*దేవాలయాలు - పూజలు 16*
సభ్యులకు నమస్కారములు.
*ప్రదక్షిణ (1)*
దేవాలయాలు - పూజలు సందర్భంగా దైవ *ప్రదక్షిణలకు* గూడా ఎనలేని ప్రాముఖ్యత గలదు. ఇంకా చెప్పాలంటే *ప్రదక్షిణ రహిత* దేవాలయ పూజలు అసంపూర్తిగా మిగిలిపోతాయి. ప్రదక్షిణ అను పదానికి సామాన్య అర్థం పరిక్రమమం లేదా భ్రమణ లేదా తిరగడం. వలయాకారంగా కుడి వైపు తిరగడం. భగవద్ ఉపచారాలలో ప్రదక్షిణం కూడా అత్యంత ప్రాముఖ్యత కల్గిఉన్నది. ప్రదక్షిణ పదం యొక్క అర్థాలను గమనిద్దాము. సంస్కృతంలో దక్షిణ అంటే *కుడి* *ప్ర* కున్న నానర్థలలో గతి = త్రోవ, నడక, దిక్కు, మార్గము అన్ని వెరసి ప్రదక్షిణ అంటే కుడి వైపు నడక. శ్రీ రమణ మహర్షుల వారి విశ్లేషణ ప్రకారం.. *ప్ర* అను అక్షరం సమస్త పాపాల వినాశనానికి సూచకం, *ద* అంటే కోరికలను తీర్చగలరు, *క్షి* అన్న వర్ణం రాబోయే జన్మల క్షయాన్ని (నాశనాన్ని) తెలియజేస్తుంది, *న* అంటే అజ్ఞానము నుండి విముక్తి.
ప్రదక్షిణలో ఉన్న మూలార్థము తెలుసుకుందాము. ఆలయంలో ఉన్న దైవం విశ్వ శక్తి కేంద్ర బిందువు కు ప్రతీక. ఆయన చుట్టూ కట్టబడి ఉన్న ఆలయం అనంత విశ్వానికి సంకేతము. ప్రదక్షిణ సంప్రదాయంగా పరమాత్ముని చుట్టూ వలయాకారంగా, సవ్య దిశలో చేయడంవలన, జన్మ జన్మలలో చేసిన దుష్కర్మ ఫలితాల విరగడ జరుగుతుంది. అంతే కాకుండా క్రమం తప్పకుండా, ప్రతి రోజూ దేవాలయ సందర్శనచేసి అత్యధిక ప్రదక్షిణలు చేయడం వలన రానున్న జన్మల దుష్కర్మ ఫలితాలను గూడా నివారించు కొనవచ్చును.
*పరమేశ్వరుని చుట్టూ పరిభ్రమణము వలన జరుగు కర్మ క్షయమే ప్రదక్షిణల పరమార్థం*.
*వైష్ణవ ఆలయాలలో ప్రదక్షిణలు* దేవాలయాలలో ప్రవేశించిన తరువాత పాద ప్రక్షాళన చేసికొని ధ్వజ స్తంభం ఉన్న చోటున కొంచెం 30° ఉత్తరాభిముఖంగా సాష్టాంగ దండ ప్రణామం మొగవారికి మాత్రమే అవకాశం వుంది. స్త్రీ మూర్తులకు, బాలికలకు సాష్టాంగ నమస్కార నియమము లేదు. భక్తులు మొదటగా ప్రదక్షిణలు అనంతరం గరుడాళ్వారుకు నమస్కారం చేసి,
ఆలయం కుడివైపు నుండి ముఖ మండపంలో ప్రవేశించి క్షేత్ర పాలకుడైన హనుమంతుడు/గరుత్మంతుని దర్శించి తరువాత ద్వార పాలకులుగా ఉన్నజయ విజయులుకు నమస్కారం చేసి తదుపరి ఆ క్షేత్ర అమ్మవారి ని దర్శించి తరువాత గుడిలోని ప్రధాన దేవుణ్ణి దర్శించి విన్నపాలు అనంతరం తీర్థం శఠగోపం మరియు ప్రసాదాలదైవత్వం స్వీకరించిన తర్వాత ఓ రెండు నిమిషాలు ఆ గుడి దేవుని విశేషాలు కూర్చుని తలచుకుని ఆనందించే ప్రయత్నం చేస్తారు. ఆయనకు (భగవంతుని) కృతజ్ఞతలు తెలిపి తిరిగి భక్తులు తమ తమ దైనందిన జీవితంలో ప్రవేశిస్తారు.
*శివాలయాలలో ప్రదక్షిణలు* చండీశ్వరుడున్న శివాలయాలలో ప్రదక్షిణ విధానాన్ని చండీ ప్రదక్షిణ అంటారు. శివాలయాలలో ప్రదక్షిణలకు ఒక ప్రత్యేక నియమము పాటించాల్సి ఉంటుంది. ముందుగా శివ లింగానికి లేదా చిత్తరువుకు నమస్కారం చేసి సోమ సూత్రం వరకు మాత్రమే ప్రదక్షిణ చేసి తిరిగి శివ లింగ దర్శనమునకు రావల్సి ఉంటుంది. ఈ ప్రదక్షిణ *అర్ధ వృత్తాకారంలో మాత్రమే ఉంటుంది*.
వృత్తాకార ప్రదక్షిణలు
ఈ దేవాలయాలలో సంప్రదాయము కాదు.
ధన్యవాదములు.
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి