8, ఆగస్టు 2024, గురువారం

భగవద్గీత పారాయణం

వందేమాతరం 


*భారతీయులందరికీ భగవద్గీత పారాయణం అవశ్యం*


నేటి సామాజిక దేశకాల పరిస్థితుల్లో నిర్లప్తతతో నిద్రాణమై ఉన్న భారతీయులు మొదటిగా మానసికముగా శక్తివంతులు కావలసిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే వారు ఇంటా బయటా ముప్పెటి దాడికి గురవుతున్న హిందూ ధర్మము మరియు భారతజాతి పటిష్టతపై దృష్టి కేంద్రీకరించగలరు. ఈ సందర్భంగా మనము శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను ఎందుకు ఉపదేశించాడు అని ఆలోచిస్తే మనకు పరిష్కార మార్గం కనిపిస్తుంది.


శ్రీకృష్ణుడు అర్జునునకు చేసిన ఉపదేశానికి మూలం అర్జునుడు యుద్ధరంగం నుండి వెనుకకు మరలిపోకుండా యుద్ధం చేసేటట్లు చేయడమే. అందరూ నా వారే అన్న ఒక బలహీనమైన దృష్టితో అధర్మాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు సంశయిస్తున్న సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుని అధర్మంపై యుద్ధానికి మానసికంగా సిద్ధం చేయడం కోసం ఈ ఉపదేశం చేశాడు. భగవద్గీత తాత్విక గ్రంథమే కాదు మానసికమైనది కూడా. అయితే దానిని అర్జునుని ప్రభావితం చేయడం కొరకు శ్రీకృష్ణుడు అనేక విషయాలు క్రోడీకరించి చెప్పవలసి వచ్చింది. అర్జునుడు శోకసంవిగ్నమానసుడై యుద్ధం చేయనంటూ ధనుస్సూ బాణాలు దూరంగా పడవేసి రథంమీద చతికిలబడతాడు. అప్పుడు అతనిని మామూలు స్థితికి తీసికొని రావడంకోసం శ్రీకృష్ణుడు -


 *"కుతస్త్వా కశ్మలమిదం విషమే సముపస్థితమ్.. క్షుద్రం హృదయదౌర్బల్యం త్వక్త్వోత్తిష్ఠ పరంతప"* అని ఉద్బోధించాడు.


 అయితే - అర్జునుడు, శంకరభగవత్పాదుల మాటలలో చెప్పాలంటే- “శోకమోహ మహోదధిలో నిమగ్నుడై" ఉండడంచేత ఈ మాటలు అతని చెవికెక్కలేదు. అందుచేత అర్జునుని శోకమోహాలు సమూలంగా తొలగించడానికై ఆత్మ జన్మజరామరణాది రహితమైనది అని ఆత్మకు సంబంధించిన పరమార్థసత్యాన్ని ఉపదేశించవలసి వచ్చినది. ఈ పరమార్థ సత్యం నివృత్తిమార్గంతో ముడివడి ఉంది. "అయితే ఇంకేమి, నేను ఈ నివృత్తిమార్గంలోనే ఉంటాను; ఈ విధంగా కూడ నేను యుద్ధం చేయవలసిన పనిలేదు కదా? అని అర్జునుడు ఎక్కడ అనుకొని తన భావాలను సమర్ధించుకుంటాడో అన్న అనుమానంతో శ్రీకృష్ణుడు ఈ నివృత్తిమార్గం అందరికీ వర్తించేది కాదు, నీకు కూడ దీనియందు ప్రస్తుతం అధికారం లేదు. కొన్ని వేలమందిలో ఏ ఒక్కరికో తప్ప ఇది ఉపయోగించదు. దానికి అధికారం సంపాదించే వరకు నీతో సహా అందరూ కర్మయోగాన్ని అనుసరించవలసిందే అని స్పష్టీకరిస్తూ కర్మయోగాన్నీ, తత్సంబంధిత అనేక విషయాలనూ చెప్పవలసి వచ్చింది. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునునకు ధర్మద్వయం (వైదికమైన ప్రవృత్తి - నివృత్తి మార్గాలు రెండింటినీ) ఉపదేశించాడు. దానితో అర్జునుణ్ణి యుద్ధప్రవృత్తుని చేయడం అనే ప్రయోజనం నెరవేరింది.


అధర్మ మార్గంలో నడుస్తున్న తనవారిని బంధానుబంధాలనే మోహాచక్రంలో పడి సహించడం సారి కాదని, వారిని శిక్షించడమే ధర్మమని, ధర్మరక్షణకై అది అనివార్యమనే భగవద్గీత సారాన్ని శ్రీకృష్ణుడు తెలియజేశారు. 


భగవద్గీత గొప్పతనం ఏమిటంటే అది ఏ కాలానికి అయినా అప్పటి కాలమాన పరిస్థితులకు అన్వయింపుగానే ఉంటుంది.


కాబట్టి అందరూ సమానమే, అన్ని మతాలు సమానమే, అన్ని గ్రంథాలు సమానమే అనేటువంటి ధోరణిలో స్వధర్మం వివక్షకు లోనవుతున్నా, విద్వేషాలకు గురౌవతున్నా స్పందించని హైందవ సమాజాన్ని మేల్కొలిపి సంఘటితం చేయాలి అంటే ప్రతీ ఒక్కరికీ భగవద్గీత పారాయణం అనివార్యం. 


దేశం గురించి, ధర్మం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు ఈ విషయమే తమ వంతు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


మృశి

07.07.2024

9849794167

కామెంట్‌లు లేవు: