13, నవంబర్ 2023, సోమవారం

శ్రీ ద్వారకాధీశ్ / ద్వారకానాద్ మందిర్

 🕉 మన గుడి : నెం 237


⚜ గుజరాత్ : ద్వారక






⚜ శ్రీ ద్వారకాధీశ్ / ద్వారకానాద్ మందిర్



జగమేలే పరమాత్ముడు పూరీలో జలభద్ర సుభద్రలతో కూడి ప్రపంచాన్ని భద్రంగా చూస్తుంటే, పశ్చిమ సముద్రతీరంలో ద్వారకాధీశుడు స్వర్గానికి, మోక్షానికీ ద్వారం చూపిస్తూ ఆత్మవతి అయిన రుక్ష్మిణీ దేవికి తన అంతర్యం చెప్పుకుంటూ ఉంటాడు. ఇలా పశ్చిమ సముద్ర తీరాలలో శ్రీ కృష్ణ దివ్యక్షేత్రాలు నెలకొని ఉండటం ఈ పుణ్య భూమి విశేషం.



ద్వార (తలుపు) మరియు కా (బ్రహ్మ) అనే రెండు పదాల నుండి వచ్చిన 'ద్వారక' అనే పేరు 'బ్రహ్మతో ఆధ్యాత్మిక కలయికకు ప్రవేశ ద్వారం'.  


🔔 స్థలపురాణం 🔔


💠ప్రస్తుత ఆలయం 1500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. నిజమైన ద్వారక సముద్రంలో మునిగిపోయింది.

శ్రీకృష్ణుని ద్వారకా  సముద్ర గర్బంలో ఇంకా వుందని పరిశోధకుల అభిప్రాయం


💠ద్వారక శ్రీకృష్ణుని దివ్య క్షేత్రాలలో అతి విశిష్టమైంది. గుజరాత్ లోని ఈ దివ్యధామం శ్రీకృష్ణుని పాదస్పర్శతో పునీతమైందిగా విశ్వసిస్తారు. జరాసంధుని బారినుండి తప్పింకొనేందుకు ఈ నగరాన్ని నిర్మించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడి ద్వారకాధీశుని మందిరం అతి పురాతనమైంది.


💠మోక్షదాయకములైన సప్తపురములలో ఒకటి అయిన "ద్వారక"  భారతదేశములో నాలుగు మూలాలు వున్న నాలుగు ధామాలలో ద్వారక ధామము ఒకటి. మిగతావి రామేశ్వరం, పురీ జగన్నాధ్, బదిరీనాధ్ ధామం.

భారతదేశంలో ఉన్న హిందువుల ఏడు పవిత్ర క్షేత్రాలలో ద్వారకాపురి ఒకటి.


💠మధుర పురజనుల యోగ క్షేమములు దృష్టిలో నుంచుకొని , జన నష్టము , ధన నష్టము మధురలో కలుగ నీయకుండుటకై గొప్ప యోచన చేసి శ్రీకృష్ణుడు దుర్భేద్యమగు రీతిలో పశ్చిమ సముద్రమున ఒక గొప్ప నగరమును దేవశిల్పి అయిన విశ్వకర్మ చేత నిర్మింపజేశాడు.

 అదే ఈనాటి " ద్వారక "


💠ద్వారక చేరిన కొన్ని నాళ్లకు బ్రహ్మదేవుని ఆజ్ఞను అనుసరించి రైవతుడు అను రాజు తన కుమార్తె రేవతిని బలరామునకిచ్చి వివాహము చేసెను .

 తరువాత శ్రీకృష్ణుడు భీష్మక మహారాజు కుమార్తె అయిన రుక్మిణీ దేవిని రాక్షస వివాహ రీతిలో వివాహము చేసికొని ద్వారకకు కొనిపోయెను . 

 రుక్మిణి శ్రీమహాలక్ష్మిlvv0v అంశము , శ్రీకృష్ణుని పట్టపురాణి అయినది . 


💠తదుపరి సత్యభామ , జాంబవతి , కాళింది , భద్ర ,లక్షణ ,మిత్రవింద , నాగ్నజితి అనువారిని శ్రీకృష్ణుడు వివాహము చేసికొనెను . 

 ఆ విధముగా అష్ట భార్యలతో ద్వారకలో శ్రీకృష్ణుడు యాదవులతో గొప్ప జీవితమును గడపుచుండెను . 


💠ద్వారక లో ఉన్నప్పుడే  సత్యభామా సమేతుడై నరకాసురునితో యుద్ధమున వధించి,  నరకుని మందిరములో ఉన్న 16,000 మంది అందగత్తెలు అయిన రాజకన్యలను అంతఃపురమునకు చేర్పించుకొని, తరువాత శాస్తోక్తముగా వివాహము చేసికొనెను.


💠ద్వారక లోనే పారిజాత వృక్షమును స్వర్గము నుండి తెచ్చుట .ఆ దేవతలందరితో యుద్ధము చేసి దేవేంద్రుని తరిమిగొట్టుట , ద్వారక లోనే  పరమ భాగవతోత్తముడైన బాల్యమిత్రుడు సుదాముడు ( కుచేలుడు ) దారిద్ర్య బాధవలన భార్య పంపున రాగా అతని నుండి పిడికెడు అటుకులు అతి ప్రీతితో ఆరగించి సకల సంపదలను మోక్షమును అనుగ్రహించుట .


💠ద్వారక లోనే అర్జునునిచే ఖాండవ దహనము చేయించి గాండీవమును అక్షయ తూణీరములను సంపాదించి పెట్టుట , మహాభారత యుద్ధమున సర్వము తానే అయి ధర్మ సంస్థాపనార్థము పాండవుల పక్షమున ఉండి కౌరవులను నిర్జింపచేసి భూభారమును తగ్గించి ధర్మరాజును రాజ్యాభిషిక్తుని చేయుట . ఇంకను ఎన్నియో కలాపముల రచన ఈ ద్వారకా నగరమున ఉండియే కావించి నిర్వహించెను . 


💠 ద్వారక లోనే తన అవతార సమాప్తి సమయమున   నిర్వికారుడై ప్రభాస తీర్థమునకు పోయి ఒక చెట్టు క్రింద కూర్చుని యుండి తన పాదము ఒక కిరాతకునికి  పక్షి వలె కనిపించునట్లు ఉంచి ఆ కిరాతకుడు బాణము వేయగా దేహమును వీడి అవతార సమాప్తి గావించుకొని శ్రీవైకుంఠమునకు పోయెను .

ఈ మహోత్తర ఘట్టం కూడా ద్వారక లోనే.


💠 శ్రీకృష్ణ నిర్యాణము తరువాత ద్వారక సముద్ర గర్భములో కలిసి పోయెను .

ఆ సముద్ర మధ్యమమును బేట్ ద్వారక అని ప్రస్తుతము వ్యవహరించుచున్నారు . లాంచిలో దర్శించ వచ్చును . సముద్రాంతరమైన ద్వారక మనకు కనిపించదు . ఒక చిన్న ద్వీప భాగమున బేట్ ద్వారకలో శ్రీకృష్ణ మందిరము ఉన్నది


💠 ఈ ఆలయం తెల్లవారుజామున 5 గంటల నుండి  తెరవబడుతుంది.

ఉదయం చిన్నపిల్లవాడిగా, మద్యాహ్నం  రాజుగా ఆ తరువాత పురాతన వృద్ధ మహర్షిగా దర్శనం ఇస్తారు.


💠 స్వర్గద్వారం, మోక్షద్వారం రెండు ద్వారాలలో ఆలయంలోకి ప్రవేశమార్గం ఉంది. గర్భ గుడిలో 4 భుజాలతో విలసిల్లే త్రివిక్రమమూర్తి  ఉన్నారు. 

ఆలయం సమీపంలో బలరాముడికి,ప్రద్యుమ్న, అనిరుద్దలకూ, శివ కేశవులకూ ప్రత్యేకమైన పూజాస్థానాలు ఉన్నాయి. 

దేవకి, రాధ, బాంబవతి, సత్యభామా,శంఖ చక్రములను ధరించిన శ్రీకృష్ణుడు , కళ్యాణ కృష్ణ సన్నిధి, లక్ష్మీనారాయణ సన్నిధి ,దేవకి సన్నిధి , జాంబవతి సన్నిధి కలవు .


💠 రుక్ష్మిణీ దేవికి మాత్రం ద్వారకాధీశ మందిరానికి దూరంగా ప్రత్యేకమైన ఆలయం ఉంది. 

గోమతి సముద్రంలో కలిసే చోటున ద్వారకాధీశుని ఆలయం ఉంటే దానికి 2 కి.మీ. దూరంలో రుక్ష్మిణి ఆలయం ఉంది.

కామెంట్‌లు లేవు: