4, ఏప్రిల్ 2021, ఆదివారం

*కంచి పరమాచార్య వైభవం*

 🌺🌻 *కంచి పరమాచార్య వైభవం* 🌻🌺


*అన్నదమ్ములు - ఆస్తి పంపకం* 


ఒకరోజు కంచిలో మహాస్వామి వారి దర్శనానికి కేరళలోని ఒక ఉన్నతమైన కుటుంబం నుండి దంపతులొకరు వచ్చారు. అతని ప్రకారం వారి కుటుంబ ఆస్తి వారిరువురు అన్నదమ్ముల మధ్య స్నేహపూర్వకంగా పంచుకోవడం సాధ్యపడదు. అతని అభిప్రాయంలో తన తమ్ముడు చాలా మొండివాడు. తన మాటకు విలువ ఇవ్వకుండా వేరుకాపురం పెట్టాడు. తను సమానంగా అస్తిని పంచి ఇద్దాము అని అనుకున్నా తను చెప్పే మాటలకు విలువ ఇవ్వడు. కాబట్టి ఆస్తి పంపకాల కోసం కోర్టులో దావా వెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అదే విషయమై స్వామివారిని కలిసి వారి ఆశీస్సుల కోసం వచ్చాడు. 


అంతా విన్న స్వామివారు, “సరే నువ్వు దావా వేస్తే ఎంత డబ్బుకి స్టాంప్ పేపర్స్ కొనవలసి ఉంటుంది?” అని అడిగారు. 


ఆ మొత్తం కొన్ని వేలల్లో ఉంటుందని చెప్పాడు. ”మరి న్యాయవాదికి ఎంత ఇవ్వాలి?”


అదీ కొంచం పెద్ద మొత్తం చెప్పాడు. 


”అది పూర్వీకుల ఆస్తి కాబట్టి చాలా ప్రభుత్వ శాఖల నుండి వాటికి సంబంధించిన కొన్ని పత్రాలను తెచ్చుకోవలసి ఉంటుంది. మరి దానికి కొంచం ఖర్చు అవుతుంది కదా? మరి ఆ ఖర్చు ఎంతవుతుంది?”


అవును అని అందుకు కొంచం మొత్తం అవుతుందని చెప్పాడు. 


”సరే! సమాన్యంగా ఇటువంటి దావాలు తొందరగా పూర్తి కావు. కాబట్టి ఈ దావా ఎంత కాలానికి ముగుస్తుంది అని అనుకుంటున్నావు?”


“అది చాలా కాలం పట్టవచ్చు” 


”అవును. అది చివరికి ముగిసినా, తీర్పు నీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కదా?”


“అలా అవుతుందని నేను అనుకోవడం లేదు”


“సరే! నీకు అనుకూలంగానే వచ్చింది అనుకుందాము. నీ తమ్ముడు పై న్యాయాలయానికి వెళ్ళవచ్చు కదా?”


“అవును. వెళ్ళవచ్చు”


“మరి అప్పుడు ఎంతో ఉన్నతమైన మీ కుటుంబం విషయం ప్రముఖ పత్రికల్లో ప్రచురించబడి అందరికి తెలియబడుతుంది. అవును కదా?”


అప్పుడు అతను కొంచం ఆలోచిస్తున్నట్టుగా చిన్నగా అవును అన్నాడు. ”కాబట్టి ఈ విషయమై న్యాయస్థానానికి వెళ్తే డబ్బు, సమయం, శక్తి వృధా. మీ ఇంటి గౌరవ మర్యాదలు, మీ అన్నదమ్ముల పరువు ప్రతిష్టలు దిగజారిపోతాయి. మరి దాని గురించి ఆలోచించావా?”


“ఏమి జరిగినా పర్వాలేదు నాకు సమ్మతమే అంటావా? ఇదేనా నీకు కావాల్సింది”


ఆ భక్తుడు మనసులో ఏ ఆలోచనతో అయితే వచ్చాడో ఇప్పుడు అది మాయమైపోయింది. కానీ ఇప్పుడు ఏమి చేయాలో అతనికి అర్థం కావటం లేదు. 


“పెరియవ మీరు చెప్పినట్టు దావా వెయ్యడం సరికాదు. నేను ఇప్పుడు ఏమి చెయ్యాలో నా తక్షణ కర్తవ్యం ఏంటో మీరే సెలవివ్వాలి” అని వేడుకున్నాడు. 


”ఏదో కారణానికి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయినంత మాత్రాన అలాగే ఉండిపోవాలని లేదు కదా? నువ్వు ఎవరు? తను ఎవరు? మీ మధ్య గొడవ ఎంత పెద్దదైనా కావచ్చు ఇద్దరూ మళ్ళా కలవాల్సిందే. ఎందుకు మీరు ఇలాంటి మనస్థత్వాన్ని పెంపొందించుకోకూడదు?”


మహాస్వామి వారు కొద్దిసేపు ఆలోచించి, “సరే మీరిద్దరు ఏమి చెయ్యాలో నేను చెప్తాను. చాలా పళ్ళు, పూలు కొనుక్కుని నేరుగా మీ తమ్ముడి ఇంటికి వెళ్ళు. అతనిపై గుండెలనిండా ప్రేమతో వెళ్ళు. అతను తన భార్యతో కలిసి నిన్ను ఆదరంతో స్వీకరిస్తాడు. ప్రేమతో గుండేల్లోనుండి ఈ మాటలు చెప్పు ‘ఏదో జరిగినదేదో జరిగిపోయింది. నువ్వు ఎవరు? నేను ఎవరు? మొత్తం ఆస్తి అంతా నీ దగ్గరే ఉన్నా అది నా వద్ద ఉన్నట్టే. నాకూ సంసారం ఉంది కాబట్టి నీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వు. ఈ జన్మకే మనం అన్నదమ్ములం. చక్కగా ఉందాం’ అని చెప్పమని” చెప్పారు.


మహాస్వామి వారి మాటలననుసరించి, తమ్ముని ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుని స్వామి వారి వద్ద సెలవు తీసుకున్నారు. 


వారు వెళ్ళిన తరువాత స్వామి వారు అక్కడున్నవారితో, “తనకుతానుగా వచ్చిన అన్నను చూసినవెంటనే వాళ్ళ శతృత్వం సగం పోతుంది. ప్రేమతో పలకరించిన అన్న మాటలను విన్న వెంటనే మొత్తం మరచిపోయి ఇతణ్ణి ఆదరిస్తాడు. కోర్టుకు వెళ్ళకుండానే వారు సంతోషంగా ఆస్తిని పంచుకుంటారు. మనం మంచి ఆలోచనలతో ప్రేమతో వెళ్తే, వారు కూడా మనల్ని అలానే ఆదరిస్తారు”


పరమాచార్య స్వామి వారి సలహా పనిచేసింది. కొన్ని రోజుల తరువాత అంతా సవ్యంగా జరిగినదనే వార్త శ్రీమఠానికి వచ్చింది.


*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*


*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం॥*


🙏జై శ్రీ సాయి మాస్టర్🙏

కామెంట్‌లు లేవు: