3, జూన్ 2023, శనివారం

మన గుడి :

 🕉 మన గుడి :






⚜ కడప జిల్లా : ఒంటిమిట్ట


⚜ శ్రీ కోదండ రామాలయం 


💠 సీతారామ లక్ష్మణులు, స్వామిభక్తికి ప్రతీకగా చేతులు జోడించి ముగ్గురికీ నమస్కరిస్తున్న ఆంజనేయుడు.

ఏ రామాలయంలోనైనా కనిపించే దృశ్యమిదే. కానీ ఆ నీలమేఘశ్యాముని పాదాలచెంత అంజనీ పుత్రుడు లేని రామాలయాన్ని ఎవరైనా ఊహించగలరా..! 

అలాంటి ఆలయంమే కడప జిల్లాలో 

" ఒంటిమిట్ట ".


💠 ఒక మిట్టమీద నిర్మింపబడ్డ రామాలయం అవటంవల్ల ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అని పేరు వచ్చింది.

ఈ  ఆలయంలోని విగ్రహాలు ఒకే శిలలో మలచబడ్డాయి.  అందుకే దీనికి ఏక శిలా నగరమనే పేరు వచ్చింది.

ఏకశిలపైన సీతారామలక్ష్మణ విగ్రహాలున్న ఈ ఆలయంలో రాముడు యోగముద్రలో దర్శనమివ్వడం విశేషం.


⚜ స్థల పురాణం ⚜


💠 రామలక్ష్మణులు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు యాగరక్షణకు వారిని విశ్వామిత్రుడు తీసుకెళ్లిన చరిత్ర అందరికీ తెలిసిందే. కానీ సీతారామ కల్యాణం జరిగాక కూడా అలాంటి సందర్భమే ఒకటి ఏర్పడింది. 

యజ్ఞయాగాలకు రాక్షసులు ఆటంకం కలిగించడంతో మృకండు మహర్షి, శృంగి మహర్షి రాముని ప్రార్థించడంతో దుష్టశిక్షణ కోసం ఆ స్వామి సీతా, లక్ష్మణ సమేతుడై అంబులపొది, పిడిబాకు, కోదండం పట్టుకుని వెళ్లారు.రాముడు వాళ్లను హతమార్చి యాగరక్షణ చేశాడట.


💠 అందుకు ప్రతిగా ఈ మహర్షులు ఏకశిలపైన సీతారామ లక్ష్మణుల విగ్రహాలను చెక్కించారనీ, అయితే  ఆ తరువాత రాముడి భక్తుడైన జాంబవంతుడు  రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.


💠 ఈ ఆలయంలోని రామతీర్థాన్ని రాముడే సీతకోసం ఏర్పాటుచేశాడని అంటారు. మొదట ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారనీ.. క్రమంగా అదే రామతీర్థం అయ్యిందనీ చెబుతారు.

ఈ ప్రాంతానికి వచ్చిన సీతాదేవి చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు లేక రాముల వారికి చెప్పిందట. 

అప్పుడు శ్రీరాముడు నీళ్లు పైపైకి ఉబికివచ్చేలా బాణాలు వేశారట. వారి బాణాల వల్ల ఏర్పడిన తీర్థాలను  రామ తీర్థoగా పిలుచుకుంటారు భక్తులు.

ఆలయంలో  బుగ్గను రామతీర్థంగా , పక్కనే ఉన్న చిన్న కోనేరును లక్ష్మణ తీర్థంగా ప్రసిద్ధి చెందాయి. బ్రహ్మోత్సవాల వేళ చక్రస్నానం ఇక్కడే వేడుకగా నిర్వహించడం కొన్ని ఏళ్లుగా ఆనవాయితీ


💠 ఒక కధనం ప్రకారం ఒంటుడు, మిట్టుడు అనే ఇద్దరు రామ భక్తులు (వీరు చోరులు అని కూడా అంటారు). ఈ రాముడిని కొలిచిన ఆ గజదొంగలు ఆ వృత్తిని మానుకుని నిజాయితీపరులుగా బతికారు. 

ఓసారి ఈ ప్రాంతానికి ఉదయగిరిని పాలించే కంపరాజు వచ్చాడు, ఈ అన్నదమ్ములు రాజుకు అన్నిరకాల సేవలు చేయడమే కాక చుట్టూ ఉన్న ప్రాంతాలనూ చూపించారు. ఆ రాజు ఆనందించి ఏదయినా కోరుకోమని చెప్పగా, ఇక్కడ రామాలయం కట్టించమని అడిగారట.

గుడి కట్టే  బాధ్యతను వీళ్లకే అప్పగించి వెళ్లిపోయాడు.దాంతో వీళ్లిద్దరూ ఎంతో భక్తిశ్రద్ధలతో కొన్నేళ్లు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారట.వాళ్లిద్దరూ కట్టించడం వల్లే ఈ ఆలయానికి ఒంటిమిట్ట రామాలయం అనే పేరు వచ్చిందoటారు.


💠ఈ ఆలయ నిర్మాణ సమయానికి రాముడికి హనుమంతుడు పరిచయం కాలేదనీ.. అందుకే ఇక్కడ హనుమంతుడి విగ్రహం లేదనే నమ్మకం ఉంది.


💠భక్త  పోతనామాత్యుల వారు తన భాగవతాన్ని ఒంటిమిట్ట కోదండరాముడికే అంకితమిచ్చారు.

పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇక్కడ స్వామిని దర్శించుకున్నాకనే కాలజ్ఞానం రాశారని ప్రతీతి.


💠 సందర్శకులను ఆకర్షించే అంశాల్లో ఇంకొకటి ఇమాంబేగ్ బావి.  1640 సం. లో కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధి ఇమాంబేగ్.   ఒకసారి ఆయన ఈ ఆలయానికి వచ్చిన భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని ప్రశ్నించాడుట.  చిత్త శుధ్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడని వారు సమాధానం ఇవ్వగా ఆయన మూడు సార్లు రాముణ్ణి పిలిచారట.  అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అని సమాధానం వచ్చింది.  ఆయన ఆశ్చర్య చకితుడై, స్వామి భక్తుడిగా మారి, అక్కడి నీటి అవసరాలకోసం ఒక బావిని తవ్వించాడు.  ఆయన పేరుమీద ఆ బావిని  ఇమాంబేగ్ బావి అటారు.


💠 వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర వాల్మీకిగా పేరుపొందిన శ్రీ వావిలకొలను సుబ్బారావు

జీర్ణదశకు చేరిన ఒంటిమిట్ట రామాలయాన్ని ఉద్ధరించటానికి కంకణం కట్టుకొని,ఆయన టెంకాయ చిప్పను చేతిలో ధరించి ఆంధ్రదేశంలో ఊరూరా తిరిగి బిచ్చమెత్తి ఆ ధనంతో ఆయన ఆలయాన్ని పునరుద్ధరించాడు. చివరకు తాను ఖాళీ అయిన టెంకాయచిప్పను చూచి "నీ జన్మ ధన్యము కదే టెంకయ చిప్పా" అంటూ దానిమీద 'టెంకాయ చిప్ప శతకం' చెప్పిన మహాకవి.


⚜ ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం రాత్రే ఎందుకు చేస్తారు?


💠 ఒంటిమిట్టలో పున్నమి వెన్నెలలో రాములోరి కళ్యాణం నిర్వహిస్తారు. రాత్రే కల్యాణం జరగడానికి పురాణాల్లో ఓ కథ ఉంది..విష్ణుమూర్తి, లక్ష్మిదేవి వివాహం పగలు జరుగుతుంది. తాను అక్క లక్ష్మిదేవి పెళ్లిని చూడలేకపోతున్నానని చంద్రుడు విష్ణుమూర్తికి చెప్పడంతో..నీ కోరిక రామావతారంలో తీరుతుందని విష్ణుమూర్తి చంద్రుడికి వరమిస్తాడు. అందుకే ఈ ఆలయంలో నవమి రోజు కాకుండా చైత్రశుద్ధ పౌర్ణమి రోజు సీతారాముల వివాహం జరుగుతుందని ఒక పురాణ కధ ప్రాచుర్యంలో ఉంది.


💠 కడప నుంచి 25 కిమీ దూరం

కామెంట్‌లు లేవు: