28, సెప్టెంబర్ 2021, మంగళవారం

అనాయాస మరణం

 *ఆచార్యులు..అనాయాస మరణం..*


2011 వ సంవత్సరం లో..మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆరాధనామహోత్సవానికి మరో నాలుగురోజుల వ్యవధి వుందనగా..ఒక శనివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు..ఒక పెద్దాయన నేరుగా నేను కూర్చున్న చోటుకి వచ్చి..ఏ ఉపోద్ఘాతమూ లేకుండా...


 ఈ స్వామివారు జీవించి ఉండగా చూసావా?..అప్పుడు నీ వయసెంత?..నీతో స్వామివారు ఎప్పుడైనా మాట్లాడారా.? " అంటూ ఒకదాని తరువాత ఒకటి చొప్పున వరుసగా ప్రశ్నలు అడుగుతున్నారు.. ఆ పెద్దాయన కు సుమారు డెబ్భై ఏళ్ళ పైబడి వయసుంటుంది..నిలబడే వున్నారు..నుదుటిమీద తిరునామం చక్కగా దిద్దుకొని వున్నారు..సంప్రదాయబద్ధమైన పంచెకట్టు..భుజం మీద జరీ కండువా..ముఖం లో ఏదో తెలియని తేజస్సు కనబడుతున్నది..నేను జవాబు చెపుదామని నోరు తెరిచేలోపలే..మళ్లీ అందుకొని.."స్వామివారు నీకు గురూపదేశం ఏమైనా చేసారా..?" అన్నారు.


ఆయనను ఒక్కక్షణం ఆగమని సైగ చేసాను..ముందు స్థిమితంగా కూర్చోమని చెప్పాను..నా ప్రక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.."మీరెవరు..? మీ పేరేమిటి?..మీరు ఎక్కడినుండి వచ్చారు..? ఈ ప్రశ్నలకు ముందు జవాబివ్వండి...మీ అన్ని సందేహాలకూ సమాధానం చెపుతాను.." అన్నాను..


నావంక తీక్షణంగా చూసారు.."నా పేరు రాఘవాచార్యులు..మా స్వగ్రామం చదలవాడ..కానీ మా నాన్నగారి వివాహం అయ్యాక ఇల్లరికం వెళ్లారు..1930, 31 ప్రాంతాల్లో చెన్నై లో స్థిరపడ్డాము..మేమంతా అక్కడే పుట్టి పెరిగాము..అక్కడే ఉద్యోగం చేసి, రిటైర్ కూడా అయ్యాను..అవధూతల క్షేత్రాలను దర్శించటం నాకు ఇష్టం..మొన్న గొలగమూడి వెంకయ్యస్వామి వారి మందిరానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఈ క్షేత్రం గురించి విన్నాను.. కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన అవధూత మందిరం ఇది అని తెలుసుకున్నాను..ఈ స్వామివారి చరిత్ర గురించిన పుస్తకం ఒకటి అక్కడి భక్తులదగ్గర లభ్యమైంది..ఏకబిగిన చదివేశాను..చదివిన తరువాత వుండబట్టలేక..నేరుగా ఇక్కడికి వచ్చాను..ఆ పుస్తకం వ్రాసిన ప్రభావతి గారి కుమారుడు నువ్వేనని మీ సిబ్బంది చెప్పారు..నిన్ను అడిగి విషయం తెలుసుకుందామని నీ దగ్గరకు వచ్చాను.." అన్నారు..


వారిని స్థిమితపడమని చెప్పి..శ్రీ స్వామివారిని నేను మొదటిసారి కలిసిన దగ్గరనుంచీ..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందేవరకూ నాకు శ్రీ స్వామివారితో కలిగిన అనుభవాలను క్లుప్తంగా చెప్పాను..శ్రద్ధగా విన్నారు..


"అయితే నీకు ప్రత్యేకించి ఉపదేశం ఏమీ చేయలేదా..? " అన్నారు..

"లేదండీ..కాకపోతే..ఈ క్షేత్రాన్ని ముందు ముందు నేనే నిర్వహించాల్సివస్తుంది అని సూచనప్రాయంగా అప్పట్లో చెప్పారు..ఆరోజు నాకున్న అవగాహనారాహిత్యం వల్ల సరిగ్గా గ్రహించలేకపోయాను..ఇప్పుడు ఆలోచిస్తే..స్వామివారు చెప్పిన మాటలకు అర్ధం గోచరిస్తోంది.." అన్నాను..


"ఒక్కసారి స్వామివారి సమాధి వద్దకు వెళ్ళనిస్తావా..?" అన్నారు..

"ఈరోజు శనివారం..ఒక్క శనివారం నాడు మాత్రం తన సమాధి వద్దకు ఎవరూ రావొద్దని శ్రీ స్వామివారు సిద్ధిపొందే ముందు స్వహస్తాలతో వ్రాసి పెట్టారండీ..మీరు ఈరాత్రికి ఇక్కడ నిద్రచేయండి..రేపుదయాన్నే శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకొని వెళ్లొచ్చు.." అన్నాను..


ఒక్కక్షణం ఆలోచించి.."సరే.." అన్నారు..ఇంతలో మా సిబ్బంది ఆరోజు సాయంత్రం జరుపబోయే పల్లకీసేవ గురించి మైక్ లో చెపుతున్నారు..అది విని.."ఈ సాయంత్రం పల్లకీసేవ ఉన్నదా..? నేనూ పాల్గొంటాను.." అన్నారు..


రాఘవాచార్యులు గారు ఆ సాయంత్రం పల్లకీసేవ లో పాల్గొన్నారు..పల్లకీసేవ పూర్తయిన తరువాత..నా దగ్గరకు వచ్చి..మా అర్చకస్వాములు కొన్ని మంత్రాలు చదివేటప్పుడు స్వరం తప్పుగా ఉన్నదనీ..దానిని సరిచేసుకోమనీ..కొన్ని సూచనలు ఇచ్చారు..తప్పకుండా సరిచేసుకుంటామని వారికి చెప్పాను..తృప్తిగా నవ్వారు..భోజనం చేయమని అడిగాను..శనివారం నాటి రాత్రికి ఉపవాసం ఉంటానని చెప్పారు..ఒక గ్లాసు పాలు తెప్పించి ఇచ్చాను..తీసుకున్నారు.


ప్రక్కరోజు ఉదయాన్నే 5గంటలకల్లా స్నానం చేసి మందిరం లోకి వచ్చారు..శ్రీ స్వామివారికి జరిగే ప్రభాతసేవ అంతా శ్రద్ధగా చూసారు..హారతులు పూర్తయిన తరువాత..వారిని శ్రీస్వామివారి సమాధి దర్శనానికి వెళ్ళిరమ్మన్నాను..సమాధి మందిరం లోపలికి వెళ్లి..సమాధి చుట్టూ ప్రదక్షిణ చేసుకొని..ఐదు నిమిషాలు నిలబడ్డారు..అర్చకస్వామి వద్ద హారతి తీసుకొని..మరొక్కమారు శ్రీ స్వామివారి విగ్రహానికి నమస్కారం చేసుకొని...నేరుగా నేను కూర్చున్న చోటుకు వచ్చారు..


"నాయనా ప్రసాద్..నిజమైన సాధకుడి సమాధిని దర్శించానయ్యా..ఒడలు పులకరించాయి..శ్రీ స్వామివారి సాధన తాలూకు ప్రకంపనలు ప్రత్యక్షంగా అనుభవించాను..నా మనసులో ఈ స్వామివారి రూపం స్థిరంగా నిలబడిపోయింది..నువ్వు చాలా అదృష్టవంతుడవు..ఇటువంటి మహనీయుడి సాన్నిహిత్యాన్ని అనుభవించావు.." అంటూ నా రెండు చేతులూ పట్టుకొని కళ్ళకు అద్దుకున్నారు..ఆయన కళ్లలోంచి కన్నీళ్లు వస్తున్నాయి..బాగా చలించిపోయినట్టు వున్నారు.."ఈ జీవితానికి ఇంకేం కావాలి?..సాధకుడి తపోభూమిని దర్శించాను..అనాయాసేన మరణాన్ని కోరుకున్నాను.." అని తనలో తాను అనుకుంటున్నట్లు గా అన్నారు..


రాఘవాచార్యులు గారు ఆరోజు మధ్యాహ్నం చెన్నై తిరిగి వెళ్లిపోయారు..ఆ తరువాత రెండునెలల్లో మరో రెండుసార్లు వచ్చి శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..ప్రతిసారీ అదే తాదాత్మ్యం పొందారు..రాబోయే దత్తజయంతికి స్వామివారి వద్దకు వస్తాను అన్నారు కానీ దత్తజయంతి ముందురోజు పరమపదించారు..నిజంగానే ఆయన కోరుకున్న విధంగా ఎటువంటి ఇబ్బందీ లేకుండా సుఖమైన నిద్రలో మరణించారు..ధన్యజీవి!!


శ్రీ రాఘవాచార్యులు గారి మాటలు ఇప్పటికీ నా చెవుల్లో వినబడుతూనే ఉన్నాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్:523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: