*సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నోటీసులు పంపలా..*
*ప్రభుత్వాల తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం*
*ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదు*
*ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పిలిచి విచారించలేం*
*ఇది ప్రజల స్వేచ్ఛా హక్కును హరిస్తోంది*
*ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ఉంటుంది*
రాజకీయ నాయకులపై సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరంగా పోస్టులు చేశారంటూ దేశంలోని అనేక రాష్ట్రాల్లో పౌరులకు సమన్లు పంపి, విచారిస్తోన్న ఘటనలు అధికమవుతున్న నేపథ్యంలో దీనిపై పోలీసులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు తలంటింది. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు చేస్తోన్న వారిపై ఇటువంటి చర్యలు తీసుకోవడం సరికాదని చెప్పింది.
పౌరులపై ఇటువంటి కేసులు పెట్టి దేశంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి పిలిచి విచారించలేమని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేయట్లేదంటూ ఢిల్లీకి చెందిన రోషిణి బిస్వాస్ (29) అనే మహిళ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టుతో, బెంగాల్ పోలీసులు ఆమెకు సమన్లు జారీ చేశారు.
దీనిపై సంబంధిత వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించగా దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ విషయంపై స్పందిస్తూ ఈ విధంగా కీలక వ్యాఖ్యలు చేసింది. పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం తరఫున లాయర్ వాదనలు వినిపిస్తూ రోషినిని కేవలం ప్రశ్నించామని, అరెస్ట్ చేయలేదని చెప్పారు.
దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఇది స్వేచ్ఛా హక్కును హరిస్తోందని వ్యాఖ్యానించింది. కరోనా మహమ్మారి వ్యాప్తిని సరిగ్గా అడ్డుకోలేదంటూ విమర్శించినందుకు ఒకరిని విచారించలేమని తెలిపింది. అయితే, స్థానిక కోర్టు ఆదేశాలతోనే ఆమె తప్పనిసరిగా హాజరుకావాలని పోలీసులు నోటీసు పంపారని ప్రభుత్వ తరఫున లాయర్ వాదించారు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఆమెను విచారిస్తామని అన్నారు. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ ఢిల్లీ నుంచి కోల్‌కతాకు ఆమెను పిలవడం పూర్తిగా వేధించడమే అవుతుందని చెప్పింది.
కోల్‌కతా, ముంబై, మణిపూర్, చెన్నై పోలీసులు దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలను విచారణ పేరుతో పిలిపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించింది. 'వాక్ స్వాతంత్య్రం కావాలని కోరుకునేవారికి ఒక పాఠం నేర్పుతామన్నట్లుంటుంది..' అంటూ కోర్టు కామెంట్ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఎ) ప్రకారం ప్రతి పౌరుడికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందిరా బెనర్జీల ధర్మాసనం గుర్తు చేసింది.
ఈ పరిధిదాటి ఎవరూ ప్రవర్తించకూడదని, భారత్‌ను స్వేచ్ఛాయుత దేశంగా ఉండనివ్వాలని చెప్పింది. దానిని రక్షించడానికే సుప్రీంకోర్టు ఉందని పేర్కొంది. అసలు రాజ్యాంగాన్ని రూపొందించడానికి కారణం సాధారణ పౌరులను ప్రభుత్వాల వేధింపులకు గురికాకుండా చూసుకోవడానికేనని తేల్చిచెప్పింది..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి