29, అక్టోబర్ 2020, గురువారం

వాగ్భూషణం

 🌺మంచి మాట🌺


🌹వాగ్భూషణం🌹


ఎదుటివాడి మనసును గాయపరచేలా మాట్లాడటం, హింస కిందకే వస్తుందని ఉపనిషత్తులు పేర్కొన్నాయి. మనం ఎదుటివారిని పలుకరిస్తే పండు వెనె్నల కురిసినట్లుండాలి. ఎపుడు ఎక్కడ మాట్లాడినా అది ప్రియంగా మాట్లాడాలని భారతం కూడా చెబుతుంది. మాట మనిషి విలువను పెంచుతుంది. మంచిమనిషిగా కీర్తి తెచ్చుకోవాలంటే మంచి మాటే దానికి మార్గగామి.

‘‘మంచి మాట చాలు మనసు గాయంబు మాన్పజాల గొప్ప మంచువోలె’’ అన్నాడొక మహాకవి. ‘‘మాటల్లో ఓర్పు - మనసులో నేర్పు’’ ఉండాలి.ఈ మాటలు కూడా మితంగా ఉండాలి. అతిగా మాట్లాడడం వల్ల ఆ మాటలు పేలవంగా తయారవుతాయ. వినేవారికి విసుగును కలిగిస్తాయ. ఒక్క మాట మాట్లాడగానే వారు ఎలాంటివారో నిశితంగా చెప్పవచ్చు అని రామాయణం చెబుతుంది. హనుమంతుడు మారు వేషంలో వచ్చి రామలక్ష్మణులతో మాట్లాడితే హనుమంతుని మాట్లాడే పద్ధతిచూసి మంచివాడు హితం ఒనగూర్చువాడై ఉంటాడని రాముడు అంటాడు. సుగ్రీవుడు ఇచ్చిన మాటను మరిచాడని అట్లా మరిస్తే వాలి వెళ్లిన దోవనే సుగ్రీవుడు వెళ్తాడని చెప్పడానికి మహారౌద్రాకారుడై లక్ష్మణుడు వస్తే తార, హనుమంతులు ఎదురుగా వచ్చి తార సుగ్రీవుని దయనీయమైన స్థితి చెప్పి రుద్రావతారుడైన లక్ష్మణుని మిత్రావతారానికి తీసుకొని వస్తారు. నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరిస్తున్నట్టు ఉండ కూడదు. వినయంగా, విన్రమంగా పెద్దలు గౌరవించేట్టుగాను, పిన్నలకు బోధ చేసేసట్టుగా పలుకులుండాలని విజ్ఞులు అంటారు.

ప్రాణం పోయినా ఫరవాలేదు కానీ ఇచ్చిన మాటను తప్పదని ఆవు పులి కథ మనకు చెబుతుంది. భర్తృహరి అన్నట్టు తారాహారాలు, సుగంధ జలాభిషేకాలు, ఇతర భూషణాలన్నీ నశించవచ్చు కానీ వాక్కు నశించదు. వ్యక్తిని ఎల్లప్పుడు అలంకరించి ఉండే భూషణం వాక్కు మాత్రమే. అందుకే ‘వాగ్భూణం భూషణం’ అన్నారు. మాటమంచిదైతే వూరు మంచిదనడంలోను ఇదే అంతరార్థాన్ని కలిగి ఉంటాయ.

నాలుకపైనే నిలచిన మాట వల్లనే మిత్ర బాంధవ్యాలు లభిస్తాయి.పరుషాలకు పోతే లేనిపోని వైషమ్యాలకు తావు ఏర్పడుతుంది. అందుకే మాట్లాడేటపుడే సంయమనం పాటించాలి. విషయ సారంతో మాట్లాడేవాడు వాగ్మి, విషయం అల్పమైతే వాడిని వదరుబోతు అంటారు. వాక్చాతుర్యం కూడా గొప్ప కళ. ప్రపంచాన్ని అది పాలించినట్లుగా మరేది పాలించలేదు. మనిషిని పడగొట్టేది కూడా మాటే. మాట తీరును బట్టి మనిషిని అంచనా వేయొచ్చు. మాట విలువ తెల్సిన వారికి మాటలోని మర్మం తెలుస్తుంది. చేతులున్నందుకు దానం చేయాలి. చెవులున్నందుకు మంచిమాటలు వినాలి. నోరున్నందుకు మంచి మాట మాట్లాడాలి.

ఎవరికైనా మాట ఇచ్చే ధైర్యం, ఓదార్పు, స్ఫూర్తి, బలీయమైంది. మనసులు కలవడానికి, మనసులో ఉన్నది తెల్పడానికి, పని సాధించడానికి మాటే సాధనం. మనోవాక్కాయాలనే త్రికరణాలలో వాక్కుకున్న స్థానం విశిష్టమైంది. పరమేశ్వరుని వాక్కును ‘రుక్కు’ అంటారు.

పిండిని జల్లెడ పట్టి శుద్ధి చేసినట్లే, వాక్కును మనస్సుతో పరిశుద్ధం చేయాలి. సదాలోచనతో చేసే సంభాషణలోనే లక్ష్మీ నివశిస్తుందని రుగ్వేదం చెబుతుంది. తీయని మాట నలువైపులా ఆనందాన్ని, సుఖాన్ని పరివ్యాప్తం చేస్తుంది. ఇది వశీకరణ మంత్రం కనుక పరుష వచనాలు వదిలిపెట్టాలి. పరుషమైన మాట విషం కంటే, అగ్నికంటే ప్రమాదకరమైనది అని తులసీదాసు అంటారు. భగవంతుని ప్రస్తుతించని వాక్కులు వ్యర్థమనీ ప్రహ్లదుని చేత పోతనామాత్యుడు చెప్పించాడు.

దయ, స్నేహం, దానం, మధుర వాక్కులు మనిషికి అత్యంత ఆవశ్యకమైనవి. మూడు లోకాలలో వీటికి మించిన ఆదర్శనీయ సద్గుణాలు మరేమీ లేవు. వినయంతో కూడిన మాటలో విశ్వానే్న జయించవచ్చు కనుక నీవు సదా మంచి మాటలే మాట్లాఢుతుండమని *యయాతి తన కుమారునికి నీతిబోధ చేశాడని యయాతి వృత్తాంతం చెబుతుంది.

వీటి అన్నింటి వల్ల మనమూ మంచి చేకూర్చే మాటలే మాట్లాడుదాం. చెడుకు దూరంగా ఉందాం. *సాయబాబా కూడా పరులను ద్వేషించడం అంటే అది మహాపాపమని చెప్పేవారు . వేదవ్యాసుడు కూడా* *పరపీడనమే పరమ పాపమని చెప్పాడు. కనుక పరులకు కలలో కూడా కీడు చేయకుండా ఉందాం* 


 🎊🦚🌹🦜🌻🎊

కామెంట్‌లు లేవు: