28, సెప్టెంబర్ 2021, మంగళవారం

సంస్కృత మహాభాగవతం

 *28.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - తొమ్మిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - కురురపక్షి (లకుముకిపిట్ట) మొదలుకొని 'భృంగి' అను కీటకము వరకు గల ఏడుగురు గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*9.1 (ప్రథమ శ్లోకము)*


*పరిగ్రహో హి దుఃఖాయ యద్యత్ప్రియతమం నృణామ్|*


*అనంతం సుఖమాప్నోతి తద్విద్వాన్యస్త్వకించనః॥12544॥*


*అవధూతయగు దత్తాత్రేయుడు వచింపసాగెను* యదుమహారాజా! సహజముగా మానవులు తమకుఇష్టమైన వస్తువులు సమకూర్చుకొనుటకు ఆరాటపడుచుందురు. కాని అది వారికి దుఃఖహేతువే యగును. అకించనుడైన (దేనినీ సంగ్రహించెడి స్వభావములేని) విద్వాంసుడు అనంతసుఖమును పొందును. శ్రేయస్సును కోరుకొనువాడు దేనినీ 

పరిగ్రహింపరాదు.


*9.2 (రెండవ శ్లోకము)*


*సామిషం కురరం జఘ్నుర్బలినో యే నిరామిషాః|*


*తదామిషం పరిత్యజ్య స సుఖం సమవిందత॥12545॥*


(ఈ విషయమున ఒక కురరపక్షిని దృష్టాంతముగా తెలుపుచున్నాడు). ఒకానొక కురరపక్షికి ఒక మాంసపుముక్క లభించెను. అప్పుడు ఆ మాంసమును ఆశించునట్టి బలమైన పక్షులు కొన్ని ఆ మాంసము ముక్కకొరకు ఆ కురరపక్షిపై విఱుచుకొనిపడి హింసింపసాగినవి. అంతట ఆ పక్షి తన నోటిలోని మాంసపుముక్కను వదలివేసి, తనను తాను రక్షించుకొని హాయిగా నుండెను. కనుక 'వస్తుసంగ్రహము ఆపదలకు మూలము' అని ఎరుంగవలయును.


*9.3 (మూడవ శ్లోకము)*


*న మే మానావమానౌ స్తో న చింతా గేహపుత్రిణామ్|*


*ఆత్మక్రీడ ఆత్మరతిర్విచరామీహ బాలవత్॥12546॥*


*9.4 (నాలుగవ శ్లోకము)*


*ద్వావేవ చింతయా ముక్తౌ పరమానంద ఆప్లుతౌ|*


*యో విముగ్ధో జడో బాలో యో గుణేభ్యః పరం గతః॥12547॥*


పసిబాలుడు ఏమాత్రమూ చింతలేకుండా తనలోతాను ఆనందించుచుండును. అట్లే నేనును ఆత్మానందమును అనుభవించుచుందును. నాకు మానావమానములు జోలియే పట్టదు ( ఆ రెండింటియందును సమచిత్తుడనై యుందును). నాకు సాంసారికములైన చింతలు ఏవియును లేవు. ఎట్టి మాయామర్మములెరుగని బాలురు, లేక గుణాతీతులు (సత్త్వరజస్తమో గుణములకు అతీతులు) ఐనవారు మాత్రమే చింతారహితులై హాయిగా నుందురు. ఆ రెండు కోవలకు చెందినవారు మాత్రమే పరమానందమును పొందుదురు.


*9.5 (ఐదవ శ్లోకము)*


*క్వచిత్కుమారీ త్వాత్మానం వృణానాన్ గృహమాగతాన్|*


*స్వయం తానర్హయామాస క్వాపి యాతేషు బంధుషు॥12548॥*


*9.6 (ఆరవ శ్లోకము)*


*తేషామభ్యవహారార్థం శాలీన్ రహసి పార్థివ|*


*అవఘ్నంత్యాః ప్రకోష్ఠస్థాశ్చక్రుః శంఖాః స్వనం మహత్॥12549॥*


*9.7 (ఏడవ శ్లోకము)*


*సా తజ్జుగుప్సితం మత్వా మహతీ వృడితా తతః|*


*బభంజైకైకశః శంఖాన్ ద్వౌ ద్వౌ పాణ్యోరశేషయత్॥12550॥*


*9.8 (ఎనిమిదవ శ్లోకము)*


*ఉభయోరప్యభూద్ఘోషో హ్యవఘ్నంత్యాః స్మ శంఖయోః|*


*తత్రాప్యేకం నిరభిదదేకస్మాన్నాభవద్ధ్వనిః॥12551॥*


ఒకానొకప్పుడు ఒక కన్యను వరించుటకై కొంతమంది ఆ కన్య ఇంటికి వచ్చిరి. అప్పుడు ఆ ఇంటిలోని పెద్దలు (తల్లిదండ్రులు మొదలగువారు) బయటికి వెళ్ళియుండిరి. అందువలన ఆమెయే వారికి అతిథి సత్కారములను చేసెను. రాజా! ఆ వచ్చిన అతిథులకు ఆహారమును సిద్ధపరచుటకై ఆమె ఇంటిలోపల ధాన్యమును ఒంటరిగా దంపసాగెను. అప్పుడు ఆ చేతికి గల గాజులు పెద్దగా ధ్వని చేయసాగెను. అంతట బుద్ధిశాలియైన ఆ కన్య స్వయముగా ధాన్యమును దంచుట అవమానముగా భావించి మిగుల సిగ్గుపడెను. అందువలన ఆమె తన చేతులకుగల గాజులను ఒక్కొక్కటిగా పగులగొట్టెను. అంతట ఒక్కొక్క చేతియందు రెండేసి గాజులు మాత్రమే మిగిలియుండెను. పిమ్మట ఆమె ఆ ధాన్యమును దంచుటకు మొదలిడగా ఆ రెండుగాజులును ధ్వనింపసాగెను. అంతట ఆ కన్య చేతులయందలి ఒక్కొక్క గాజును పగులగొట్టెను. అప్పుడు ఒక్కొక్క చేతికి ఒక్కొక్క గాజు మాత్రమే మిగిలియుండెను. పిమ్మట ఆమె ధాన్యమును దంచినను ఎట్టి శబ్దమూ రాకుండెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని తొమ్మిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: