*దేవాలయాలు - పూజలు 4*
సభ్యులకు నమస్కారములు.
ఇష్ట దేవతలను దర్శించడానికి, *భక్తి మరియు ధ్యాన పూర్వకంగా* పూజలు మరియు *భగవదవతార విశేషాల కీర్తనలకు సంబంధించి* భజనలు చేయడానికి దేవాలయాలకు వెళ్ళడం మన సంప్రదాయం. గత వ్యాసాలలో తెలుసుకున్నట్లుగా మన పూర్వీకులు *నిర్దేశిత ప్రాంతాలలోనే* దేవాలయ నిర్మాణాలకు ఉపక్రమించేవారు. కాని ప్రస్తుత కాలంలో భక్తి భావన పెరిగి నేతలు, దాతలు ముందుకు వచ్చి భక్తి ప్రపత్తులతో తమ తమ ప్రాంతాలలో వివిధ దేవాలయాలను నిర్మిస్తున్నారు. భగవత్ తత్వాన్ని తమ అందుబాటులోకి తెచ్చుకుంటున్నారు. అదే విధంగా ప్రఖ్యాత దేవాలయ సంస్థల వారు మరియు పీఠాధిపతులు గూడా తమ ఇష్ట దేవతా మూర్తుల ఆలయాల నిర్మాణాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. *ప్రధాన దేవాలయ ప్రాంగణంలోనే వివిధ దేవీ దేవతల ఉప దేవాలయ సముదాయాలు గూడా ఉంటున్నవి*
ప్రతి రోజు దేవాలయం వెళ్లి పూజలు చేసే వారు అరుదనే చెప్పాలి. అవుతే వారానికి ఒకసారైనా దేవాలయానికి వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పవచ్చును. హిందు మతారాధకులలో వేర్వేరు దేవుళ్ళను నమ్మేవాళ్ళు ఉంటారు. *పూజలలో రెండు ప్రమాణములు*.
1) భగవత్ పూజలు
2) క్షుద్ర పూజలు.
ఈ వ్యాసావళిలో *భగవత్ పూజల గురించి మాత్రమే తెలుసుకుందాము*.
ముందుగా పూజలు ఎందుకు చేయాలి అను అంశమును పరిశీలిద్దాము. పూజల వలన మానవులలో భక్తి ప్రపత్తులు (శ్రద్ధ) వర్ధిల్లి దేవుడి యందు ఏకాగ్రత బలపడుతుంది. ఏకాగ్రత వలన సంకల్ప బలం, మనో దృఢత్వం, ప్రశాంత లభిస్తాయి.
దేవాలయాలలో ప్రతిష్టింపబడిన *మంత్రశక్తి*, *యంత్రశక్తి* మరియు *తంత్ర శక్తి* ని
(శిల్ప నిర్మాణ సౌందర్యం, మంత్రానుగుణమైన ధూపదీప క్రియాకలాప *ముద్రల శక్తి*, తీర్థం, శఠగోపం మరియు ప్రసాదాలదైవత్వ శక్తి ని భక్తులు ఆస్వాదిస్తూంటారు.
హిందూ దేవాలయాలను రెండుగా విభజింవచ్చని తెలుసుకున్నాము.
1) గ్రామ దేవతా గుడులు.
2) శిష్టాచార దేవాలయాలు. హిందూ సంప్రదాయంలో *ముక్కోటి దేవతలు* అని శాస్త్ర వాక్యము. దేవుడొక్కడే కదా ఇంత మంది ఏల ? అని అన్యమతస్తుల / నాస్తికుల విమర్శలను గమనిస్తూనే ఉన్నాము. ఇందుకు ధీటైన సమాధానము ఋగ్వేదంలో లభిస్తున్నది.
ఋగ్వేద మంత్రము.
*ఇంద్ర మిత్రం వరుణమగ్ని మహురథో దివ్య సుపర్ణో గరుత్మాన్, ఏకం సత్ విప్రా బహుధా వదంతి అగ్ని యమం మాత రిశ్వాన మాహు:*
అర్థం:- ఉన్నది ఒకే సత్ (శాశ్వతమైన సత్యం - పరమాత్మ). ఈ సత్యాన్నే విశేష ప్రజ్ఞ కలవారు...ఇంద్రుడని, మిత్రుడని, అగ్ని అని, దివ్యమైన పక్షాలు గల గరుత్మంతుడని, యముడని, వాయువని వర్ణిస్తూ ఉంటారు.
*ఒకే* పరమాత్మ *వివిధ శక్తుల వ్యక్తీకరణతో* వివిధ దేవతలుగా చెప్పబడుతున్నారు. ఏకత్వ వాదాన్ని ఋగ్వేదం స్పష్టం చేసింది. *బహు దేవతలు ఒకే పరమేశ్వరుని శక్తులు*. అందుకే భిన్నత్వంలో (అనేకత్వంలో) ఏకత్వాన్ని సమన్వయించే సంస్కృతి మనది.
*మాన్యులకు విజ్ఞప్తి*
*దేవాలయము - పూజలు* అను విషయముపై ధారావాహిక రచనా వ్యాసంగము బహు సున్నితమే గాక విస్తృతము, క్రమానుసారమైన, ప్రామాణిక, సుస్థాపిత విశేశ్య అంశము గనుక, ఈ గ్రూప్ లోని మాన్యులు...ఈ రచనలలో అన్యమైన, అసంగత, అసంబద్ధ, అప్రస్తుత, అనంగీకార ప్రస్తావనలు ఉంటే తెలుపగలరు, సరిదిద్దగలరు.
*తస్మాత్ సర్వాస్వవస్థాసు రక్షేత్ జీవిత మాత్మనః*,
*ద్రవ్యాణి సంతతిశ్ఛైవ సర్వం భవతి జీవితః*
అర్థం :- సర్వకాల సర్వావస్థలలోనూ తన జీవితాన్ని రక్షించుకోవడానికి ప్రయత్నించాలి. బ్రతికి ఉంటేనే ద్రవ్యాలు, సంతానం మరియు ఏదైనా పొందే అవకాశం ఉంటుంది. = ఉపద్రవాలు రాక ముందే మేల్కోవాలి.
ధన్యవాదములు
*(సశేషం)*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి