*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*421వ నామ మంత్రము* 28.9.2021
*ఓం వ్యాహృత్యై నమః*
వ్యాహృతిమంత్ర (భూర్భువస్సువః) స్వరూపురాలు అయిన పరమేశ్వరికి నమస్కారము.
ఉచ్చారణ స్వరూపురాలయిన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *వ్యాహృతిః* అను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం వ్యాహృత్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఉపాసించు సాధకులు తమ సాధనయందు పరిపూర్ణత సాధించి ఆ పరమేశ్వరియొక్క కృపాకటాక్షవీక్షణములచే ఆయురారోగ్యములు, సిరిసంపదలు, జ్ఞానసంపదలతోబాటు కైవల్యసాధనకు కావలసిన దీక్షాపటుత్వమును పొందగలరు.
వ్యాహృతి అంటే సామాన్యార్థం ఉచ్చారణం. వ్యాహృతి యనగా ఒకానొక మంత్ర విశేషరూపము. సప్తవ్యాహృతులు అని ఏడు వ్యాహృతులు గలవు. అవి:- 1. భూః, 2. భువః, 3. సువః, 4. మహః, 5. జనః, 6. తపః, 7. సత్యమ్. ఈ యేడు వ్యాహృతులు బ్రాహ్మణులు ప్రాణాయామముతో పఠించదగినవి.
భూః, భువః, స్వః అనే మూడు శబ్దాలు వ్యాహృతి త్రయం. హోమాదులలో పూర్ణాహుతికి ముందు ఈ మూడు శబ్దాలతో హవిస్సులను వ్రేల్చడం విధాయకం. భూర్భువస్సువర్లోక పాలకులు అగ్ని, వాయు, సూర్యులు. ఈ ముగ్గురే వసు, రుద్ర, ఆదిత్య రూపులు. శ్రాద్ధకర్మలలో ఈ ముగ్గురు పితరులని శాస్త్రము చెప్పుచున్నది.
సంధ్యావందనంలో సప్తవ్యాహృతులను పలకవలసి ఉంటుంది. అవి : భూః, భువః, స్వః/సువః, మహః, జనః, తపః, సత్యం.
గాయత్రీ మంత్రంలోని మూడు వ్యాహృతులు భూః, భువః, సువః ఈ వ్యాహృతులకే త్రికము అని పేరు. ఈ మూడు బ్రహ్మ యొక్క జ్ఞానదేహము నుండి వ్యవహరింపబడుటచే *వ్యాహృతులు* అని అన్నారు. సృష్టి స్థితి లయాల శక్తుల పేర్లే ఈ మూడు వ్యాహృతులు. *భూః* అనగా బ్రహ్మ, *భువః* అనగా ప్రకృతి; *సువః* అనగా జీవుడు. మూడు లోకాలు ఈ వ్యాహృతులకు సంకేతం. అగ్ని, వాయువు, సూర్యులకు ఈ వ్యాహృతులు ప్రతినిధులు. అంతేకాదు. *భూః* అనగా భూమి, *భువః* అనగా ఆకాశం, *సువః* అనగా స్వర్గంగా చెప్పబడ్దాయి. *ఈ వ్యాహృతులను జపిస్తే వేదాలను చదివిన ఫలం కలుగుతుంది అని చెబుతారు* అందువల్లనే గాయత్రీ మంత్రానికి చేర్చబడ్డాయి. అంటే గాయత్రీ సారం వ్యాహృతి త్రయం.
మూడు వ్యాహృతులే కాదు, సప్త వ్యాహృతుల ఉద్భవానికి గాయత్రి మూలం. పరమాత్మను చేరటానికి ఈ ఏడు వ్యాహృతులు ఏడు సోపానాలు. మంత్ర జపానుష్టాన సమయంలో, సప్త వ్యాహృతుల స్పందన దేహంలోని షట్చక్రాలపై కలుగుతుంది. సర్వ వ్యాపకాలైన సప్త వ్యాహృతులు, సర్వ కర్మలందు ప్రాణాయామంగా ఉపయోగించ బడతాయి. ఈ క్రింది పట్టిక సప్త వ్యాహృతుల విశిష్టత, శక్తి తెలుపుతుంది.
1. *భూః* అగ్ని - భూలోకం - మూలాధారం - గాయత్రి ఛందస్సు - భౌతిక వికాసం.
2. *భువః* వాయువు - భువర్లోకం - స్వాధిష్టానచక్రం - ఉష్ణిక్ ఛందస్సు - ప్రాణాయామం.
3. *సువః* సూర్యుడు - స్వర్గలోకం - మణిపూర చక్రం - అనుష్టుప్ ఛందస్సు - చిత్తవికాసం.
4. *మహః* బృహస్పతి - అనాహతచక్రం - బృహతి ఛందస్సు - బుద్ది వికాసం.
5. *జనః* వరుణుడు - జనలోకం - విశుద్ఢచక్రం - పంక్తి ఛందస్సు - మానసిక వికాసం.
6. *తపః* - ఇంద్రుడు - తపోలోకం - ఆజ్ఞాచక్రం - త్రిష్టుప్ ఛందస్సు - ఆధ్యాత్మిక వికాసం.
7. *సత్యము* విశ్వదేవతలు - సత్యలోకం - సహస్రారచక్రం జగతి ఛందస్సు - పరమపదం
ఇక లోకాల వివరణ చెప్పాల్సి వస్తే
1. *భూలోకం*- పుణ్యపురుషులకు, మనుష్యులకు నివాస స్థానం. సుమేరువు ధ్యానస్థలం. సుమేరువు నందలి ఉద్యానవనాలు, మిశ్రవనం,నందనం, చైత్రరథం, సుధర్మ దేవసభ. సుదర్శనం పట్టణం. వైజయంతం రాజసౌధం.
2. *భువర్లోకం* - గ్రహాలు, నక్షత్రాలు, నిర్ణీత కక్షలో సుమేరువుపై తిరుగుతూ ఉంటాయి.
3. *స్వర్గలోకం* - ఈ లోకం ప్రజాపతికి చెందినది. సంకల్ప సిద్ధులైన దేవతల నివాసం. ఈ లోకం అప్సరసలకు కూడా నివాసస్థానమే
4. *మహర్లోకం*- ఈ లోకంలోని దేవతలు సర్వసమర్థులు, వెయ్యికల్పాలు ఆయుష్షుగా కలవారు.
5. *జనోలోకం* ఇది బ్రహ్మలోకం. ఇక్కడ నివశించువారు భూతేంద్రియాలను వశం చేయగల సమర్థులు.
6. *తపోలోకం* - అధికమైన ఆయుషు గల జ్ఞానులు ఈ లోకవాసులు.
7. *సత్యలోకం* - ఈ లోకవాసులు అనికేతులు. ఆత్మయే ఆశ్రమంగా కలవారు. ప్రకృతిని వశం చేసుకొని,సృష్టి ఉండేంతవరకు జీవించి ఉంటారు.
ఈ మూడు వ్యాహృతుల ముందు మూడు ప్రణవములు, చివర ప్రణవం, మంత్రానికి ముందు, చివర ప్రణవములు- మొత్తం ఆరు. ఈ గాయత్రీ మంత్రం షడోంకార గాయత్రి. ఈ మంత్రోపాసన చేసినచో సమస్త వాజ్ఞ్మయము తెలియును.. కానీ, ఈ ఉపాసన బ్రహ్మచారులు, గృహస్థులు చేయకూడదు.
*గాయత్రీ మహా విజ్ఞానం*
*ఓం* పరమాత్మ స్వరూపం
*భువః*- కర్మయోగం
*భూః* - ఆత్మజ్ఞానం
*తత్* - జీవన విజ్ఞానం
*సువః*-స్థిర యోగం
*వరేణ్యం*- శ్రేష్ఠమైన
*సవితం*- శక్తి సంపుటి
*దేవస్య* - దివ్య దృష్టి
*భర్గో* -నిర్మలమైన
*ధియో* - వివేకం
*ధీమహి* -సద్గుణాలు
*ప్రచోదయాత్*- సేవ
*యోనః* -సంయమనం
గాయత్రీ మంత్రంలోని తొమ్మిది పదాలు నవరత్నాలు. పదునెనిమిది విద్యలలో మీమాంస శ్రేష్ఠమైనది. మీమాంస కంటే తర్కశాస్త్రం కంటే పురాణాలు, పురాణాల కంటే ధర్మశాస్త్రం గొప్పది. వేదాలు ధర్మశాస్త్రం కంటే గొప్పవైతే, ఉపనిషత్తులు వేదాలు కన్నా ఉత్తమమైనవి. గాయత్రీ మంత్రం,ఉపనిషత్తుల కంటే అత్యంత శ్రేష్ఠమైనది.
*న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్* అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము *గయ*, *త్రాయతి* అను పదములతో కూడుకొని ఉంది. *గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ* అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. *త్రాయతే* అనగా రక్షించడం. కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి వేయి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమునుచేర్చి ఇరువది నాలుగు అక్షరములతో ఇరువది నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్రామాయణమును వ్రాసెను.
*వ్యాహృతి* అను శబ్దమునకు ఇంత వివరణ ఈయవలెనని అనిపించినది. పరమేశ్వరి ఉచ్చారణ స్వరూపురాలు, ఒకానొక మంత్రస్వరూపురాలు మరియు వ్యాహృతి మంత్రస్వరూపురాలు గనుక ఆ తల్లి *వ్యాహృతిః* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం వ్యాహృత్యై నమః* అని యనవలెను
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*422వ నామ మంత్రము* 28.9.2021
*ఓం సంధ్యాయై నమః*
సంధ్యోకాలోపాస్య దేవతా స్వరూపిణియైన పరమేశ్వరికి నమస్కారము.
బ్రహ్మ మానస పుత్రికయైన సంధ్యాదేవి స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
ఇడా, పింగళ, సుషుమ్నా నాడీత్రయ స్వరూపురాలైన లలితాంబకు నమస్కారము.
ఒక సంవత్సరం వయసుగల బాలికాస్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *సంధ్యా* యను రెండక్షరముల (ద్వ్యక్షరీ) నామ మంత్రమును *ఓం సంధ్యాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆయురారోగ్యములు, అష్టైశ్వర్యములు, శాంతిసౌఖ్యములు సంప్రాప్తమగును.
సూర్యుని యందలి చైతన్యమునకును, పరబ్రహ్మస్వరూపిణియైన తనకు (పరమేశ్వరికిని) అభేదభావన చేయుటయే సంధ్య గనుక అమ్మవారు *సంధ్యా* యని అనబడినది. 'సూర్యునియందలి చైతన్యమును బ్రహ్మాదులతోను, మహాభూతముల తోను, వాటి అంశములతోను అభేదముగా (ఒకటే యనుభావముతో) అనుసంధానముచేయుటచే మొదట సచ్చిదానందరూప పరమాత్మకు నేను దాసుడను అనెడి బుద్ధి ఉపాసకునకు గలుగును. తరువాత నేనే ఆ పరమాత్మ అనెడు బుద్ధి కలుగును. అట్టి అభేదభావనకు *సంధ్య* అని పేరు' అని వేదవేత్తలు చెప్పుచున్నారు. అందుకే పరమేశ్వరి చైతన్యాభిన్నస్వరూపురాలు అయినది గనుక *సంధ్యా* యని అనబడినది. బ్రహ్మకంటె వేరైనదిగా గాయత్రీ మంత్రమును పొందకూడదు గనుకను, ఏ విధిగానైనను నేనే గాయత్రిని అని ఉపాసన చేయవలయునని వ్యాసులవారు అనడం జరిగినది. 'కర్మసాక్షిణి యగు పరమాత్మ యొక్క చైతన్యశక్తి బ్రహ్మవిష్ణురుద్రాది రూపములను పొంది అనేక విధములుగా ప్రకాశించుచున్నది. అట్టి పరమేశ్వరిని (పరమాత్మను) దేవతలు *సంధ్య* యని చెప్పుచున్నారని భరద్వాజస్మృతియందు గలదు. 'ఓ పరమేశ్వరీ! ఆగమములన్నియు నిన్ను నాల్గవపాదముతోడను గూడిన సంధ్యామయ గాయత్రీ యని చెప్పుచున్నారు. నీవే మహాకర్మలన్నిటికి సుఖము నిచ్చుచున్నావు అని పండితులు పలికిరి. అట్టి గాయత్రీ స్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. అలాగే మాధవుడు 'సంధ్యా (ప్రాతః సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య) సమయములలో ఉపాసించిన దేవత ఈ *సంధ్య* యను దేవత. అట్టి సంధ్యా స్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. బ్రహ్మదేవుడు ధ్యానము చేయుచుండగా ఆయన మనస్సునుండి అందమయిన ఒక స్త్రీ మూర్తి ఉద్భవించినది. ఆమెయే బ్రహ్మమానస పుత్రికయైన సంధ్య. అట్టి సంధ్యాస్వరూపిణియైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. ఈ విషయము భగవతీ పురాణమునందు కూడా చెప్పబడినది. అట్టి బ్రహ్మమానస పుత్రిక యైన సంధ్య తపస్సు చేసి ఆ శరీరమును విడచి అరుంధతిగా జన్మించినది. మహాకాళి యని పేరుగల ఇడానాడియు, మహాలక్ష్మి యని పేరుగల పింగళనాడియు, ఏకవీర యని పేరుగల సుషుమ్నా నాడియు, నాడీత్రయమని అనబడగా, అట్టి నాడీ త్రయస్వరూపురాలైనది ఈ సంధ్య. అట్టి సంధ్యా స్వరూపురాలైన శ్రీమాత *సంధ్యా* యని అనబడినది. ఒక సంవత్సరము గల కన్యకను సంధ్యగా దౌమ్యుడు కన్యా ప్రకరణమందు చెప్పెను. అట్టి కన్యాస్వరూపురాలైన పరమేశ్వరి *సంధ్యా* యని అనబడినది. చిచ్చక్తి స్వరూపిణియైన పరమేశ్వరి సంధ్యాస్వరూపిణియై, ప్రాతః కాల సంధ్యయందు గాయత్రిగా, మధ్యాహ్న సంధ్యయందు సావిత్రిగా, సాయం సంధ్యయందు సరస్వతిగా ఆరాధింప బడుచుండుటచే అమ్మవారు *సంధ్యా* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం సంధ్యాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి