21, మార్చి 2023, మంగళవారం

క్రొత్త అమావాస్య



: 🙏🌹నేడు క్రొత్త అమావాస్య🌹🙏


ఉగాదికి ముందు రోజును *క్రొత్త అమావాస్య* అనడం ఒక వాడుక. ముఖ్యంగా గుంటూరు, క్రిష్ణా, ఉభయ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలలో చాలా విశేషంగా చెప్పుకుంటారు.


రాబోయే క్రొత్త సంవత్సరానికి వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు. కనుక క్రొత్త అమావాస్య అని మన పెద్దలు అంటూంటారు.


క్రొత్త అమావాస్య నాడు గ్రామ దేవత (నూకాలమ్మ, మరిడమ్మ, పోలేరమ్మ, దుర్గాలమ్మ మొదలైన గ్రామదేవతలు) లను ఆరాధించుతారు. ఈ రోజున అమ్మవారికి ఉపారములు (అమ్మవారికి పెట్టే నైవేద్యములు) పెడతారు.అవి వేడి ఉపారము, చల్లని ఉపారము అని కడుపు చలువకోసం (తమ పిల్లలు చల్లగా ఉండాలని) పెడతారు. పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలికి ఇస్తారు. 


క్రొత్ప అమావాస్యనాడు ముఖ్యంగా పప్పు (పెసర పప్పు), తెలగపిండి (నువ్వుల చెక్క) కూర చేస్తారు. ఇంకా పోలి పూర్ణం బూరెలు, గారెలు  వడపప్పు, పానకం, పెరుగు (చల్లని ఉపారంలో ఇస్తారు).


ఇంటిలో ఈశాన్యంలో గోడకు గుండ్రంగా పసుపురాసి (అమ్మవారి ముఖం వలె), కుంకుమతో బొట్టుపెట్టి అమ్మవారిని ఆహ్వానించి పూజించుతారు.


అమ్మవారికి నైవేద్యంగా మూడు విస్తర్లు వేసి,వండిన పదార్థములను వడ్డించి నైవేద్యం పెట్టి హారతి ఇస్తారు. అనంతరం అమ్మవారిని ధ్యానించి, తమ పిల్లలు చల్లగా ఉండాలని, వృద్ధిలోకి రావాలని మ్రొక్కుకుంటారు.


అమ్మ వారికి పెట్టిన నైవేద్యాన్ని ఇంటి చాకలిని పిలిచి అతనికి ఇస్తారు. 


🙏🌹🙏🌹🙏🌹



: *రేపే ఉగాది* పర్వదినం..  *శోభకృత్ నామ సంవత్సరం శోభాయమానంగా రానుంది*.  *ఈ సందర్భంగా మనందరి జీవితాలు ఆరు రుచులతో ఆరోగ్యంగా ఆనందంగా సాగిపోవాలని కోరుకుందాం*.  ఇప్పుడు ఉగాది పచ్చడి గురించి నాలుగు మాటలు.  ఉగాది పండుగ నాడు తయారుచేసే ఆరు రుచుల ఉగాది పచ్చడిలో పలు ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి.  దీనికి మూలం ఆయుర్వేద శాస్త్రం.  తెలుగువారి భోజన సంప్రదాయాలు ఆయుర్వేదంతో ముడిపడి ఉన్నాయి.  *ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ప్రతిరోజూ యీ ఉగాది పచ్చడి తింటే రానున్న వేసవికి శరీరం  తట్టుకోగలదని మన పూర్వీకులు ధృవీకరించారు*..  సమ పాళ్లలో ఆరు రుచులు ఉండాలి.  అంతేకాకుండా ప్రతీరోజూ కూడా మన ఆహారంలో యీ ఆరు రుచులు..  ఉప్పు కారం తీపి పులుపు వగరు చేదు..  ఉండేలా చూసుకోవాలని వైద్యులు కూడా సూచిస్తారు.  బెల్లంలో తీపి, చింతపండు రసంలో పులుపు, మిరియాల పొడిలో కారం, లేత మామిడి పిందెల్లో వగరు, వేపపువ్వులో చేదు.. ప్రధాన రుచులుగా ఉంటాయి.  యీ ఆరు రుచుల శక్తివంతమైన ఆహారమే ఉగాది పచ్చడి.  ఆయుర్వేద శాస్త్రం ఏ రుచికి ఏ గుణం ఉంటుందో స్పష్టంగా చెప్పింది.  పరిమితిగా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు, అతిగా తీసుకుంటే కలిగే నష్టాలు కూడా వివరించింది. గనుక యీ ఆరు రుచులు సమపాళ్లలో రంగరించి ఉగాది పచ్చడి చేసుకోవాలి.  చాలామంది ఉగాది పచ్చడిలో ఉండే వగరు చేదు రుచుల వల్ల తినడానికి అంతగా ఇష్టపడరు.  ఆరోగ్య ప్రయోజనాలు దృష్ట్యా ఉగాది పచ్చడి ఒక్క ఉగాది రోజునే కాకుండా ఓ వారం పదిరోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. *మా తరఫున మీ అందరికి, మీ కుటుంబ సభ్యులకి  శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు*....

కామెంట్‌లు లేవు: