాడు. కానీ సీతాపహరణం చెయ్యమని వెధవ సలహా ఇస్తాడు.  అప్పుడు రావణుడు మారీచుడి దగ్గరకు వస్తాడు.  


మొదటిసారి మారీచుడు (అరణ్య కాండ 31 వ సర్గ) చెప్పిన మాట విని రావణుడు సీతాపహరణం ఆలోచన వీడి లంకకు వెనక్కి వెళతాడు. మారీచుడు  రాముడి గుణ గణాలు పరాక్రమము వర్ణించినట్లు గా రామాయణం లో ఋషులూ దేవతలూ కూడా వర్ణించరు. రామాయణం లో *"రామో విగ్రహవాన్ ధర్మః"*  అన్నది వీడే. ఆ మాట అనాలంటే  రాముడి నడవడిక గురించి పూర్తి అవగాహన ఉండాలి. అంతగా రాముడిని వీడు పరిశీలించాడు. 


*సులభా పురుషా రాజన్*

*సతతం ప్రియవాదినః* 

*అప్రియస్యతు పధ్యస్య* 

*వక్తా శ్రోతా చ దుర్లభః*.


ఇచ్చకాలు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు. నీకు మంచి జరిగేది, అందునా నీకు నచ్చనిది చెప్పేవాళ్లు ఎక్కడో కానీ ఉండరు అని ఈ శ్లోక భావం. మారీచుడు ఈ మాట అంటాడు. ఇదే శ్లోకం విభీషణుడు కూడా  చెబుతాడు. ఈశ్లోకం భారతం  విదురనీతి లో కూడా వస్తుంది.  


*సీత కాళరాత్రి స్వరూపిణి (మృత్యు స్వరూపిణి), కాబట్టి, సీతాపహరణం చేస్తే లంక నాశన మౌతుంది, అందులోని రాక్షసులు మొత్తం చస్తారని మారీచుడు నిర్మొహాటంగా చెప్తాడు.*


సూర్పణఖ ప్రోద్భలంతో రావణుడు రెండవసారి వచ్చి చంపుతానని బెదిరిస్తే సరే నీ చేతుల్లో చావడం కంటే రాముడి చేతులో చావడం మేలు అని మాయలేడి రూపం తీసుకోడానికి  అంగీకరిస్తాడు. 


ఇక మంచి మాటలు చెప్పిన రెండవ వాడు *ఆంజనేయుడు.*  రాముడు కానీ సుగ్రీవుడు కానీ రావణుడికి సందేశం పంపరు. ఊరికే సీత ఎక్కడుంది ఎలావుందీ చూసి రమ్మంటారు. సందేశం చెప్పడం లంక తగల పెట్టడం ఈయన సొంత  ఆలోచన. సభలో రావణుడికి చెప్పిన  సందేశం మంతా హనుమ తాను సొంతం గా చెప్పినది.  రావణుడిని శరీర బలం లో జయించిన వాలి వధ గుర్తు చేసి చెబుతాడు.  బ్రహ్మ వరం లో వాళ్ళు లేరు కనుక రావణుడికి నర వానరుల చేతిలో మరణం ఉందని చెబుతాడు.  రామ లక్ష్మణుల  పరాక్రమం గురించి చెప్తాడు. రాజ ధర్మాలు చెప్తాడు.   ఆఖరగా రాముడు పరమాత్మ అని కూడా చెప్తాడు.


*సర్వాన్ లోకాన్ సుసంహృత్య*

*సభూతాన్ సచరాచారాన్*

*పునరేవ తధా స్రష్టుమ్*

*శక్తో రామో మహా యశః*. 


అంటే రాముడు సృష్టి స్థితి లయకారకుడు అని చెప్తాడు. 


రావణుడు వినడు. 


ఇక మంచి మాటలు చెప్పిన మూడవ వాడు *విభీషణుడు.*  ఈన కూడా  


*"సులభా పురుషా రాజన్"*


అనే శ్లోకం చెప్తాడు. రావణుడు విభీషనుడు చెప్పిన మంచి మాటలు వినకపోగా తిట్టడం మొదలు పెడతాడు. తరవాత విభీషణుడు అన్న ను వదిలి పెట్టి రాముని దగ్గరికి వెళ్లి  రాముడిని శరణు కోరతాడు.  


యుద్ధం మొదలు అవడానికి కాస్త ముందు రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళు అతని తల్లి కైకసి, తాత (తల్లి యొక్క చిన్నాన్న) మాల్యవంతడు. వీళ్ళు సగౌరవంగా సీతను రాముడికి అప్పగించు అని గట్టిగానే చెప్తారు.  చెప్పినా రావణుడు వినడు. పైగా  ముత్యం లాగా ఈ కింది శ్లోకం అంటాడు.


*యుద్ధ కాండ 36 వ సర్గ శ్లోకం ..10.*


*ద్విధా భజ్యేయమ ప్యేవం*

*న నమేయం తు కస్యచిత్*

*ఏష మే సహజో దోషః*

*స్వభావో దురతిక్రమః*


"నన్ను రెండు ముక్కలు చేసినా నేను ఇంకెవ్వరి మాటా వినను. ఇది నాకు పుట్టుకతో వచ్చిన స్వభావము. నేనేం చేసేది" అని దానర్థం. చాలా మంచి మాట. దూర్యోధనుడి  "సూది మొన" గుర్తు వస్తుంది కదా. అందరూ ఒకటే తాను లో ముక్కలు. 


కుంభకర్ణుడిని నిద్రమధ్యలో లేపితే మరణిస్తాడు అని శాపం ఉంటుంది. అది తెలిసీ రావణుడు కుంభకర్ణుడిని నిద్ర లేపుతాడు.  అప్పటికే యుద్ధం మొదలు అయ్యి చాలా మంది మరణించి ఉంటారు. వీడు కూడా చెప్పి చూస్తాడు. సరే సీతయ్య .. ఎవ్వరి మాటా వినను అని ముందే చెప్పాడు కదా. కుంభకర్ణుని మీద కూడా గుడ్లురిమి సలహాలు ఇవ్వకు చెప్పింది చెయ్యి అంటాడు. కుంభకర్ణుడు కూడా యుద్ధం చేసి చచ్చి పోతాడు. కుంభకర్ణుని  మరణం తరవాత రావణుడు విభీషణుడి మాటలు గుర్తు తెచ్చుకుని చాలా బాధపడతాడు. ఈ పశ్చాత్తాపం కాసేపే ఉంటుంది. మళ్ళీ ఇంద్రజిత్తును నమ్మి యుద్ధానికి సిద్ధ మౌతాడు.


ఇవి రావణుడికి మంచి మాటలు చెప్పిన వాళ్ళ వివరాలు. 


*పవని నాగ ప్రదీప్*

కామెంట్‌లు లేవు: