29, అక్టోబర్ 2020, గురువారం

సుభాషితం

 🙏🌹🌹*నేటి సుభాషితం* 🌹🌹🙏


*శ్లోకం: సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్యానంతరం సుఖం ।*

*చక్రవత్పరివర్తంతే దుఃఖాని చ సుఖాని చ ।।*


సుఖం తర్వాత దుఃఖమూ, దుఃఖం తర్వాత సుఖమూ వస్తూ ఉంటాయి. సుఖం గానీ, దుఃఖం గానీ శాశ్వతంగా ఉండిపోవు. ఇవి రెండూ ఒకదాని తర్వాత ఒకటి ఒక చక్ర పరిభ్రమణంలోవలె వస్తూ పోతూ ఉంటాయి.


ఇది సృష్టి ధర్మంలో సహజం. కాబట్టి, సుఖం వచ్చినప్పుడు, అదియే శాశ్వతం అనుకొని పొంగిపోవడమూ, దుఃఖం వచ్చినప్పుడు అదియే శాశ్వతమనుకొని క్రుంగిపోవడమూ కూడదు.


సుఖం వచ్చినప్పుడు లేదా కలిగినప్పుడు, ఏ రకమైన అవాంతరాన్నైన  ఎదుర్కొనే మానసిక స్థైర్యాన్ని, అలాగే దుఃఖం కలిగినప్పుడు లేదా వచ్చినప్పుడు నిరాశావాదంతో కృంగిపోకుండా ఆశతో మంచి భవిష్యత్తుకై ఎదురు చూసే మనోధైర్యాన్ని అలవరచుకోవాలి.


దుర్లభం హి సదా సుఖం అని నానుడి. అంటే ఎల్లప్పుడూ సుఖమే కలిగి ఉండడము అనేది అసాధ్యము అని ప్రతీతి. మానవ జీవితంలో ఎన్నో విధాలైన ఆటుపోట్లు, సుఖ దుఃఖాలు, ఆర్థికపరమైన ఒడిదుడుకులూ అనేవి సహజం. సంసార సాగరంలో అనేకమైన ఒడిదుడుకులూ, కష్టాలూ అందరి జీవితాలలోను సహజం. వాటిని అన్నిటినీ అధిగమించి జీవన యానం చేయడం, జీవిత గమ్యాలని చేరడము అనేవి మానవ జన్మకి సార్థకతని ఇస్తాయి. తాత్కాలిక ఆటుపోట్లకి జంకి అర్థాంతర నిర్ణయాలని తీసుకోవడం అనేది బుద్ధిమంతుల లక్షణం కాదు. ఎంతటి కష్టమొచ్చినా మనో నిబ్బరాన్ని కోల్పోకుండా ఉండడం అనేది అలవరచుకోవాలి.


ఈ సత్యాన్ని గ్రహించి కష్టాలు వచ్చినప్పుడు వెనువెంటనే సుఖము కూడా తప్పకుండా వస్తుంది అనే ఆశావాదముతో స్థిరచిత్తాన్ని కలిగి ఉండి వాటిని అధిగమించగలిగే సామర్థ్యతని పెంపొందించుకోవాలనేది ఈ సుభాషితము యొక్క అంతరార్థము.


🙏🌹🌹🙏🌹🌹🙏🌹🌹🙏

కామెంట్‌లు లేవు: