వడ్లు గురించి సంపూర్ణ వివరణ - 1
వడ్లను సంస్కృతం నందు "శాలి ధాన్యం" అని పేరుతో పిలుస్తారు . సాధారణముగా హేమంత ఋతువులో పైరగుట వలన "హైమంతిక ధాన్యం " అని కూడా పిలుస్తారు . సంస్కృత నిఘంటుకార్తలు వడ్లను రెండు తెగలుగా విడదీసి శాలిధాన్యం అని వ్రీహీ ధాన్యం అని పిలుయుచున్నారు. వ్రీహి ధాన్యం అనునది వర్షాకాలం నందు పండును. శాలిధాన్యం అనునవి హేమంత ఋతువు నందు పండును అని సంస్కృత నిఘంటుకర్తల అభిప్రాయం .
వ్రీహిధాన్యము నందు కృష్ణ వ్రీహి ధాన్యము ( నల్ల వడ్లు ) , పాటల వ్రీహి ధాన్యము , కుక్కు తాండకములు , శాలాముఖములు , జంతుముఖములు అని రకాలు కలవు . వ్రీహి ధాన్యము పాకము నందు తియ్యగా ఉండటం , చలవనిచ్చుట , కొద్దిపాటి మలబద్దకం కలగచేయుట , వ్రీహి ధాన్యము అన్నింటిలో కృష్ణ వ్రీహి ధాన్యము మిక్కిలి శ్రేష్టమైనది . ఈ ధాన్యము యొక్క అన్నము తియ్యగా , తెల్లగా ఉండును. కొంచం వగరు కలిగి పిత్తాన్ని హరించును . వీర్యవృద్ధిని ఇస్తూ , క్రిమిరోగములు , కఫవ్యాధులు , రక్తపిత్త వ్యాధులు , తాపదాహములు మొదలగువాటిని పోగొట్టి బుద్ది సూక్ష్మత కలిగించును . కొంచం వాతమును కూడా కలిగించును. ఈ వ్రీహిధాన్యములో షష్ఠికములు ( ఆరు నెలలకు పండునవి ) , మహా వ్రీహి ధాన్యము ( పెద్ద వడ్లు ), యవక ధాన్యము , పాక వ్రీహి ధాన్యము , రక్తసార ముఖములు ( ఎర్ర మొల కోలుకులు ) మొదలగు రకాలు కూడా కలవు .
శాలి ధాన్యము నందు రక్తశాలి , మహాశాలి , సుగంధప్రసవ , బృందారక , ముష్టక , శావరశాలి మొదలైన రకాలు కలవు . అన్నము రుచికరంగా , స్నిగ్దముగా ( చమురు కలిగి ) , బలమును , వీర్యమును , లఘుత్వమును ఇచ్చునదై , చలువనిచ్చునదై ఉండును.
తరవాతి పోస్టు నందు అతిముఖ్యమైన వడ్ల రకాలు , వాటిలోని ఔషధ గుణాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి