4, ఏప్రిల్ 2021, ఆదివారం

స్థలపురాణానికి

 స్థలపురాణానికి ఆధారాలుండవు, నమ్మకం మాత్రమే వుటుంది.

............................................................


శ్రీకృష్ణదేవరాయలకు ఇద్దరు భార్యలు. పట్టపురాణి తిరుమలాంబ, రెండవభార్య చిన్నమదేవి. శ్రీకృష్ణదేవరాయలు పరమవైష్ణవుడు. తిరుమల రాయుడు ఇతని ఇలవేలుపు. 1514 నుండి 1527 వరకు ఏడుసార్లు దేవేరులతో కలిసి తిరుమల తిరువెంగడనాథుని దర్శించి అనేకకానుకలు సమర్పించినాడు.


సాళువ నరసింహదేవరాయలు నిర్మించిన గోరంట్లలోని మాధవరాయస్వామి దేవాలయ గాలిగోపురం అసంపూర్తిగా ఎందుకుందో అక్కడి స్థలపురాణం ఏం చెబుతోందో చూద్దాం.ఎందుకో తెలియదు కాని చిన్నమదేవిని స్థానికకథ ప్రకారం సానువుల చిన్నమ్మ అని పిలుస్తారు. ఆవాలునే రాయలసీమలో సాసువులు అనడం కద్దు.


ఈ సాసువుల చిన్నమ్మ ఒకసారి భర్త అనుమతితో  పరివారంతో విజయనగరంనుండి హొసకోట, బళ్ళారి, ఉదిరిపికొండ, పెనుకొండ ల మీదుగా  తిరుమల బయలుదేరింది. గోరంట్ల అప్పటికి ఓ సీమకేంద్రం. సీమంటే ఇప్పటి జిల్లా అనుకోవచ్చు. దళవాయి ఆదెప్పనాయకుడు స్థానికకార్యకర్త అనగా ప్రతినిధిగా  గోరంట్ల సీమను పాలించేవాడు. రాణి గోరంట్ల దుర్గానికి రాగానే సాయంత్రమైంది. రాత్రిప్రయాణం కుదరదు కాబట్టి గోరంట్లదేవాలయంలోనే ఆ వెన్నెల రాత్రిలో బసచేసింది పరివారంతో.


ఆ సాయంత్రపు వెలుగులో ఆలయమూర్తికి పూజలు సమర్పించి చిన్నమ్మ ఆలయశిల్పసౌందర్యాన్ని చూచి ఆనందించింది.



ఆ పండు వెన్నెల రాత్రిలో ఆదెప్పనాయకుడు భార్య సమేతంగా రాణి చిన్నమదేవికి విందుభోజనం ఏర్పాటు చేశాడు. భోజనానంతరం తనతండ్రి వయసున్న అదెప్పనాయకుడితో రాణిగారు  పిచ్చాపాటి మాట్లాడుకొన్నారు.


దేవాలయం అద్భుతశిల్పకళతో అలరారుతోందని కాని నలుదిశలా గాలిగోపురాలు లేవని వాటిని తాను తిరుమల నుండి వచ్చేలోగా వాటిని పూర్తిచేయాలని అతనిని ఆదేశించింది. కాలినడక, అందలంలో ప్రయాణంకాబట్టి గోరంట్లకు తిరిగిరావటానికి  ఎంతలేదన్న నెలరోజులైనా పడుతుంది ఈలోగా గాలిగోపుర నిర్మాణాలు పూర్తైతే వాటిని చూచి దేవుడిసన్నిధిలో గడపాలని చిన్నమ్మ ఉద్దేశ్యం. అందుకు సరిపడ  ధనాన్ని కూడా అందచేస్తానని రాణి చెప్పింది.


అందుకు ఆ దళావాయి, కార్యకర్త అయిన ఆదెప్పనాయకుడు నెలరోజుల సమయంలో నాలుగుగోపుర నిర్మాణాలు పూర్తి చేయలేనని కనీసం ఆరునెలలైనా గడువుకావాలని విన్నవించుకొన్నాడు. అంత సమయం అక్కరలేదని నెలరోజులు చాలని చెప్పింది.


వారి మాటలు పంతాల వరకు వెళ్ళాయి. నేనైతే ఒక గొపుర  నిర్మాణాన్ని ఐదు రోజులలో పూర్తి చేయించగలనని రాణి పలికింది.సాధ్యంకాదని ఆదెప్పనాయకుడు పలికాడు.


నేను 5 రోజులలో పూర్తిచేయించగలనని ఒకవేళ పూర్తి చేయించకపోతే ఆదెప్పనాయకుడిని  గోరంట్ల మండలేశ్వరునిగా చేయించగలనని, అలా నిర్మాణం పూర్తిచేసినట్లైతే కార్యకర్తను కారాగారంలో బందీచేయించగలనని పంతం కాసింది.


ఆదెప్ప అందుకు సరేనన్నాడు. రాజు తలచుకొంటే ఏ పనైనా ఆగగలదా. చుట్టుపట్ల దుర్గాలనుండి నేర్పరులైన శిల్పులు వాస్తుపురుషులు పనివారు వచ్చారు. పనులు చకచక మొదలుపెట్టారు. నాలుగు పగల్లు నాలుగు రాత్రులు గడిచాయి. ఇక ఒక రోజే గడువుంది.తూర్పు గోపుర నిర్మాణం రాత్రిలోగా పూర్తిచేయాలి. వేగంగా గోపురనిర్మాణ పనులు కోడికూసేలోగా పూర్తిచేయాలి.ఆ వేగాన్ని చూచిన ఆదెప్పనాయకుడు భయపడ్డాడు.


శిక్షనుండి తప్పించుకోటానికి కపటోపాయం చేశాడు. తెల్లవారటానికి ఇంకా రెండుఝాములందనంగా కోడిపుంజు తెచ్చి ఆలయానికి దగ్గరలో కోక్కొరకోయని కూయించాడు.


తెల్లవారిందని అందరు భ్రమపడినారు. అనుకొన్న గడువులోగా తూర్పు గోపురనిర్మాణం చేయించ లేకపోయానని అవమానంగా భావించి సాసువుల చిన్నమ్మ  అదెప్పనాయకుడిని మండలేశ్వరునిగా నియమించాలని రాయలకు ఉత్తరం వ్రాయించి, అప్పటికప్పుడే తిరుమలకు బయలుదేరి వెళ్ళిపోయింది.


నా దృష్టిలో గోపుర అసంపూర్తి నిర్మాణానికి యుద్ధాలు, అంటురోగాలు, ఆత్మీయుల మరణాలు, లేదా ప్రకృతి వైపరీత్యాలు కారణం కావచ్చును.


స్థలపురాణానికి ఆధారాలుండవు, నమ్మకం మాత్రమే వుటుంది.

.....................................................................................................................................జి.బి.విశ్వనాథ.9441245857. అనంతపురం.

కామెంట్‌లు లేవు: