29, అక్టోబర్ 2020, గురువారం

-________గురు శిష్యులు_________

 మా నాన్న చిన్నప్పుడు నాకు చిన్నప్పుడు చెప్పిన కథ..

 ఈ కథ ఎక్కడిదో నాకు తెలీదు..


-________గురు శిష్యులు_________

పూర్వ కాలంలో గురు శిష్యులు ఉండేవారు. కొన్ని సంవత్సరాల పాటు గురువు దగ్గర అన్ని రకాల విద్యలు నేర్చుకొని శిష్యుడు జ్ఞానం సంపాదించాడు. తన దగ్గరి నుండి తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లడానికి సమయం ఆసన్నమైంది అని  గురువు శిష్యుడిని పిలిచి ఆశ్రమం నుండి వెళ్లడానికి అనుమతి ఇస్తాడు. 

                     శిష్యుడు గురువు పై ఉన్న గౌరవంతో "గురువుగారూ..! ఇన్నాళ్ళుగా మీ బోధనల వలన నేను అపారమైన జ్ఞానం సంపాదించాను. మీరు నాకందిచిన ఈ జ్ఞానానికి గురు దక్షిణ ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. కానీ స్థాయికి సరిపడేంత విలువైనది ఏదీ నాకు కనిపించడం లేదు.. కనుక మీరు ఏం కావాలో కోరుకోండి.. దాన్ని మీ గురు దక్షిణ గా సమర్పించుకుంటాను." అని గురువుతో పలికాడు. 

               ఆ మాటలు విన్న గురువు చిన్నగా నవ్వుతూ "నాపై నీకున్న గౌరవానికి సంతోషిస్తున్నాను. నాకు ఏమీ అవసరం లేదు. నువ్వు బాధ్యతగా, ధర్మ బద్ధంగా జీవితం కొనసాగించు.. అదే గురుదక్షిణ" అని హితవు పలికాడు.


         శిష్యుడు గురువు మాట వినకుండా " మీరు నన్ను అడిగి తీరాల్సిందే.. మీరు అడిగింది ఎంత కష్టమైనా, ప్రపంచం అంతా గాలించి అయినా సరే తెచ్చి ఇస్తాను. దయచేసి మీకు ఏం కావాలో విన్నవించండి" అని వేడుకున్నాడు.  


            గురువు ఎంత చెప్పినా అతడు వినాకపోయే సరికి గురువు గారు ఇలా అడిగారు. "చూడు నాయనా..! ఈ సృష్టిలో ఎవరికీ, దేనికీ పనికిరానిది ఏదైనా ఉంటే అది నాకోసం తీసుకురా.. నీకు ఎంత సమయం కావాలన్నా తీసుకో.. ఎప్పుడు నీకు నేను అడిగింది దొరుకుతుందో అప్పుడు దాన్ని నాకు గురు దక్షిణగా  సమర్పించు. " అని చెప్పాడు గురువు. 


           గురువు మాటలు విన్న శిష్యుడు "ఏమిటి గురువు గారూ... ! పనికిరాని వస్తువా .. !  నేను ఎంతో కష్టతరమైన కోరిక కోరుతారు అనుకుంటే ఇంత సులభంగా అడిగారేమిటి..? క్షణాల్లో తీసుకొస్తాను" అని శిష్యుడు అక్కడి నుండి సెలవు తీసుకుని వెళ్ళాడు..


   శిష్యుడు వెళ్తూ వెళ్తూ దారిలో ఎండిపోయి రాలిన ఆకుల్ని చూసాడు. ఇవి పనికి రానివే కదా అని గురువుకు ఇద్దాం అని తీసి సంచిలో వేశాడు. కాస్త దూరం నడిచి ఆలోచించాడు.. ఎండిపోయిన ఆకుల వలన లాభం లేకపోలేదు.. వీటిని కాల్చి ఆ మంటతో చలి కాచుకోవచ్చు. లేదా వంట కోసం పొయ్యిలో వేసి మంట వెలిగించ వచ్చు. కనుక ఇవి గురువు గారికి ఇవ్వడం కుదరదు అని సంచిలో నుండి తీసి పారేశాడు. మళ్లీ ఆలోచించి వీటిని కాల్చడం వలన బూడిద వస్తుంది. ఆ బూడిద గురువు గారికి ఇస్తాను అనుకుని వాటిని తగళబెడతాడు. బూడిదను తీసుకెళుతు, దీనితో పాత్రలు శుభ్రం చేయవచ్చు. కనుక ఇది కూడా గురువు గారికి ఇవ్వలేను అని బూడిద విడిచి పెట్టి ముందుకు సాగుతాడు. 

      

     ఈసారి అతడికి ఒక బావి కనపడుతుంది. ఆ బావి దగ్గర పాడుబడిన ఒక చేంతాడు కనపడుతుంది. ఈ తాడు తెగిపోయి ఉంది. కనుక నీళ్ళు తెండడానికి ఇది పనికి రాదు. కనుక అది ఇవ్వాలి అనుకుంటాడు. కానీ ఆలోచించి కనీసం కట్టెలు కట్టడానికైన తెగిన తాడు ఉపయోగపడుతుందని దాన్ని విడిచి పెడతాడు. 


  ఇంకాస్త ముందుకు పోతాడు. చిన్న రాళ్ళ గుట్ట కనపడుతుంది. రాయిని తీసికెళ్ళి ఇద్దాం అని తీసుకుంటాడు. ఇంతలో oka పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న రాయిని తీసుకుని ఆ రాళ్ళ గుట్టకు ఎదురుగా ఉన్న చింత చెట్టు చూసి చింత కాయల్ని కొడతాడు. అది పనికి వచ్చేదే అని విడిచి పెడతాడు.. 

  కొంత దూరం పోయాక విరిగా కుండని దారిలో చూస్తాడు.. పగిలిన కుండ అసలు దేనికీ పనికిరాదు అని సంతోషంగా ఆ పెంకులు గురువుగారికి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇంతలో ఇద్దరు ఆడపిల్లలు వచ్చి ఆ పెంకు ముక్కల్ని తీసుకుని వెళ్తుంటే వాళ్ళని పిలిచి అవెందుకు మీకు అని అడుగుతాడు. మేము ఈ పెంకుముక్కళ్తో తొక్కుడు బిళ్ళ ఆట ఆదుకుంటాం అని జవాబు చెప్తారు. దానితో అది కూడా పనికి వచ్చేదే అని నిరాశగా విడిచి వెళ్ళిపోతాడు. కొన్నాళ్ళు అంతా వెతికి ఎక్కడా ఏమీ దొరకక నిరాశగా గురువు దగ్గరకు వెళ్లి క్షమించమని అడుగుతాడు.

 "గురువుగారూ మీ బోధనల ద్వారా నేను పూర్తి జ్ఞానం సంపాదించా అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసింది.. ఈ సృష్టిలో పనికిరాని వస్తువు ఏదీ ఉండదు.  ప్రతి ఒక్కటీ ఏదో ఒక విధంగా ప్రతి జీవికీ అవసరమైనది. ఒకరికి అనవసరమైన వస్తువు మరొకరికి అవసరమైన వస్తువు అవుతుంది. ఈ విషయాన్ని నేను గ్రహించలేక అంతా తెల్సు అని గార్వపడ్డాను. నన్ను క్షమించండి అని గురువు పాదాలపై పడ్డాడు. 


  బదులుగా గురువుగారు " చూడు నాయనా ఇప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడివి అయావు. నేను జ్ఞాన బోధన మాత్రమే చేశాను. దాని ద్వారా మీరు జీవితాన్ని తీర్చి దిద్దుకోవాలి.. ఆ జ్ఞానాన్ని నలుగురికి ఉపయోగపడేలా నిన్ను నువ్వు తీర్చిదిద్దుకోవాలి. సమాజంలో నీకంటూ ప్రత్యేక స్థానం నువ్వు కలిగి ఉంటే అదే నాకు గురుదక్షిణ అని చెప్పి శిష్యుడిని పంపిస్తాడు. 


గురువు మన నుండి ఏమీ ఆశించడు. మన విజయాన్ని తన విజయంలా భావించి మనకంటే ఎక్కువ సంతోష పడతాడు. అటువంటి గురువులకు మనం ఇవ్వగలిగే నినమైనట్ గురు దక్షిణ వాళ్ళు మనకు నేర్పిన విలువల్ని పాటించి సమాజంలో నిలబడటమే.  అటువంటి గురువు మనం ఏం ఇవ్వాలని అనుకున్నా అది తక్కువే.. కనుక మనకు విద్య నేర్పిన గురు వులు ఎప్పుడు ఎక్కడ  కనపడినా రెండు చేతులు జోడించి నమస్కరిద్దాం.

కామెంట్‌లు లేవు: