3, జూన్ 2024, సోమవారం

శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం*

 🕉 *మన గుడి : నెం 337*


⚜ *కర్నాటక  :-*


*కుక్కే - దక్షిణ కన్నడ ప్రాంతం*


⚜ *శ్రీ కుక్కే సుబ్రహ్మణ్యస్వామి ఆలయం*


💠 పార్వతీదేవి, లయకారకుడు పరమేశ్వరుల రెండో పుత్రరత్నం శ్రీ సుబ్రమణ్యస్వామి. 

నెమలిని వాహనంగా వేలాయుధాన్ని చేతబూని యావత్‌ దేవతా సైన్యానికి ఆయన సేనానిగా వ్యవహరిస్తారు. 

తన కంటే పెద్దవాడయిన విఘ్నేశ్వరునితో కలిసి అనేక శిష్టరక్షణ కోసం అనేక యుద్ధాలు చేశారు. షణ్ముఖుడికి దక్షిణ భారతంలో గుడులు ఎక్కువగా వున్నాయి.

 వీటిలో మహిమాన్వితమైనది కర్ణాటకలోని కుక్కెలో వెలసిన శ్రీసుబ్రమణ్యస్వామి ఆలయం.


💠 సుప్రసిద్ద శ్రీ కుక్కే సుబ్రమణ్యస్వామి దేవస్థానం కర్నాటక రాష్ట్రం , దక్షిణ కన్నడ జిల్లా, సుల్ల్య తాలూకా లోని సుబ్రమణ్య అను గ్రామములో ఉన్నది. ఇక్కడ కార్తికేయుడిని సర్పదేవుడు సుబ్రమణ్యునిగా భక్తులు ఆరాధిస్తారు.


💠 ఈ సుబ్రహ్మణ్య ఆలయం గురించి ‘స్కాందపురాణం’లో సనత్కుమార సంహితలోని సహ్యాద్రికాండలోని తీర్ధక్షేత్రమహామణి పురాణంలో తెలుపబడింది.

తన దిగ్విజయ ధర్మయాత్రలో భాగంగా శ్రీ ఆది శంకరాచార్యూలవారు కొన్ని రోజులు ఇక్కడ గడిపినట్టు "శంకర విజయం" చెప్తున్నది.


🔆 స్థలపురాణం :


💠 పూర్వం తారకుడు, సూర పద్మాసురుడు అనే అసురులను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన శక్తి ఆయుధంతో సంహరించాడు. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. 

దీంతో ఈ నదిని " కుమారధార" అని పిలుస్తారు. 


💠 ఆ తరువాత ఈ కుమారధార పర్వతశ్రేణులలో గణపతి మున్నగు దేవతలతో కుమారస్వామి విశ్రాంతి తీసుకున్న సమయంలో ఇంద్రుడు తన కుమార్తెను వివాహం చేసుకొమ్మని కోరగా ఆయన అంగీకరిస్తాడు

రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు.

 సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. 


💠 నాగులకు రక్షకుడు: 

నాగులలో శ్రేష్టుడు వాసుకి. 

ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. 

గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో కఠోరమైన తపస్సు చేశాడు. తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. 

దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. 

ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు వుంటాయి.


💠 ప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిల పైన వుండి పూజలను అందుకుంటారు. 

సర్పదోష నివారణ పూజలకు ఈ క్షేత్రం ప్రసిద్ధి. సర్ప సంస్కార, నాగ ప్రతిష్ట, ఆశ్లేషబలి తదితర పూజలను నిర్వహిస్తారు.


💠 శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. 

స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.


💠 ఈ ఆలయంలో అనేక పండుగలు జరుపుకుంటారు. 

షష్ఠి, కీరు షష్టి, నాగ పంచమి, నాగారాధనే పండుగలకు ఎంతో గౌరవం ఉంటుంది. 

అంతే కాకుండా ఉగాది, దీపావళి, మకర సంక్రాంతి ముఖ్యమైన పండుగలు.


💠 కుక్కే సుబ్రమణ్య ఆలయంలో సర్ప (పాము) దోషం (శాపం) లేదా సర్పముల వలన వచ్చే ప్రతికూల బాధలు తొలగిపోతాయి. 

ఈ శాప విముక్తి కోసం చాలా మంది భక్తులు ఈ పూజలో పాల్గొంటారు. 

సంతానం లేని దంపతులకు సంతానాన్ని ప్రసాదించడానికి నాగప్రతిష్ట పూజ కూడా చేస్తారు. 

కాబట్టి ఈ ఆలయంలో సర్పాల వల్ల జీవితంలో ఎలాంటి సవాళ్లు వచ్చినా అవి తొలగిపోతాయని నమ్ముతారు.


🔆 ఆశ్లేష బలి పూజ:


💠 శ్రీ క్షేత్రం కుక్కే సుబ్రమణ్య దేవస్థానంలో జరిగే అతి పెద్ద కాలసర్ప దోష పూజ ఈ ఆశ్లేష బలి పూజ. సుబ్రమణ్య స్వామి కాల సర్ప దోషము మరియు కుజ దోషముల నుండి భక్తులను రక్షిస్తాడు.


💠 ఆశ్లేష బలి పూజ ప్రతి నెల ఆశ్లేష నక్షత్ర దినాలలో జరప బడుతుంది. భక్తులు శ్రావణ, కార్తీక, మృగశిర మాసాలను ఈ పూజ చెయ్యటానికి అత్యంత పవిత్రంగా భావిస్తారు. 


🔆 సర్ప సంస్కార / సర్ప దోష పూజలు : 


💠 సర్ప దోషము నుంచి విముక్తి పొందటానికి భక్తులు ఈ పూజను చేస్తారు. ఒక వ్యక్తి ఈ జన్మలో కానీ లేక గత జన్మలో కానీ , తెలిసి కానీ, తెలియక కానీ పలు విధములలో ఈ సర్ప దోష భాధగ్రస్టుడు అయ్యే అవకాశం ఉంది. 

సర్ప దోష బాధితులకు పండితులు ఈ సర్పదోష నివారణ పూజను విముక్తి  మార్గంగా సూచిస్తారు.


💠 స్వామి వారికి జరిగే మడెస్నానం ఒక ముఖ్యమైన సేవ. నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్ మొదటి వారంలో నిర్వహించే చంపా షష్టి వేడుక లేదా ఉత్సవం నాడు మూడు రోజులపాటు 'మాడే స్నాన' జరుపుతారు.

ఇక్కడ లభించే మట్టి ప్రసాదం చాలా విశేషం.


💠  ఎలా చేరుకోవచ్చు..

బెంగుళూరు నుండి కుక్కే సుబ్రమణ్య 280 కి.మీ మరియు మంగళూరు నుండి 105 కి.మీ. 

కామెంట్‌లు లేవు: