8, ఆగస్టు 2024, గురువారం

కర్మణ్యేవాధికారస్తే

 🙏


*శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా అంటున్నారు.*


శ్లో//కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన/

మా కర్మ ఫల హేతుర్భూర్మా తే సంగో౽స్త్వకర్మణి// (భగవద్గీత అ.2.శ్లో 47).


*ఈ శ్లోకము, దీనికి సంబంధించిన ఇతర శ్లోకముల సారాంశము ఇది:*

*నీకు కర్మలు చేయుటయందే అధికారము ఉన్నది కానీ ఆ కర్మఫలముల యందు అధికారము లేదు.*

ఒక కర్మ ఫలించుటకు,

పంచభూతములు, 

కాలము,

జీవుడు,

శరీరనిర్మాణము, 

ఐదు జ్ఞానేంద్రియాలు, 

ఐదు కర్మేంద్రియాలు, 

బుద్ధి, మనస్సు,ప్రాణాపానాది పంచ వాయువులు,వాటి చేష్టలు,

దైవము అనబడే ఇంద్రియాధిష్ఠాన దేవతలు,

మొదలైన అనేక విషయములు కారణభూతములు అవుతాయి.

ఆ విధంగా కర్మఫలములు నీ ఆధీనంలో లేవు కాబట్టి, ఫలితములు ఆశించి కర్మ చేయవద్దు. ఫలితములయందు ఆశ ఉంటే ఆ కర్మఫలితములు లభించడానికి నీవు కూడా కారణం అయి,కర్మఫలములు అనుభవిచడానికి జన్మలు ఎత్తవలసి వస్తుంది.

కాబట్టి కర్మఫలములను ఆశించి, ఆ ఫలితములను అనుభవించుటకు నీవు కారణము గావలదు. ప్రకృతి ధర్మం వల్ల ఒక్క క్షణమైనా ఎవడూ కర్మ చెయ్యకుండా ఉండలేడు. జన్మ పునర్జన్మలను కలిగించే కర్మ బంధములనుండి విముక్తుడ వవటానికి ఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యాలి. అందువల్ల కర్తవ్య కర్మలను చెయ్యకుండా సోమరిగా వుండాలనే బుద్ధి కూడా నీకు ఉండకూడదు). కర్మలు ఆచరించే విషయంలో పై బోధ మనకు మార్గదర్శకంగా ఉండాలి. ప్రజలు చేసిన పాపం, ప్రభుత్వానికి అంటే పాలకులకు సంక్రమిస్తుంది అని శాస్త్రం చెబుతోంది. అందువల్ల ప్రజలు పాపకర్మలు చెయ్యకుండా,ధర్మమార్గంలో నడిచేటట్లు చూసే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రజలలోను,పాలకులలోను పాపభీతి ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ప్రస్తుతం  పాపభీతి అనేది మృగ్యం అయిపోయింది.

కోరికలను తీర్చుకొనేందుకు, లేదా  కష్టాలు వస్తే తొలగించుకొనేందుకు,  గుళ్లు గోపురాలు చుట్టూ తిరగటం తప్ప, పాపభీతిగాని, భగవంతునియందు నిజమైన భక్తి శ్రద్ధలుగాని,  చాలామందిలో లోపిస్తున్నాయి. దీనికి కారణం, పుణ్య, పాపాలు,జన్మ, పునర్జన్మలు,మొదలైనవాటిని గురించి ఏవో నోటిమాటలు చెప్పడం తప్ప,వాటిమీద దృఢమైన నమ్మకం ఎవరికీ  లేక పోవడమే. మనం పోస్టులు పెట్టినంత మాత్రాన, లేదా ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు, పాలకులు మారుతారు అని మనం అనుకోనక్కర లేదు. మనం ఎవర్ని ఉద్ధరించడానికీ పుట్టలేదు. సత్యము, ధర్మములతో కూడిన సత్కర్మానుష్ఠానంద్వారా భగవంతుని అనుగ్రహం సంపాదించుకొని,

మానవజన్మను సార్ధకం చేసుకోటానికి జన్మించాము.

శక్తివంచన లేకుండా కృషి చెయ్యడం మాత్రమే మన కర్తవ్యం. ఫలితం భగవంతుడి చేతిలో ఉంది.

🕉️🙏

కామెంట్‌లు లేవు: