8, జూన్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారి చరిత్ర...


*శ్రీ స్వామివారి నిర్ణయం..*


*(యాభై రెండవ రోజు)*


శ్రీ స్వామివారు ఒక దృఢ నిర్ణయానికి వచ్చి..శ్రీధరరావు దంపతులను రమ్మనమని కబురుపంపించారు.. అదేరోజు సాయంత్రం శ్రీధరరావు ప్రభావతి గార్లు శ్రీ స్వామివారి వద్దకు వచ్చారు..ఆశ్రమ వరండాలో తీరుబడిగా కూర్చున్నాక..


శ్రీ స్వామివారు నవ్వుతూ.."అమ్మా..మొన్నామధ్య నేను ఆ నేలమాళిగ లో తపస్సు చేసుకోవడం చూశారుగదా?..సాధకులు ఎలా తపస్సు చేస్తారో అవగతం అయిందికదా?..నా తపస్సు కూడా చివరి దశకు వచ్చేసింది..ఇప్పుడు మీరు చేయవలసిన కార్యం ఒకటుంది..అది..అది..నా సజీవ సమాధికి మీరు ఆయత్తం కావడం..నా తపోదీక్ష పూర్తి అయింది..ఆ దత్తాత్రేయుడి అనుజ్ఞా లభించింది..నాకు ఎల్లవేళలా రక్షణ కల్పించిన ఆ పార్వతీమాత ఆదేశమూ వచ్చింది..ఇక మిగిలివున్నది మాత్రం..నా సజీవ సమాధి..అందుకు మీరు సహకరించాలి..ఇది నా కోరిక!.." అన్నారు..


శ్రీ స్వామివారి మాటలు వింటున్న శ్రీధరరావు ప్రభావతి గార్లు మాన్ప్రడి పోయారు..వాళ్ళిద్దరికీ శ్రీ స్వామివారు యేమి చెపుతున్నారో అర్ధం కావడానికి కొద్దిసేపు పట్టింది..


"నాయనా!..ఇదేమి కోరిక?..మేము మా చేతులతో ఆ పని చేయగలమా?..అయినా ఇప్పుడు..ఈ చిన్న వయసులో మీకు ప్రాణత్యాగం చేయాలనే తలంపు ఎందుకు కలిగింది?.." అన్నారు ప్రభావతి గారు..


ఆ వెంటనే శ్రీధరరావు గారు.."తపస్సు పూర్తిచేసుకుని..మరికొన్నాళ్లు ఆధ్యాత్మిక చింతనలో కాలం గడుపవచ్చు..ఎందరికో మార్గదర్శనం చేయవచ్చు..మాబోటి వారికి ఒక అవధూతను సేవించుకునే భాగ్యం కలగడమే ఒక గొప్ప వరం..అటువంటిది మా చేతులతో మేమే ఆ అవధూతను సజీవంగా సమాధి చేయటం అయ్యే పనేనా?.." అన్నారు..


శ్రీ స్వామివారు ప్రశాంతంగా చూస్తూ.."నాకు భగవంతుడు ఇచ్చిన సమయం పూర్తి కావొచ్చింది..ఇక నేను ఎక్కువకాలం జాగు చేయకూడదు..సరే..దైవ నిర్ణయం ఎలా వుంటే..అలా జరుగుతుంది..మీరు మాత్రం సిద్ధంగా వుండండి.." అన్నారు..


ఆ దంపతులు ఆ క్షణంలో ఇక ఆ సంభాషణ పొడిగించదల్చుకోలేదు..ఇద్దరూ లేచి.."వెళ్లివస్తాము నాయనా!.." అని చెప్పి..తిరిగి బండిలో తమ ఇంటికి వచ్చేసారు..దారిలో ప్రభావతి గారు.."ఇదేమిటి శ్రీవారూ..ఇలాటి కోరిక వెలిబుచ్చాడీయన?..మనమెలా సహకరిస్తాము?.." అన్నారు.."ప్రభావతీ..ఇక్కడ ఏర్పాట్లలో ఏదైనా లోపం జరిగిందేమో..లేదా తపస్సు సరిగా సాగటం లేదేమో..ఒకసారి వారి గురువు గారి వద్దకు వెళ్లి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేద్దాము..గురువు మాట వినకుండా వుండరు కదా?..ఇటువంటి సాధకులు, అవధూతలు నేటి కాలానికి చాలా అవసరం..అర్ధాంతరంగా శరీరం విడిచి పెడితే..సమాజానికి తీరని నష్టం..మనవంతు ప్రయత్నం మనం చేద్దాము.." అన్నారు..ఈ విషయమై రాత్రి పొద్దుపోయేదాకా చర్చించుకుంటూనే వున్నారు..


వాళ్ళిద్దరికీ ఆ సమయం లో తెలీదు తమకు లెక్కలేనన్ని సమస్యలు చుట్టుముట్టబోతున్నాయని..వాటిలో తాము ఉక్కిరిబిక్కిరి కోబోతున్నామనీనూ..


ఒకవారం గడిచిపోయింది..ఈలోపల ప్రభావతి గారి చెల్లెలు కాపురంలో కలతలు వచ్చి..మతి చెడి తన చిన్న కూతురు (సంవత్సరం వయసున్న పాప ) తో సహా మొగలిచెర్లకు వచ్చేసింది..ఆ చిన్నపిల్ల ఆలనా పాలనా..అలాగే ఆ చెల్లెలు బాగోగులు చూసుకోవడం ప్రభావతి గారికి సరిపోతోంది..చెల్లెలు యొక్క పరిస్థితి బాగవుతుందేమో నని ఒకసారి శ్రీ స్వామివారి వద్దకు తీసుకెళ్లారు ప్రభావతి శ్రీధరరావు గార్లు.."ఈ అమాయకపు తల్లికి త్వరలోనే ముక్తి వుందమ్మా.." అన్నారు స్వామివారు..ఆ "ముక్తి " అన్నమాటకు..త్వరలో కష్టాలు తీరి, కాపురం చక్కబడుతుందని ఈ దంపతులు ఊహించి సంతోషపడ్డారు..తీరా కొద్దిరోజుల్లోనే ఆ సోదరి మరణించి జీవన్ముక్తి పొందింది..


"అమ్మా..ఆ అమ్మాయి సమస్యకు ఈ విధంగా ముక్తి కలగడం ఒక్కటే పరిష్కారం..దైవం అలానే నిర్ణయిస్తాడు..మరో సమస్య కూడా త్వరలోనే తీరిపోతుంది..మీకున్న ఒక్కక్క బంధమూ ముడి విప్పినట్లు విడిపోతాయి..కొంత బాధ తప్పదు!.." అన్నారు శ్రీ స్వామివారు నిర్వికారంగా చూస్తూ..


అర్ధమయీ.. అర్ధం కానట్లు గా అనిపించి..శ్రీ స్వామివారి వద్ద సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసారు శ్రీధరరావు ప్రభావతి గార్లు..


జీవసమాధి గురించిన వివరణ.. అద్భుత సందేశం..రేపటి నుంచి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం, మొగలిచెర్ల గ్రామం, లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: