మహాభారతము ' ...63 .
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /
దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//
అరణ్యపర్వం.
ద్రౌపది ధర్మరాజుతో ధర్మాధర్మాల గురించి చర్చిస్తూ యిలా అన్నది :
' మహారాజా ! మీరూ, మీ సోదరులూ సదా ధర్మాన్నే ఆచరిస్తూ, ధర్మ ప్రచార నిర్వహణలోనే వున్నారు. తమరైతే, ధర్మమార్గ నిమిత్తము, నన్ను, మీ ప్రియమైన సోదరులనూ కూడా వదులుకోవడానికి సిద్ధంగా వుంటారు. ధర్మో రక్షతి: రక్షిత: అని రాజు ధర్మబుద్ధితో వుంటే, ధర్మమూ రాజును రక్షిస్తుందని ఆప్తవాక్యం. కానీ మీ విషయంలో యీసూక్తి పనిజేస్తున్నట్లు లేదు. మీరు ధర్మాన్ని పట్టుకుని ప్రాకులాడుతున్నా, ధర్మం మిమ్ములను క్రీగంటకూడా చూడడం లేదు.'
' ధర్మనందనా ! మీరు ధర్మాన్ని నీడలాగా వెన్నంటి వున్నారు. అహంకారాన్ని దరి జేరనీయలేదు. బుధజనులను పూజించారు, చేతికి యెముకలేకుండా దానధర్మాలు చేశారు. ఇంత మానసికవ్యధ అనుభవిస్తూ కూడా, అరణ్యాలలో తిరుగుతున్నా, ధర్మోపన్యాసాలు చేస్తున్నారు. ఇన్ని మంచిగుణాలు వుండీ, జూదం అనే వ్యసనం యెలా పట్టి కుదిపేసింది తమరిని ? '
' స్వామీ ! ఇదంతా దైవాధీనమైన ప్రక్రియ. మనమందరమూ, ఆ పరమేశ్వరుని చేత ఆడింపబడుతున్న, కీలు బొమ్మలమేమో అనిపిస్తున్నది. పిల్లలు ఆటబొమ్మలతో ఆడుకుంటే, పరమాత్మ జీవులతో ఆడుకుంటున్నాడేమో ! తానే కర్మలు చేయిస్తాడు. కర్మఫలాలు యిస్తాడు. తాను మాత్రం దేనినీ అంటిపెట్టుకుని వుండడు. '
ధర్మపరంగా జీవిస్తూ కష్టాలు పడుతున్న మీకు, వక్రమార్గాన జీవిస్తున్నా రాచరికం అనుభవిస్తున్న దుర్యోధనునికి, ఈశ్వరదృష్టే కారణం కదా ! ఇదేకదా ఈశ్వర నిర్ణయం. ' అన్నది ద్రౌపది.
ద్రౌపది మాటలకు అమితాశ్చర్యాన్ని వ్యక్తం చేసిన ధర్మరాజు, ' ద్రౌపదీ ! నీవు చాలా
అద్భుతంగా నేర్పుగా మాట్లాడతావు. నా దుర్దశను అడ్డంపెట్టుకుని నీవు నాస్తికవాదాన్ని ప్రతిపాదిస్తున్నావు. కష్టాలు పడుతున్నప్పుడు, దేవుని నిందించడం, సాధారణంగా అందరూ చేసేపని ! ఏ విధమైన సందేహాలు లేకుండా సంపూర్ణ శరణాగతితో, భగవంతుని ఆశ్రయించేవాడు, ఇహంలో, పరంలో సుఖశాంతులు పొందుతారు. '
' ద్రౌపదీ ! మానవులు ధర్మమనే నావను ఆశ్రయించి, సంసార సాగరాన్ని దాటాలనే తాపత్రయంతో వుండాలి. అంతెందుకు, నాముందు కూర్చున్న యీ అయోనిజ, ద్రుపదరాజ పుత్రి, యజ్ఞఫలం కాదా ! ద్రుపదునికి ఆ పుణ్యఫలం యెలాదక్కింది ?.'
'ఫలం అందలేదని దేవతలని నిందించతగునా ! నేను యేనాడు కర్మలు చేసి ఫలాన్ని ఆశించలేదు. యజ్ఞాలు, దానములు, ధర్మములు వూపిరిగానే జీవించినవాడిని. ద్రుపదరాజ పుత్రీ ! ధర్మము అతిసూక్ష్మమైనది. ధర్మము సంశయాలకు అతీతమైనది. నీ సంశయాలు ముందుముందు సూర్యరశ్మి తగిలి పొగమంచు కరిగిపోయినట్లుగా, పటాపంచలు అగుగాక ! నాస్తికభావం విడిచిపెట్టు. పరమేశ్వరుని లీలలను ఆక్షేపించవద్దు. ' అని హితోపదేశం చేశాడు ధర్మరాజు.
' స్వామీ ! నేను దైవనింద చేయలేదు. ఇలా ఎందుకు జరిగిందని ఆర్తితో విచారిస్తున్నాను. విలపిస్తున్నాను. దిక్కుతెలియక అలమటిస్తున్నాను.. ధర్మజా ! కర్మలు అనివార్యములు. ఫలం భగవంతుడిచ్చేది అయినా, మన ప్రయత్నం చేయవలెను కదా ! అదే మానవప్రయత్నం. నువ్వులలో నూనె, ఆవులో పాలు, కొయ్యలో అగ్ని వాటి అంతట అవి బహిర్గతంకావు కదా ! పురుష ప్రయత్నమే, ధీర పురుషుల లక్షణం. కర్మచేసినా ఫలం లభించలేదంటే, పురుష ప్రయత్నలోపమే ! '
' మన రాజ్యాన్ని అపహరించిన దుర్యోధనుని పై, చెయ్యవలసిన ప్రయత్నంచేస్తే, మన రాజ్యం మనకూ దక్కవచ్చుకదా ! కర్మాచరణ చేస్తే కదా భగవంతుడు యిచ్చేఫలం గురించి ఆలోచించేది. నేను చిన్నప్పుడు తండ్రి వొడిలో కూర్చుని జ్ఞానధనులు చెప్పిన విషయాలే, మీతో చర్చించాను. ' అని వినయంగా ద్రౌపది తన మనసులోని ధర్మ సందేహాన్ని, కర్మాచరణలోని విశిష్టితను చెప్పకనే చెప్పింది,
స్వ స్తి.
వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు తెలుసుకుందాం.
తీర్థాల రవి శర్మ
విశ్వ వ్యాప్త పిరమిడ్ ధ్యాన మందిరం. హిందూపురం.
9989692844
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి